మూడో దశ ముప్పు తక్కువే

ABN , First Publish Date - 2020-04-02T09:31:34+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం కొనసాగుతోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య అపరిమితంగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది! ఏ వస్తువు తాకితే వైరస్‌ సంక్రమిస్తుందో.. ఏ వ్యక్తిలో వైరస్‌ దాగి ఉందో అనే భయం ప్రతి ఒక్కరిలో!!

మూడో దశ ముప్పు తక్కువే

‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేక ఇంటర్వ్యూలో యశోద ఆస్పత్రి సీనియర్‌ వైద్యుడు ఎంవీ రావు


ప్రపంచవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం కొనసాగుతోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య అపరిమితంగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది! ఏ వస్తువు తాకితే వైరస్‌ సంక్రమిస్తుందో.. ఏ వ్యక్తిలో వైరస్‌ దాగి ఉందో అనే భయం ప్రతి ఒక్కరిలో!! ఈ తరుణంలో ఎలా వ్యవహరించాలి? కరోనా నుంచి ఎలా కాపాడుకోవాలి అనే అంశాలపై ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో యశోద ఆస్పత్రి సీనియర్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ ఎమ్‌.వి.రావు పలు  సూచనలు చేశారు. అవి ఆయన మాటల్లోనే..


కరోనా తీరే వేరు!

ఒక వ్యక్తి ద్వారా పది మందికి వ్యాధి వస్తే ఆర్‌ 10 అంటారు. కరోనా విషయంలో వైరస్‌ సంక్రమించే తీవ్రత ‘ఆర్‌ -3’ నుంచి ‘ఆర్‌-5’ దాకా ఉంది. అంటే... జనసాంద్రతను బట్టి, కరోనా సోకిన ఒక వ్యక్తి ద్వారా ఆ వైరస్‌ ముగ్గురి నుంచి ఐదుగురికి సోకుతోంది. లక్షణాలు బయల్పడే లోపే, వైరల్‌ లోడ్‌ ఇతరులకు సోకే స్థాయికి చేరుకుంటోంది. ఫలితంగా 14 రోజుల ఇంక్యుబేషన్‌ పీరియడ్‌లోనే.. వైరస్‌ సోకిన వ్యక్తికి తెలియకుండానే.. ఎంతోమందికి ఈ వైరస్‌ సోకుతోంది. వారి ద్వారా ఇంకొందరికి వైరస్‌ సోకుతోంది. ఈ వ్యాధి ఇంతలా విస్తరించడానికి కారణం ఇదే. వేరే దేశాల్లో ఉండగా కరోనా సోకి, ఆ తర్వాత దేశంలోకి అడుగుపెట్టిన వ్యక్తులకే ఈ వ్యాధి పరిమితమై ఉంటే, ఆ దశను ఫేజ్‌-1 అనాలి. వారికి దగ్గరగా మెలిగే కుటుంబసభ్యులకూ వైరస్‌ సోకితే ఆ దశ... ఫేజ్‌-2. ఈ రెండు దశలకు భిన్నంగా ఫేజ్‌-1, ఫేజ్‌-2 వ్యక్తులతో నేరుగా సంబంధం లేకుండా సామాజిక సంక్రమణ(కమ్యూనిటీ స్ర్పెడ్‌)లో భాగంగా వ్యాధి సోకితే ఆ దశను ఫేజ్‌-3గా పరిగణించాలి. ప్రస్తుతం చాలా దేశాలు ఫేజ్‌-3లో ఉన్నాయి. ఫేజ్‌-2లో మేలుకోకపోవడం వల్లనే ఆయా దేశాలకు ఈ దుస్థితి. అక్కడ వైరస్‌ ఉధృతి ఎక్కువగా ఉంది. మనదేశంలో, రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పాటిస్తూ ఇతరత్రా రక్షణచర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ ఫేజ్‌-3 వచ్చే అవకాశాలు తక్కువే. కానీ.. తాజాగా వెలుగులోకి వచ్చిన నిజాముద్దీన్‌ యాత్రికుల్లో చాలామందికి వైరస్‌ పాజిటివ్‌ వస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అయితే మరణాల శాతం తక్కువే. వైరస్‌ సోకినవారిలో మరణిస్తున్నవారు కేవలం 3 శాతమే.


వైద్యుల పట్ల అనుమానపు చూపు వద్దు!

కరోనా వైరస్‌ ప్రబలిన తొలినాళ్లలో చైనాలో చాలామంది వైద్యులు దానిపై తగిన అవగాహన లేక మాస్కులు ధరించలేదు. తగిన రక్షణ చర్యలు పాటించలేదు. వ్యాధితత్వాన్ని, ప్రభావాన్ని, తీవ్రతను అంచనా వేయలేకపోయారు. ఈ కారణాలన్నింటి వల్ల అక్కడ కొందరు వైద్యులు ఆ వైర్‌సకు బలయ్యారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కరోనా పట్ల వైద్యులకు పూర్తి అవగాహన ఉంది. కాబట్టే ఆస్పత్రుల్లో నెగెటివ్‌ చాంబర్లు ఏర్పాటు చేసుకుని.. రోగి నుంచి వైరస్‌ సోకకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. వారి ద్వారా ఇతరులకు వైరస్‌ సోకే వీలు లేదు. కరోనా రోగి ప్రాణాలను కాపాడిన వైద్యులను ఆకాశానికి ఎత్తేసే ప్రజలే.. వారి నుంచి తమకు వ్యాధి సోకుతుందనే భయంతో వారిని దూరం నెట్టేయడం సరికాదు. వైద్యులను, వైద్య సిబ్బందినీ అంటరానివారిగా చూడొద్దు. కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలిన వ్యక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. 

-నవ్య డెస్క్‌

Updated Date - 2020-04-02T09:31:34+05:30 IST