పకడ్బందీగా ‘పది’ పరీక్షలు

ABN , First Publish Date - 2020-05-27T08:32:24+05:30 IST

జూన్‌ 8 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి మిగతా పరీక్షల నిర్వహణకు కరోనా నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని...

పకడ్బందీగా ‘పది’ పరీక్షలు

  • ప్రతి విద్యార్థికీ థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేస్తాం
  • గంట ముందే పరీక్షా కేంద్రంలోకి అనుమతి
  • అనారోగ్య సమస్యలున్నా హాజరు కావొచ్చు
  • జూన్‌ మొదటి వారంలో ఇంటర్‌ ఫలితాలు
  • పాత పరీక్షా కేంద్రానికి కి.మీ.దూరంలో కొత్తది
  • ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో మంత్రి సబిత


జూన్‌ 8 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి మిగతా పరీక్షల నిర్వహణకు కరోనా నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. రవాణా విషయంలో అప్రమత్తంగా ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణ, ఫీజుల నియంత్రణ, ప్రైవేటు వర్సిటీల ఏర్పాటు తదితర అంశాలపై ‘ఆంధ్రజ్యోతి’కి మంత్రి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.


హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని, తల్లి దండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. 


పది పరీక్షా కేంద్రాలు ఎన్ని?

రాష్ట్రంలో 5.30లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. గతంలో 2,530 ఉండే పరీక్షా కేరందాల సంఖ్యను 4,535కు పెంచాం. అలాగే అదనంగా 25వేల  ఇన్విజిలేటర్లను నియమించాం. ఒక్కో పరీక్షకు మధ్య రెండు రోజుల వ్యవధి ఉంటుంది. 


కొత్త కేంద్రాల గురించి విద్యార్థులకు తెలియజేస్తున్నారా?

పాత పరీక్షా కేంద్రానికి కిలోమీటర్‌ పరిధిలోనే కొత్తది ఏర్పాటు చేశాం. కేంద్రం మార్పు సమాచారాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అధికారులు తెలియజేస్తున్నారు. ప్రతి జిల్లాలో ఒక హెల్ప్‌లైన్‌ నంబర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. హాల్‌ టికెట్లు పాతవే ఉంటాయి. గంట ముందుగానే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తాం.


కరోనా నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలేంటి? 

ప్రతి విద్యార్థిని థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేయడంతో పాటు శానిటైజర్లు, మాస్కులను ఉచితంగా అందజేస్తాం. భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఒక బెంచీలో ఒకరే ఉంటారు. ఒకరి వెనుక ఒకరు కాకుండా జిగ్‌జాగ్‌గా కూర్చోబెడతాం. కట్టడి ప్రాంతాలు, హోంక్వారంటైన్‌, అనారోగ్యం బారిన పడిన వారికి ప్రత్యేక గదులను కేటాయిస్తాం. జ్వరం, దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలున్నా నిర్భయంగా హాజరు కావొచ్చు. 


తల్లిదండ్రులకు మీరిచ్చే సూచనలేంటి?

విద్యార్థులను వారి తల్లిదండ్రులే పరీక్షా కేంద్రాలకు స్వయంగా తీసుకొచ్చి, తీసుకెళితే మంచిది. ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా పిల్లలు స్వేచ్ఛగా పరీక్షలు రాసేలా చూడాలి. 


ఇంటర్‌, పది ఫలితాలెప్పుడు?

ఈ నెల 30 నాటికి ఇంటర్‌ మూల్యాంకనం పూర్తవుతుంది. వచ్చే నెల మొదటి వారంలో ఫలితాలను ప్రకటిస్తాం. పరీక్షలు పూర్తికాగానే పది మూల్యాంకం మొదలవుతుంది.


జేఈఈకి హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బంది ఉండదుగా? 

జేఈఈ మెయిన్స్‌ దృష్ట్యా ఎంసెట్‌ను జూలై 6-9 వరకూ నిర్వహించాలని నిర్ణయించాం. ఫలితాలనూ త్వరగానే ప్రకటిస్తాం.


నూతన విద్యా సంవత్సర అడ్మిషన్స్‌ ఎప్పుడు?

విద్యా సంవత్సరం ప్రారంభంపై కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటైంది. దాని నిర్ణయం మేరకు అడ్మిషన్స్‌ తేదీలను ప్రకటిస్తాం. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కూడా అభిప్రాయాలు సేకరిస్తున్నాం. కొందరితో నేనే స్వయంగా మాట్లాడాను. అప్పుడే పిల్లలను పంపించడానికి వాళ్లు పెద్దగా సుముఖత వ్యక్తం చేయడంలేదు.


ఫీజుల నియంత్రణకు చర్యలేంటి?

ఫీజులు పెంచబోమని యాజమాన్యాలు చెప్పాయి. ఒకేసారి ఫీజులు చెల్లించాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి తేవొద్దని, నెల వారీగా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాం. ఫీజులు పెంచితే విద్యా శాఖాధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. నియంత్రణపై ఒక కమిటీ వేసే అవకాశాలున్నాయి.  


ప్రైవేటు వర్సిటీల ఆర్డినెన్స్‌పై విమర్శల మాటేంటి?

తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రైవేటు యూనివర్సిటీలు ఉన్నాయి.   విమర్శలెందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు? ఉన్నత విద్యకు చాలా మంది  విదేశాలకు వెళ్తున్నారు. అక్కడ లభించే నాణ్యమైన విద్యను ఈ వర్సిటీలు మన రాష్ట్రంలో అందిస్తాయి.


Updated Date - 2020-05-27T08:32:24+05:30 IST