పెళ్లి వేడుకతో 132 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-06-02T09:45:55+05:30 IST

కరోనా లక్షణాలుండీ వివాహ విందుకు హాజరైన ఓ యువకుడి కారణంగా 250 జనాభా ఉన్న ఊరిలో సగంమందిపైగా వైరస్‌ బారినపడ్డారు. వరుడి తండ్రి సహా ఆరుగురు మృతి చెందారు. ఇంకొందరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

పెళ్లి వేడుకతో 132 మందికి  కరోనా

వరుడి తండ్రి సహా పది రోజుల్లో ఆరుగురి మృతి

విందులో పాల్గొన్న ఒకరిలో అప్పటికే లక్షణాలు..!

ఖమ్మం జిల్లాలో ఘటన


ఖమ్మం, హైదరాబాద్‌, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): కరోనా లక్షణాలుండీ వివాహ విందుకు హాజరైన ఓ యువకుడి కారణంగా 250 జనాభా ఉన్న ఊరిలో సగంమందిపైగా వైరస్‌ బారినపడ్డారు. వరుడి తండ్రి సహా ఆరుగురు మృతి చెందారు. ఇంకొందరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ముత్యాలగూడెంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుల పెద్ద ఈసం భద్రయ్య కుమారుడి పెళ్లి మే 14న జరిగింది. అదే రోజు రాత్రి విందు ఏర్పాటు చేశారు. కట్టుబాటు ప్రకారం ఊరిలో ప్రతి ఇంటి నుంచి విందు భోజనానికి హాజరయ్యారు. పొరుగునున్న కొమ్ముగూడెం, గిద్దెవారిగూడెం నుంచి కూడా బంధుమిత్రులు పాల్గొన్నారు. ఇదే సందర్భంలో లక్షణాలున్న గిద్దెవారిగూడెం యువకుడు అందరితో కలిసి తిరిగాడు. తర్వాత క్రమంగా గ్రామంలో ఒక్కొక్కరు అనారోగ్యానికి గురయ్యారు.


కొందరు మామూలు జ్వరం, దగ్గు అనుకుని నిర్లక్ష్యం చేశారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు ఆస్పత్రి వెళ్లగా పాజిటివ్‌ వచ్చింది. అనుమానంతో అందరూ పరీక్షలు చేయించుకోగా గత నెల 20 నుంచి 132మందికి కరోనా నిర్ధారణ అయింది. వీరిలో భద్రయ్య (58)తో పాటు, కోరం రాముడు(70), కోరం ఎల్లయ్య (60), పడిగ పగడమ్మ(30), కనక కోటమ్మ(55), పెనిక బక్కయ్య (38) మృతి చెందారు. 9 మంది ఖమ్మం ఆస్పత్రిలో ఉన్నారు. పరిస్థితి తీవ్రత నేపథ్యంలో ఖమ్మం కలెక్టర్‌ కర్ణన్‌ గురుకుల పాఠశాలలో ఐసొలేషన్‌ కేంద్రం ఏర్పాటు చేయించారు. అందులో 50 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం గ్రామంలో వైద్య శిబిరం కొనసాగిస్తున్నారు. కాగా  వికారాబాద్‌ జిల్లా రాంనగర్‌ గ్రామంలో ఒకే ఇంట్లో  12 మందికి కరోనా సోకింది. వీరంతా హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.  


కొత్తగా 2,493 కేసులు

రాష్ట్రంలో మంగళవారం 2,493 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. మరో 15 మంది చనిపోయారు. 94,189 మందికి పరీక్షలు చేశారు. మొత్తం కేసులు 5,80,844కు, మరణాలు 3,296కు పెరిగాయి. తాజాగా 3,308 మంది డిశ్చార్జి అయ్యారు. కోలుకున్నవారి సంఖ్య 5,44,294కు చేరింది. 33,254 యాక్టివ్‌ కేసులున్నాయి. కొత్త కేసుల్లో జీహెచ్‌ఎంసీలో 318, నల్లగొండలో 165, రంగారెడ్డి జిల్లాలో 152 నమోదయ్యాయి. సోమవారం 61,166 మంది తొలి డోసు, 17,141 మంది రెండో డోసు తీసుకున్నారు. 

Updated Date - 2021-06-02T09:45:55+05:30 IST