నివురుగప్పిన నిప్పులా...

ABN , First Publish Date - 2020-04-10T07:58:03+05:30 IST

ఇతర రాష్ర్టాలతో పోల్చితే ఏపీలో కరోనా విజృంభణ నెమ్మదిగా ఉందని ప్రభుత్వ గణాంకాలు తెలియచేస్తున్నాయి. వాస్తవంగా క్షేత్రస్థాయి పరిస్థితి ఇలాగే ఉందా? అంటే...

నివురుగప్పిన నిప్పులా...

  • క్షేత్రస్థాయి పరిస్థితులపై సందేహాలు
  • అనుమానితులు వేలల్లో... పరీక్షలు వందల్లో
  • మూడోసర్వేలో 12,311 అనుమానితులు
  • వీరిలో 1754 మంది గృహ నిర్బంధం
  • 26 మందికే కరోనా పరీక్షల నిర్వహణ
  • ఫలితంగా వాస్తవ పరిస్థితిపై అస్పష్టత
  • ఇతర రాష్ర్టాల్లో వేల మందికి పరీక్షలు
  • అందుకు అనుగుణంగానే కేసులు బహిర్గతం

అమరావతి, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): ఇతర రాష్ర్టాలతో పోల్చితే ఏపీలో కరోనా విజృంభణ నెమ్మదిగా ఉందని ప్రభుత్వ గణాంకాలు తెలియచేస్తున్నాయి. వాస్తవంగా క్షేత్రస్థాయి పరిస్థితి ఇలాగే ఉందా? అంటే... చెప్పలేని పరిస్థితి! పొరుగు రాష్ర్టాల్లో అక్కడి ప్రభుత్వాలు చేస్తున్న కరోనా నిర్ధారణ పరీక్షలు అధికంగా ఉన్నాయి. వాటికి తగ్గట్లే అక్కడ కేసులు కూడా ఎక్కువగా బయటపడుతున్నాయి. కానీ, రాష్ట్రంలో పరీక్షలు తక్కువగా జరుగుతున్నాయి. అందుకు అనుగుణంగానే తక్కువగా కేసులు నమోదవుతున్నాయని, వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ మూడుసార్లు సర్వే నిర్వహించింది.


మూడోదశ సర్వేలో 12,311 మంది అనుమానితులను గుర్తించారు. వీరిలో 1754 మందిని మాత్రమే గృహనిర్బంధంలో ఉండాలని సూచించారు. 26 మంది ని ఆస్పత్రికి తరలించి, పరీక్షలు నిర్వహించినట్లు అధికారులే స్వయంగా వెల్లడించారు. క్వారంటైన్‌లో ఉన్నవారందరికీ పరీక్షలు చేస్తే కరోనా ప్రభావితులంతా బయటపడే అవకాశాలున్నాయి.


నిర్లక్ష్యానికి భారీ మూల్యం: ఒకవైపు ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుంటే... బాధితుల వైపు నుంచి కూడా తప్పిదాలు కనిపిస్తున్నాయి. చాలామంది కరోనా లక్షణాలున్నా ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. కరోనాతో మృతి చెందిన కేసులను పరిశీలిస్తే... వారికి ఆ లక్షణాలున్నా ఆస్పత్రికి వెళ్లకుండా ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. మరోవైపు కరోనా వ్యాప్తి చెందడం వెనుక అధికారుల పాత్ర కూడా ఉంది. ప్రభుత్వాస్పత్రుల్లో కరోనాతో మృతి చెందిన వారి దేహాన్ని సాధారణ రోగుల మాదిరిగా వారి బంధువులకు ఇచ్చేశారు. వేలసంఖ్యలో పరీక్షలు చేసే సామర్థ్యం మన దగ్గర ఉన్న పరీక్షా కేంద్రాలకు లేదు. లాక్‌డౌన్‌ నిబంధనలను కూడా ప్రజలు  ఉల్లంఘిస్తున్నారు. మహారాష్ట్రలో 25,753 మందికి కరోనా పరీక్షలు చేస్తే 1297 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కేరళలో 11,252 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 345మందికి పాజిటివ్‌ అని తేలింది. ఏపీలో కేవలం 5612మందికే పరీక్షలు నిర్వహించారు. వీరిలో 348మందికి పాజిటివ్‌ వచ్చింది. మరింత మందికి పరీక్షలు చేస్తే కేసుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి.

Updated Date - 2020-04-10T07:58:03+05:30 IST