అందుబాటులో 28వేల పీపీఈలు

ABN , First Publish Date - 2020-04-10T06:34:04+05:30 IST

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్‌...

అందుబాటులో 28వేల పీపీఈలు

సర్కారు మధ్యంతర నివేదిక.. 

వైరస్‌ అంతానికి సర్కారు కృషి చేస్తోంది: హైకోర్టు


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్‌ సిబ్బందికి పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచుతున్నామని, వాటికి కొరత లేదని వెల్లడించింది. ఈ నెల 6 నాటికి ఆస్పత్రులు, సెంట్రల్‌ మెడికల్‌ స్టోర్లలో 28,184 కిట్లు అందుబాటులో ఉన్నాయని న్యాయస్థానానికి తెలియజేసింది. రాష్ట్రంలో కొవిడ్‌-19 మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యలో రోగులకు చికిత్స చేస్తున్న డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బందికి పీపీఈలు, ఎన్‌-95 మాస్కులు అందజేయాలని కోరుతూ.. తెలంగాణ డెమోక్రాటిక్‌ ఫోరం కన్వీనర్‌ పి.ఎల్‌.విశ్వేశ్వరరావు, చెరుకు సుధాకర్‌లు దాఖలు చేసిన వ్యాజ్యంతోపాటు పి.తిరుమలరావు, న్యాయవాది సమీర్‌ అహ్మద్‌, ఎస్‌ఎ్‌సఆర్‌ మూర్తి వేర్వేరుగా రాసిన లేఖలను సుమోటోగా విచారణకు స్వీకరించిన హైకోర్టు అన్నింటినీ కలిపి గురువారం మరోసారి విచారణ జరిపింది. ఈ పిటిషన్లను ఽహైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌ గౌడ్‌ల ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎ్‌స.ప్రసాద్‌ వాదిస్తూ.. కేంద్ర నిబంధనల ప్రకారం వైద్య సిబ్బంది రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్ననట్లు చెప్పారు. అనుమానం కలిగిన ప్రతి ఒక్కరినీ ట్రాక్‌ చేశామన్నారు. ఈ దశలో కల్పించకున్న ధర్మాసనం.. వలస కార్మికులు ఇంకా రాష్ట్ర సరిహద్దుల వద్దే నిలిచిపోయారా? అని ప్రశ్నించింది. అక్కడే ఉన్నట్లయితే వారికి అవసరమైన ఆహారం, నీరు, ఇతర కనీస సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేసింది. ఏజీ బదులిస్తూ.. సరిహద్దుల వద్ద నిలిచిపోయిన వలస కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు. నిరుపేదలకు బియ్యం, ఇతర ఆహార పదార్థాలు అందిస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రభుత్వం చెబుతున్న కొవిడ్‌-19 రోగుల గణాంకాలు సరికాదని పిటిషనర్ల తరఫు న్యాయవాది చెప్పారు.


ప్రభుత్వ లెక్కల కంటే ఎక్కువగా కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నాయన్నారు. ఢిల్లీలోని మర్కజ్‌లో జరిగిన మతపరమైన సమావేశాలకు వెళ్లి వచ్చిన వారు హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉన్నారని, వారి వివరాలు సేకరించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని చెప్పారు. కొవిడ్‌-19 వైరస్‌ సోకిన వ్యక్తులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, ఇతర సిబ్బందికి ఇవ్వాల్సిన ఎన్‌-95 మాస్కుల కొరత వెంటాడుతోందని తెలిపారు. వైద్య సిబ్బందికి రక్షణ కల్పించకపోతే వారికీ వైరస్‌ సోకే ప్రమాదం ఉందన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం పోరాడుతోందని, తెలంగాణ ప్రభుత్వం కూడా అనేక చర్యలు చేపడుతోందని పేర్కొంది. కొవిడ్‌-19ను అంతమొందించేందుకు 24 గంటలూ శ్రమిస్తోందని ప్రశంసించింది. ఎన్‌-95 మాస్కులకు డిమాండ్‌-సరఫరా మధ్య భారీ వ్యత్యాసం ఉందని ధర్మాసనం గుర్తుచేసింది. ఈ సమస్య ప్రపంచమంతటా ఉందని అభిప్రాయపడింది. ఈ కారణంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించలేమంది. ఈ వ్యాజ్యాల్లో ప్రభుత్వం దాఖలు చేసిన మధ్యంతర నివేదికను పరిశీలించిన ధర్మాసనం సమగ్ర నివేదికను ఈ నెల 15లోగా దాఖలు చేయాలని ఆదేశించింది.


3.31 లక్షల పీపీఈలకు ఆర్డర్‌ ఇచ్చాం..

కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ప్రభుత్వం గురువారం హైకోర్టుకు మధ్యంతర నివేదికను సమర్పించింది. వైద్యులు, సిబ్బందికి పీపీఈలు అందుబాటులో ఉంచడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా పీపీఈల కొరత ఉందని, అయినా కొనుగోలుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని తెలియజేసింది. ఇప్పటికే 3,31,798 పీపీఈల కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చామని.. 47,603 కిట్లు వచ్చాయని వివరించింది. వైద్య సిబ్బందికి 6,89,390 ఎన్‌-95 మాస్కుల కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చినట్లు తెలిపింది. ఇప్పటివరకు 86,390 మాస్కులు వచ్చాయని, ఇందులో 73,227 మాస్కులు జిల్లాల్లో నిల్వ ఉన్నట్లు వెల్లడించింది. 53 లక్షల త్రీ ప్లై/సర్జికల్‌ మాస్కుల కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చామని, ఇందులో 25.50 లక్షల మాస్కులు వచ్చాయని తెలిపింది. 34 లక్షల సర్జికల్‌ గ్లౌవ్స్‌కు పర్చేజ్‌ ఆర్డర్లు ఇచ్చామని, ప్రస్తుతం 10.34 లక్షల గ్లౌవ్స్‌ అందుబాటులో ఉన్నాయని వివరించింది. ‘రాష్ట్రంలోని మందుల షాపులకు లాక్‌డౌన్‌ వర్తించడం లేదు. ఔషధాల కొనుగోలుకు వచ్చేవారు భౌతిక దూరాన్ని పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాం. 272 మొబైల్‌ రైతు బజార్ల ద్వారా ప్రజలకు కూరగాయలు అందేలా చూస్తున్నాం’ అని నివేదికలో వెల్లడించింది.


నిత్యావసరాల సరఫరా

అత్యవసర సేవల కింద ప్రజలకు నిత్యావసర సరుకులను అందించడానికి పలు ఉత్తర్వులిచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ‘రేషన్‌ కార్డుదారులకు 12 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా పంపిణీ చేశాం. ఇతర నిత్యావసరాల కొనుగోలుకు ప్రతి కుటుంబానికి రూ.1500 చొప్పున అందజేశాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిత్యావసర సరుకుల దుకాణాలు తెరిచి ఉంచేలా చూస్తున్నాం. రాష్ట్రంలో మార్చి 26 నాటికి 50 లక్షల కార్డుదారులకు 2,06,106 మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ చేశాం. ప్రజలకు ఎల్‌పీజీ సిలిండర్ల అందజేతలో ఎలాంటి ఆటంకాలు లేవు. సరుకు రవాణా విషయంలో 18 చెక్‌పోస్టుల వద్ద వాహనాలను ఆపకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో 335669 మంది వలస కూలీలు ఉన్నట్లు గుర్తించాం. వీరికి 12 కిలోల బియ్యం/గోధుమ పిండి, రూ.500 చొప్పున నగదు పంపిణీ చేస్తున్నాం’ అని నివేదికలో వివరించింది.

Updated Date - 2020-04-10T06:34:04+05:30 IST