సచివాలయంలో కరోనా

ABN , First Publish Date - 2020-05-31T08:40:36+05:30 IST

సచివాలయంలో కరోనా కలకలం రేగింది. వ్యవసాయశాఖలో పని చేస్తున్న ఒక ఉద్యోగికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. లాక్‌డౌన్‌ కారణంగా హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఉద్యోగులను తీసుకొచ్చేందుకు

సచివాలయంలో కరోనా

  • ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులకు పాజిటివ్‌ 
  • హైదరాబాద్‌ నుంచి వచ్చినవారికి నిర్ధారణ 
  • వ్యవసాయశాఖలో ఒకరు, హెచ్‌ఓడీల్లో ఇద్దరు 
  • తోటి ఉద్యోగులతో ప్రయాణాలు, విందులు 
  • బెంబేలెత్తుతున్న సచివాలయ ఉద్యోగులు 
  • వారంపాటు వర్క్‌ ఫ్రం హోం ఇవ్వాలని వినతి


అమరావతి, మే 30 (ఆంధ్రజ్యోతి): సచివాలయంలో కరోనా కలకలం రేగింది. వ్యవసాయశాఖలో పని చేస్తున్న ఒక ఉద్యోగికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. లాక్‌డౌన్‌  కారణంగా హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఉద్యోగులను తీసుకొచ్చేందుకు ఇక్కడినుంచి 10 ఆర్టీసీ బస్సులు వెళ్లాయి. వాటిలో వచ్చిన ఉద్యోగుల్లో ముగ్గురికి పాజిటివ్‌గా తేలింది. అందులో ఒకరు సచివాలయంలో పని చేస్తుండగా, మరో ఇద్దరు శాఖాధిపతుల కార్యాలయాలకు చెందినవారు. హైదరాబాద్‌ నుంచి వచ్చినవారిని నేరుగా మంగళగిరి వద్ద సీకే కన్వెన్షన్‌ సెంటర్‌కు తరలించి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత అందరికీ అక్కడే మధ్యాహ్నం భోజనం చేశారు. ఆ సమయంలో ఎలాంటి భౌతిక దూరం పాటించలేదని ఉద్యోగులు చెబుతున్నారు. తర్వాత రెండురోజుల పాటు వీరు కార్యాలయాలకు వెళ్లారు. శుక్రవారం బాగా పొద్దుపోయాక వీరికి నిర్వహించిన పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. 


ముగ్గురికి పాజిటివ్‌ రావడంతో ఉద్యోగులంతా ఉలిక్కిపడ్డారు. సచివాలయంలో పనిచేస్తున్న వ్యక్తి నవులూరులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత వసతిలో ఉంటున్నాడు. ఆయన రూమ్‌లో ఇద్దరు సచివాలయ ఉద్యోగులు సహా మొత్తం ఆ అపార్ట్‌మెంటులో 40మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. గురు, శుక్రవారాల్లో సచివాలయానికి వచ్చిన ఆ వ్యక్తి, అతని రూమ్‌మేట్స్‌ సచివాలయంలోని అన్ని బ్లాకులు కలియదిరిగారని చెబుతున్నారు. చాలారోజుల తర్వాత కలుసుకున్న సందర్భంగా నవులూరు అపార్ట్‌మెంట్‌లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు చిన్నపాటి పార్టీ చేసుకున్నారని, ఈ వ్యక్తి కూడా అందులో పాల్గొన్నాడని చెబుతున్నారు. పైగా శుక్రవారం సచివాలయంలో ఒక ఉద్యోగి రిటైర్మెంట్‌ సందర్భంగా చేసుకున్న వేడుకలోనూ ఇతను పాల్గొని అందరు ఉద్యోగులతో కలివిడిగా తిరిగాడని, అందరితో కలిసి డైనింగ్‌ హల్‌లో భోజనం చేశాడని చెబుతున్నారు. దీంతో ఆ ఉద్యోగి కాంటాక్ట్స్‌ లెక్కతేలడం కష్టంగా మారింది.


ఆ బస్సులో వారందరూ సెల్ఫ్‌ క్వారంటైన్‌  

పాజిటివ్‌గా తేలిన వ్యక్తి సికింద్రాబాద్‌ నుంచి వచ్చిన బస్సులో రావడంతో అతనితో పాటు ప్రయాణించిన మరో 20మంది ఉద్యోగులను సెల్ఫ్‌ క్వారంటైన్‌కు వెళ్లాలని అధికారులు ఆదేశించారు. సచివాలయానికి పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు లేకపోవడంతో ఉద్యోగులకు ఏర్పాటు చేసిన బస్సుల్లోనే ఆయన విధులకు వచ్చారని చెబుతున్నారు. వాటిలో ప్రయాణించిన ఉద్యోగులు కూడా సెల్ఫ్‌ క్వారంటైన్‌ లో ఉండాలని సూచించినట్లు తెలిసింది. సచివాలయంలో కరోనా కేసు బయటపడటంతో ఆ ప్రదేశం మొత్తం శానిటైజ్‌ చేశారు. సోమవారం నుంచి విధులకు రావడానికి ఉద్యోగులు భయపడిపోతున్నారు. ఉద్యోగులందరికీ వారంరోజుల పాటు ‘వర్క్‌ ఫ్రం హోం’ అవకాశం కల్పించాలని జీఏడీ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ను కోరినట్లు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. కాగా, పాజిటివ్‌ వచ్చిన మరో ఇద్దరు ఉద్యోగులు గుంటూరు శ్యామలానగర్‌లో ఉన్న రాష్ట్ర సహకార శాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2020-05-31T08:40:36+05:30 IST