అబ్ అక్షయ్ క్యా కరేగా?

ABN , First Publish Date - 2020-05-31T05:30:00+05:30 IST

అక్షయ్‌కుమార్‌ ఇప్పుడేం చేస్తారు? అరే భాయ్‌... అబ్‌ అక్షయ్‌ క్యా కరేగా? హిందీ చిత్రసీమలో వేడి వేడి చర్చల్లో ఇదొకటి!...

అబ్ అక్షయ్ క్యా కరేగా?

  • అక్షయ్‌కుమార్‌ ఇప్పుడేం చేస్తారు?
  • అరే భాయ్‌... అబ్‌ అక్షయ్‌ క్యా కరేగా?
  • హిందీ చిత్రసీమలో వేడి వేడి చర్చల్లో ఇదొకటి!
  • ఒకటి, రెండు, మూడు, నాలుగు కాదు... 
  • ఏకంగా అక్షయ్‌ చేతిలో ఏడు చిత్రాలున్నాయి!
  • అందులో రెండు చిత్రాలకు గుమ్మడికాయ కొట్టగా...
  • మరో మూడు చిత్రాలకు కొబ్బరికాయ, క్లాప్‌ కొట్టారు!
  • ఇంకో రెండు చిత్రాలను ప్రకటించారు.
  • పదిహేనేళ్లుగా అక్షయ్‌ సినిమాలు  ఏడాదికి నాలుగైదు విడుదలవుతున్నాయి!
  • కనీసంలో కనీసం మూడు విడుదల కావడం పక్కా!!
  • కరోనా కల్లోలంలో కొట్టుమిట్టాడుతున్న చిత్రాల్లో 
  • అక్షయ్‌వి ఏడు చిత్రాలు!!!
  • దీన్నిబట్టి కరోనా ప్రభావం ఈ కథానాయకుడిపై 
  • ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
  • అందుకని, చిత్రసీమ సాధారణస్థితికి వచ్చిన తర్వాత మళ్లీ చిత్రీకరణలు ప్రారంభిస్తే...
  • అక్షయ్‌కుమార్‌ ఏం చేస్తారనే విషయం మీద వాడివేడిగా చర్చ జరుగుతోంది.
  • ఈ యాక్షన్‌ హీరో చేస్తున్న చిత్రాలపై ఓ లుక్కేద్దాం!

బెల్‌ బాటమ్‌

అక్షయ్‌ కుమార్‌ను ఆలోచనల్లో పడేసే అవకాశమున్న చిత్రాల్లో ‘బెల్‌ బాటమ్‌’ గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. ఇదొక స్పై-థ్రిల్లర్‌. కథ 1980 నేపథ్యంలో సాగుతుంది. ఇండియాతో పాటు విదేశాల్లో చిత్రీకరించాల్సిన సన్నివేశాలు ఉన్నాయి. ఆగస్టులో విదేశాల్లో తీయాల్సిన సన్నివేశాలను పూర్తి చేయాలనుకున్నారు. ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా రానున్న మరికొన్ని నెలలు విదేశాలు వెళ్లడం కుదరకపోవచ్చు. అందువల్ల, ఏం చేస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. కథను కాస్త మారుస్తారా? లేదా ఇండియాలో సెట్లు వేస్తారా? అనేది చూడాలి.


పృథ్వీరాజ్‌

అక్షయ్‌కుమార్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పృథ్వీరాజ్‌’ పదకొండేళ్లకే సింహాసాన్ని అధిష్టించిన చౌహన్‌ రాజపుత్ర వంశస్థుడు, క్రీ.శ.1168-92 మధ్య ఢిల్లీ రాజధానిగా ఉత్తరభారతాన్ని పాలించిన రెండో హిందూ చక్రవర్తి పృథ్వీరాజ్‌ చౌహాన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చారిత్రక చిత్రమిది. ఇప్పటికి 50 శాతం చిత్రీకరణ పూర్తి చేశారు. 2017 విశ్వ సుందరి మానుషీ చిల్లర్‌ ‘పృథ్వీరాజ్‌’తో హిందీ తెరకు కథానాయికగా పరిచయం కానున్నారు. కరోనా ముందు ప్రణాళిక ప్రకారం దీపావళికి చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ సినిమా కోసం వేసిన సెట్‌ కూడా కూల్చేశారు. మళ్లీ షూటింగులు మొదలైతే ఇండోర్‌లో సెట్‌ వేసి షూటింగ్‌ చేయాలనుకుంటున్నారు.




సూర్యవంశీ

పాటలు, ఫైట్లు, కామెడీ, రొమాన్స్‌... వందశాతం మాస్‌ మసాలా అంశాలతో ప్రేక్షకులను మెప్పించే విధంగా కమర్షియల్‌ యాక్షన్‌ చిత్రాలు తీసే దర్శకుడు రోహిత్‌ శెట్టితో కిలాడీ కుమార్‌ అక్షయ్‌ చేసిన చిత్రం ‘సూర్యవంశీ’. థియేటర్లకు కరోనా తాళాలు వేయకపోతే ఇవాళ్టికి ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ విడుదలై రెండు నెలలు అయ్యేది. ప్రచార చిత్రాల్లో ఖాకీ చొక్కా వేసుకొని, హెలికాప్టర్‌ పట్టుకొని అక్షయ్‌ చేసే విన్యాసాలు ప్రేక్షకులను ఆకర్షించాయి. అందులోనూ అజయ్‌ దేవగణ్‌ ‘సింగం’, రణ్‌వీర్‌ సింగ్‌ ‘సింబా’ తర్వాత రోహిత్‌ శెట్టి చేసిన ఖాకీ చిత్రం కావడం, ఆ హీరోలు ఇందులో నటించడం వల్ల ‘సూర్యవంశీ’కి మంచి క్రేజ్‌ వచ్చింది. ప్చ్‌... ఏం లాభం? కరోనా అడ్డుపడింది. థియేటర్లకు తాళాలు తీసి, ప్రదర్శనలు ప్రారంభించిన తర్వాత తెరను తాకే భారీ హిందీ చిత్రాల్లో ఇది ముందుంటుంది. అయితే, ఎనిమిది-పది రోజుల పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ చేయాల్సి ఉందట.




బచ్చన్‌ పాండే

నుదుట విభూది, బొట్టు.. మెడలో రుద్రాక్ష మాలలు.. చేతిలో నాంచాక్‌.. నల్లు లుంగీ కట్టిన కథానాయకుడు... ‘బచ్చన్‌ పాండే’లో అక్షయ్‌ కుమార్‌ ఆహార్యం ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. రూ. 250 కోట్లకు పైచిలుకు వసూళ్లు సాధించిన ‘హౌస్‌ఫుల్‌ 4’ తర్వాత దర్శకుడు ఫర్హాద్‌ సామ్‌జీ, నిర్మాత సాజిద్‌ నడియాడ్‌వాలాతో కలిసి అక్షయ్‌ చేస్తున్న సినిమా కావడంతో వ్యాపార వర్గాల్లోనూ ఈ చిత్రంపై అంచనాలు ఉన్నాయి. కరోనా కల్లోలం భారత తీరాన్ని తాకకపోయి ఉంటే ఈ నెలలో చిత్రీకరణ ప్రారంభించేవారు. మార్చి నెలఖారున లొకేషన్స్‌ ఖరారు చేశారు. ఈ చిత్రబృందం ప్రణాళికలు కరోనా కాటుకు తుడిచిపెట్టుకుపోయాయి. అక్షయ్‌ చిత్రాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా పడింది ఈ చిత్రంపైనే! షూటింగ్‌ షెడ్యూల్‌ ప్రారంభించక ముందే ప్యాకప్‌ చెప్పేయాల్సి వచ్చింది. 




అతరంగీ రే

భిన్న సంస్కృతుల మేళవింపుతో దర్శకుడు ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ రూపొందిస్తున్న ప్రేమకథా చిత్రం ‘అతరంగీ రే’. బీహార్‌, తమిళనాట మధురై ప్రాంతాల సంస్కృతి ప్రధానాంశంగా రెండు విభిన్న కాలాల నేపథ్యంలో చిత్రకథాంశం ఉంటుందని తెలిసింది. ఇందులో అక్షయ్‌కుమార్‌ ప్రత్యేక పాత్ర చేస్తున్నారు. రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ కుమార్తె సారా జంటగా నటిస్తున్నారు. వీరిపై చిత్రీకరణ ప్రారంభించారు. ఏప్రిల్‌ 15 నుండి అక్షయ్‌ పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించాలి. కానీ, కరోనా అడ్డుపడింది.






లక్ష్మీ బాంబ్‌

కథ, క్యారెక్టర్‌ నచ్చితే స్టార్‌ ఇమేజ్‌ను సైతం పక్కనపెట్టి ప్రయోగాలు చేయడానికి వెనుకాడని అక్షయ్‌కుమార్‌... ట్రాన్స్‌జెండర్‌గా నటించిన చిత్రం ‘లక్ష్మీ బాంబ్‌’. దక్షిణాదిలో విజయవంతమైన ‘కాంచన’కు రీమేక్‌ ఇది! ఈ చిత్రంతో రాఘవ లారెన్స్‌ హిందీ చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో కియారా అడ్వాణీ కథానాయిక. హర్రర్‌ కామెడీగా రూపొందిన ఈ సినిమా విజువల్‌ ఎఫెక్ట్స్‌, ఎడిటింగ్‌ ఇంకా పూర్తి కాలేదు. త్వరగా ఫస్ట్‌ కాపీ రెడీ చేయాలని టెక్నీషియన్స్‌ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నారట. ఎందుకింత తొందర? అంటే ఓటీటీలో సినిమాను విడుదల చేయడానికి ఒప్పందం చేసుకున్నారని వినికిడి. రూ. 125 కోట్లకు సినిమా స్ట్రీమింగ్‌ రైట్స్‌ను హాట్‌స్టార్‌ డిస్నీ ఛానల్‌ తీసుకుందని సమాచారం. అయితే, అధికారికంగా ప్రకటించలేదు. 



యాక్షన్‌ కామెడీ...

డిసెంబర్‌ నుండి టైటిల్‌ ఖరారు చేయని కొత్త సినిమాకు అక్షయ్‌ కుమార్‌ డేట్స్‌ కేటాయించారు. ‘వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ ముంబయ్‌ దోబారా’ తర్వాత ఆయనతో ఏక్తా కపూర్‌ నిర్మిస్తున్న చిత్రమిది. 2021లో విడుదల చేయాలనుకున్నారు. తెలుగులో ఘన విజయం సాధించిన చిత్రానికి ఇది రీమేక్‌ అని ముంబయ్‌ టాక్‌. అయితే, హీరో-నిర్మాత ఏ విషయం చెప్పలేదు. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభించి, మధ్యలో ఆగిన సినిమాలు పూర్తి చేసి... ఈ సినిమా సెట్స్‌ మీదకు రావడానికి ఎంతలేదన్నా అక్షయ్‌కు ఆరు నెలలకు పైగా సమయం పడుతుందని భావిస్తున్నారు. అందువల్ల, ఈ సినిమా షెడ్యూల్స్‌ మరో ఆరు నెలలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. 



షూటింగులు ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన తర్వాత తన నిర్మాతలతో అక్షయ్‌ కుమార్‌ ఓ సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట. అందరితో కలిసి కూర్చుని ఏం చేయాలి? ఏం చేయకూడదు? అని చర్చిస్తారట. అక్షయ్‌తో సినిమాలు తీస్తున్న నిర్మాతలెవరూ చిన్నవాళ్లు కాదు. ‘పృథ్వీరాజ్‌’కి యశ్‌ చోప్రా ఫిల్మ్స్‌ అధినేత ఆదిత్యా చోప్రా నిర్మాత. ‘అతరంగీ రే’కి టీ-సిరీస్‌ భూషణ్‌కుమార్‌, ‘బచ్చన్‌ పాండే’కి సాజిద్‌ నడియాడ్‌వాలా... ఇలా అందరూ పేరున్నవాళ్లే! పరిస్థితులను చర్చించి, డేట్స్‌ కేటాయించాలనుకుంటున్నారట. అక్షయ్‌తో షూటింగ్‌ అంటే యూనిట్‌ను పరుగులు పెట్టిస్తారు. ఉదయం ఏడు గంటలకు, అవసరం అయితే ఆరు గంటలకు కూడా సెట్‌లో ఉంటారు. పక్కా ప్రొఫెషనల్‌. ‘ఆలస్యం’ అనే పదం అక్షయ్‌ డిక్షనరీలో లేదు. నిర్మాతలకు సంతోషం కలిగించే అంశాల్లో ఇదొకటి. ఎవరి సినిమా ఎప్పుడు ప్రారంభించినా త్వరగా పూర్తి అవుతుంది. కాకపోతే... ఇతర ఆర్టిస్టుల డేట్స్‌ సమస్య లేకుండా చూసుకోవాలంతే.


Updated Date - 2020-05-31T05:30:00+05:30 IST