సమగ్ర ఉపశమన ప్యాకేజీ ప్రకటించాలి

ABN , First Publish Date - 2020-04-10T07:18:09+05:30 IST

రాష్ట్రంలో కరోనాకు సంబంధించిన వాస్తవ గణాంకాలతో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వాస్తవాలు వెల్లడించాలని టీపీసీసీ...

సమగ్ర ఉపశమన ప్యాకేజీ ప్రకటించాలి

కరోనాపై శ్వేతపత్రం విడుదల చేయాలి

రాష్ట్ర ఆర్థికస్థితిపై వాస్తవాలు చెప్పాలి

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ డిమాండ్‌

లాక్‌డౌన్‌ ప్రభావం దీర్ఘకాలికమని వ్యాఖ్య


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనాకు సంబంధించిన వాస్తవ గణాంకాలతో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వాస్తవాలు వెల్లడించాలని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. లాక్‌డౌన్‌ ప్రభావం దీర్ఘకాలికంగా ఉంటుందని, అన్ని వర్గాలకు సమగ్ర ఉపశమన ప్యాకేజీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. టీపీసీసీ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యులు, డీసీసీల అధ్యక్షులు, టీపీసీసీ అనుబంధ సంస్థల చైర్మన్లతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా సోకిన వారు, అనుమానితులు, మరణించిన వారి గణాంకాలను ప్రభుత్వం దాచిపెడుతోందన్న అనుమానాలున్నాయని అన్నారు. ‘‘రాష్ట్రంలో కరోనా కేసుల స్థితిగతులపై సీఎం కేసీఆర్‌ పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. ఏప్రిల్‌ 7 తర్వాత తెలంగాణకు కొవిడ్‌ ముప్పు నుంచి విముక్తి లభిస్తుందంటూ ఓసారి మీడియాకు చెప్పారు. మర్కజ్‌ ఘటన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అందుకే వాస్తవ కేసులు, అనుమానితులు, నిర్భంధంలో ఉన్న వారు.. కరోనా పరీక్షల వివరాలు విడుదల చేయాలి’’ అని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించలేకపోతున్నామని చెప్పడం నమ్మశక్యంగా లేదన్నారు. కరోనా కట్టడి కోసం చేసిన ఖర్చు వివరాలను సీఎం వెల్లడించాలని సూచించారు. లాక్‌డౌన్‌ దీర్ఘకాలికంగా కొనసాగే అవకాశం ఉన్నందున విస్తృత సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రోజువారీ కూలీలు, వలస కార్మికులు, నిరాశ్రయులు, పేదలకు ఆహారం అందించాలని సూచించారు. 

Updated Date - 2020-04-10T07:18:09+05:30 IST