ఒక్కరికి వైరస్‌ సోకినా రెడ్‌ జోనే!

ABN , First Publish Date - 2020-04-03T07:32:31+05:30 IST

ఢిల్లీలో జరిగిన జమాత్‌ తెలంగాణలోని పల్లెల్లో గుబులు రేపింది. అక్కడికి వెళ్లొచ్చినవారిలో పలువురు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ఆయా పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు భయపడుతున్నారు.

ఒక్కరికి వైరస్‌ సోకినా రెడ్‌ జోనే!

పల్లెల్లో కఠినంగా ఆంక్షలు అమలు

‘జమాత్‌’ ఘటనతో ఒక్కసారిగా మారిన పల్లె వాతావరణం


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో జరిగిన జమాత్‌ తెలంగాణలోని పల్లెల్లో గుబులు రేపింది. అక్కడికి వెళ్లొచ్చినవారిలో పలువురు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ఆయా పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు భయపడుతున్నారు. వరుసగా కేసులు బయటపడుతుండటంతో అధికారులు కూడా అలర్ట్‌ అయ్యారు. జమాత్‌కు వెళ్లి వచ్చిన వారు ఉంటున్న ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టారు. ప్రజలు బయటకు రాకుండా ఆంక్షలు విధిస్తున్నారు. ఒక్క పాజిటివ్‌ కేసు నమోదైనా రెడ్‌జోన్‌గా ప్రకటించి అక్కడి ప్రజలందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటిదాకా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నా నిత్యావసరాల కోసం వెసులుబాటు ఉండటంతో పెద్దగా కష్టం అనిపించలేదు. కానీ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.  గజ్వేల్‌ పట్టణంలో ఓ వ్యక్తికి కరోనా సోకడంతో గజ్వేల్‌ పట్టణంతో పాటు, గాజులపల్లి, అహ్మదానగర్‌, మాదన్నపేట గ్రామాల్లో ఇంటింటి సర్వేకు ఆదేశించారు. ఈ గ్రామాల్లో ప్రతి వ్యక్తికి ఆరోగ్య నివేదికను తయారు చేయాలని మంత్రి హరీశ్‌ రావు ఆదేశించారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి కరోనాతో చనిపోవడంతో అక్కడ జిల్లా వ్యాప్తంగా కఠిన ఆంక్షలు విధించారు. నల్లగొండ పట్టణంలోని మీర్‌బాగ్‌ కాలనీ, బర్కత్‌పుర, మాన్యం చెల్క, రెహమాన్‌బాగ్‌ కాలనీ, మిర్యాలగూడలో ఉస్మాన్‌పుర ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రకటించారు. సూర్యాపేటలోని ఓ గ్రామంలో వ్యక్తికి వైరస్‌ సోకడంతో ఒక కిలోమీటరు వరకు ఎవరిని రానీయకుండా ఆంక్షలు విధించారు. నిజామాబాద్‌లోని ఖిల్లా రోడ్డులో ఒకే ఇంట్లో రెండు కేసులు నమోదవడంతో అక్కడ ఎవరినీ బయటకు అనుమతించడం లేదు. విస్తృతంగా పరీక్షలను నిర్వహిస్తున్నారు. 

Updated Date - 2020-04-03T07:32:31+05:30 IST