కరోనా సోకినా చలో హైదరాబాద్‌!

ABN , First Publish Date - 2020-07-14T07:37:45+05:30 IST

ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషాకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆయన కుటుంబ సభ్యులూ వైరస్‌ బారిన పడ్డారు. అయితే... సరిగ్గా వారం కిందట కూడా ఆయనకు

కరోనా సోకినా చలో హైదరాబాద్‌!

  • స్విమ్స్‌ నుంచి వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం
  • పాజిటివ్‌ వచ్చినా లక్షణాలు లేవు
  • ఇతర సమస్యలూ లేవని నిర్ధారణ
  • హుటాహుటిన హైదరాబాద్‌కు పయనం
  • రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులే
  • లేనట్లుగా పొరుగు రాష్ట్రానికి!
  • తగిన సేవలు అందలేదనే అసంతృప్తి!


ఏపీలో కరోనా వస్తే సరైన చికిత్స చేసే ఆస్పత్రులే లేవా? విశాఖ కేజీహెచ్‌ నుంచి తిరుపతిలోని ‘స్విమ్స్‌’ దాకా ఉన్న ప్రతిష్ఠాత్మక ఆస్పత్రులేవీ పనికిరావా? ఒకవేళ, ప్రైవేటు ఆస్పత్రిలో చేరాలనుకున్నా... పొరుగు రాష్ట్రంలోని హైదరాబాద్‌కు పరుగులు తీయాల్సిందేనా? ‘ఏపీలో కరోనా చికిత్సలు భేష్‌’ అని చెప్పుకొంటున్న ప్రభుత్వ పెద్దల ప్రకటనలు అంతా డొల్లేనా? రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా వ్యవహారం చూస్తే... ఇలాంటి సందేహాలు కలుగక మానవు!


తిరుపతి, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషాకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆయన కుటుంబ సభ్యులూ వైరస్‌ బారిన పడ్డారు. అయితే... సరిగ్గా వారం కిందట కూడా ఆయనకు ‘పాజిటివ్‌’ అంటూ వార్తలు వెలువడ్డాయి. ఇది నిజం కాదంటూ, నేరుగా కొవిడ్‌ సెంటర్‌ నుంచి వచ్చిందంటున్న ‘నెగెటివ్‌’ సందేశాన్ని ఆయన అనుచరులు మీడియా ప్రతినిధుల ఫోన్లకు పంపించారు. ఆ తర్వాత ఆయన మళ్లీ ఎప్పుడైనా, ఎక్కడైనా టెస్ట్‌ చేయించుకున్నారా... అనే విషయం తెలియదు. దీనిపై అధికారులెవరూ నోరు మెదపడంలేదు. కానీ, ఆయనతోపాటు కుటుంబ సభ్యులకూ కరోనా పాజిటివ్‌ వచ్చిందని తేల్చారు.


హఠాత్తుగా డిశ్చార్జి

అంజాద్‌ బాషాకు గతంలోనే కార్డియో థొరాసిక్‌ సర్జరీ జరిగింది. అదే సమయంలో సీటీ స్కాన్‌లో న్యుమోనియా లక్షణాలు ఉన్నట్లు కడప ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు సందేహించారు. అందువల్ల, ఎందుకైనా మంచిదని తిరుపతి పద్మావతీ ఆస్పత్రికి వెళ్లాల్సిందిగా కడప ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రెఫర్‌ చేశారు. దీంతో... శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో అంజాద్‌ బాషా, ఆయన భార్య, కుమార్తె స్విమ్స్‌ పద్మావతీ ఆస్పత్రికి చేరుకున్నారు. వారిని అక్కడ అఅకవైద్యులు పరీక్షించారు. పాజిటివ్‌ అయినప్పటికీ లక్షణాలేమీ లేవని నిర్ధారించారు. గుండె, న్యుమోనియాకు సంబంధించిన సమస్యలేమీ లేవని స్పష్టం చేశారు. 


అయినా... హైదరాబాద్‌కు!

కొవిడ్‌ లక్షణాలు లేకున్నా... ఇతర ఆరోగ్య సమస్యలూ లేవని వైద్యులు నిర్ధారించినా సరే... అంజాద్‌ బాషా తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రిలో ఉండలేకపోయారు. ఆదివారం సాయంత్రం హఠాత్తుగా డిశ్చార్జి అయి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. స్విమ్స్‌లో తాము ఆశించిన సేవలు అందలేదనే అసంతృప్తితో ఈ నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. తాము హైదరాబాద్‌ వెళతామని, అక్కడైతే తమకు సౌకర్యంగా ఉంటుందని కలెక్టర్‌కు సమాచారమిచ్చి... ఆదివారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో స్విమ్స్‌ నుంచి హైదరాబాద్‌ బయల్దేరి వెళ్లినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ సమాచారాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. అస్వస్థతకు గురైనప్పుడు ఎక్కడ, ఏ ఆస్పత్రిలో చికిత్స పొందాలో నిర్ణయించుకునే హక్కు బాధితుడికి ఉంటుంది. అయితే, కరోనా విషయంలో మాత్రం కొన్ని నిబంధనలున్నాయి. సవరించిన మార్గదర్శకాల ప్రకారం... ఎలాంటి లక్షణాలూ లేని కరోనా బాధితులు ఇళ్లలోనే ఉండి  చికిత్స పొందవచ్చు. అయితే, రాష్ట్రం దాటి వెళ్లి అక్కడి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందాలంటే సంబంధిత జిల్లా కలెక్టర్‌ అనుమతి తప్పనిసరి. అదికూడా అంబులెన్స్‌లోనే ప్రయాణించాలి. ప్రైవేటు కార్లలో వెళ్లడం కుదరదు. ఇలా అనేక నిబంధనలు ఉన్నాయి. ఆ సంగతి ఎలా ఉన్నప్పటికీ... ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన ఉప ముఖ్యమంత్రి, హఠాత్తుగా డిశ్చార్జి రాయించుకుని, హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరడం మాత్రం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2020-07-14T07:37:45+05:30 IST