కరోనా వేళ.. పడకేసిన ‘పురపాలన’

ABN , First Publish Date - 2021-05-11T09:24:25+05:30 IST

రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రతకు అనుగుణంగా అవసరమైన నివారణ చర్యలు తీసుకోవడంలో పురపాలక శాఖ విఫలమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి

కరోనా వేళ.. పడకేసిన ‘పురపాలన’

కొత్తపాలక వర్గాల జాడేదీ?

కరోనా సహాయక చర్యల్లో చురుకేదీ?

ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు మృగ్యం

నిధులు లేకపోవడంతో నీరసిస్తున్న సేవలు

కేర్‌ సెంటర్లు, ఐసొలేషన్‌ కేంద్రాల ఏర్పాటు లేక నగరాలు, పట్టణాల్లో పెరుగుతున్న వైరస్‌ వ్యాప్తి


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రతకు అనుగుణంగా అవసరమైన నివారణ చర్యలు తీసుకోవడంలో పురపాలక శాఖ విఫలమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జనసమ్మర్ధం అధికంగా ఉండి, కొవిడ్‌-19 వ్యాప్తికి కేంద్రస్థానాలుగా మారుతున్న 125 పట్టణ స్థా నిక సంస్థల్లో పురపాలక శాఖ ముందు జాగ్రత్తలుగానీ, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఉపకరించే చర్యలను గానీ చేపట్టడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. పురపాలక శాఖకు నిధులను సమకూర్చాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అలా చేయకపోవడంతోపాటు పాలక వరా ్గల్లో నెలకొన్న నిర్లిప్తత, అధికార యంత్రాంగంలో అలస త్వం కారణంగా.. స్థానిక సంస్థల్లో పరిస్థితులు దిగజారుతున్నాయని తెలుస్తోంది. ఫలితంగా నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల్లో కరోనా వ్యాప్తి పెరిగి పోతోంది.  


కానరాని.. కేర్‌ సెంటర్లు

తొలి దశ కరోనా సమయంలో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. అదేవిధంగా.. పట్టణాలు, నగరాల్లో రసాయనాల పిచికారీ చేశారు. కంటైన్‌మెంట్‌ జోన్లను ఏర్పాటు చేశారు. ఈ పనులన్నింటినీ పకడ్బందీగా చేపట్టేందుకు వీలుగా తాత్కాలిక ప్రాతిపదికన అదనపు సిబ్బందిని నియమించుకున్నారు. దీంతో నగరాలు, పట్టణాల్లో చెప్పుకోదగిన రీతిలో కొవిడ్‌-19 నియంత్రణ సాధ్యమైంది. కరోనా కేర్‌ సెంటర్ల ఏర్పాటు ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందాయి. అయితే.. అప్పటితో పోల్చితే ఎన్నో రెట్లు అధిక శక్తితో కరోనా సెకెండ్‌ వేవ్‌ విరుచుకుపడుతున్నప్పటికీ.. పోయిన ఏడాది కంటే ఎంతో పకడ్బందీగా, పెద్దఎత్తున నియంత్రణ, నివారణ, సహాయక చర్యలు చేపట్టాల్సిన పురపాలక శాఖ ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. 


అదనపు నిధుల మాటే లేదు

కరోనా కేర్‌ సెంటర్ల ఏర్పాటు కంటితుడుపుగా ఉందే తప్ప బాధితులకు అవసరమైనన్ని ఏర్పాటు చేయలేదు. ప్రతి పురపాలక సంఘంలో కనీసం ఒకటైనా ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉండగా, చా లా చోట్ల అసలు ఏర్పాటే చేయలేదు. నగర పాలక సం స్థల పరిధిలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఒక కరోనా కేర్‌ సెంటర్‌నైనా ప్రారంభించాల్సి ఉండగా, ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. స్థానిక సంస్థల పరంగా ఏర్పాటు చేయగలిగినన్ని కేంద్రాలను నెలకొల్పి, మిగిలిన వాటి ఏర్పాటు, నిర్వహణలో స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేస్తే కరోనా బాధితులకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉంది. మరోవైపు, నిధుల లేమి స్థానిక సంస్థలకు ప్రతిబంధకంగా మారిందని తెలుస్తోంది.


‘హోం ఐసొలేషన్‌’ సాధ్యమా?

కరోనా స్వల్ప లక్షణాలున్న వారిని హోం ఐసొలేషన్‌లో ఉండి చికిత్స తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. అయితే.. పట్టణ వాసులకు ఆ అవకాశం ఉండదన్న విషయాన్ని ఎవరూ గుర్తించడం లేదు. సొంత ఇళ్లులేని, ఒకవేళ ఉన్నా చిన్న చిన్న ఇళ్లలోను, అద్దె ఇళ్లలోనూ నివసించే దిగువ మధ్య తరగతి, నిరుపేదలు ‘ప్రత్యేక గదులో’్ల ఐసొలేషన్‌లో ఉండడం ఎలా సాధ్యమనేది కీలక ప్రశ్న. ఈ అవకాశం లేకపోవడం, గత్యంతరం లేక కొవిడ్‌-19 లక్షణాలున్న వారితోనే గడపాల్సి రావడం వైరస్‌ వ్యాప్తికి మరింతగా తోడ్పడుతోందని వైద్య నిపుణులు అంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి నగరం, పట్టణంలో ఐసొలేషన్‌ కేంద్రాలను తెరిచేలా పురపాలక శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేయాలని ప్రజలు కోరుతున్నారు. 


తొలి దశలో అలా.. మలిదశలో ఇలా..

గతేడాది వచ్చిన కరోనా తొలిదశను ఎదుర్కోవడంలో పురపాలకశాఖ బాగానే పనిచేసింది. అయితే.. ఇప్పుడు అంతకంటే చాలా తీవ్రంగా ఉన్న సెకెండ్‌ వేవ్‌ను నిలువరించడంలో పురపాలక శాఖ చొరవ చూపకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఈ ఏడాది మార్చిలో రాష్ట్రంలోని 87 నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా, ఫలితాలు వెలువడిన వాటిల్లో ఒక్క తాడిపత్రి మినహా అన్నింటినీ అధికార వైసీపీ గెలుచుకుంది. అయితే, చాలా నగరాలు, పట్టణాల్లో కొత్తగా ఏర్పడిన పాలక వర్గాలు కరోనా విలయాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై దృష్టి పెట్టడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నూతనంగా ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్లకు మార్చి 31, ఏప్రిల్‌ 1వ తేదీల్లో సాక్షాత్తూ సీఎం జగన్‌, పలువురు మంత్రులు, పురపాలక శాఖ ఉన్నతాధికారులు వర్క్‌షాప్‌ నిర్వహించి కర్తవ్యబోధ చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే కరోనా సెకండ్‌ వేవ్‌ రాష్ట్రాన్ని కుదిపేయడం ప్రారంభించింది. 


దీంతో కొత్తగా బాధ్యతలు చేపట్టిన వారంతా చురుగ్గా వ్యవహరిస్తారని అందరూ అనుకున్నారు. కానీ, పాలక వర్గాల్లో కొన్ని మినహా మిగిలినవన్నీ కళ్లప్పగించి చూస్తున్నాయే తప్ప తాము కదలడంతోపాటు, అధికార యంత్రాంగంతో పనిచేయించడం అనే మాటను మరిచిపోయినట్టు కనిపిస్తోంది. పోనీ.. పాలకవర్గాల్లో పలువురు రాజకీయాలకు కొత్త అనుకున్నా వారికి సరైన దిశానిర్దేశం చేసి, పట్టణ ప్రజలకు మెరుగైన సేవలందేలా చూడాల్సిన బాధ్యతను అధికార పార్టీ పెద్దలుగానీ, పురపాలక శాఖ ఉన్నతాధికారులుగానీ తీసుకోవడం లేదు. దీంతో.. పట్టణ స్థానిక సంస్థల పాలక వర్గాలు కొలువుదీరితే ప్రత్యేకాధికారుల హయాంలో కంటే మెరుగైన సేవలందుతాయని ఆశించిన ప్రజలకు తీవ్ర నిరాశే మిగులుతోంది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా అన్ని నగరాలు, పట్టణాల్లో అత్యవసర కౌన్సిల్‌ సమావేశాలను నిర్వహించి, ఏమేం చర్యలు చేపట్టాలో చర్చించి, ఆ దిశలో ముందుకు వెళ్లేలా చూడాల్సిన కీలక కర్తవ్యాన్ని పురపాలక శాఖ ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం గర్హనీయం. ఈ విపత్కర సమయంలో అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, చారిటీ సంస్థలు కూడా చురుగ్గా పాలుపంచుకునేలా చేయాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం జరగడం లేదు. 

Updated Date - 2021-05-11T09:24:25+05:30 IST