‘లాక్‌డౌన్‌’ సమన్వయ బృందాలు

ABN , First Publish Date - 2020-03-31T09:24:52+05:30 IST

కరోనా మహమ్మారి విస్తరిస్తోన్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరింత పకడ్బందీగా అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ సందర్భంగా నిత్యావసరాల లభ్యత, దానితో ముడిపడిన ఏ ఒక్క అంశంలోనూ సమస్య

‘లాక్‌డౌన్‌’ సమన్వయ బృందాలు

  • అఖిల భారత సర్వీసు అధికారులతో ఏర్పాటు
  • రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌
  • జిల్లాల్లో జేసీ నేతృత్వంలో ఏర్పాటు


అమరావతి, మార్చి 30(ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి విస్తరిస్తోన్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరింత పకడ్బందీగా అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ సందర్భంగా నిత్యావసరాల లభ్యత, దానితో ముడిపడిన ఏ ఒక్క అంశంలోనూ సమస్య రాకుండా పర్యవేక్షించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో అఖిల భారత సర్వీసు అధికారులతో అత్యున్నత స్థాయి సమన్వయ బృందాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐఏఎస్‌, ఐఎ్‌ఫఎస్‌, ఐఆర్‌ఎస్‌, ఐఐఎస్‌లతోపాటు ఐపీఎస్‌ అధికారులకూ ఇందులో భాగస్వామ్యం కల్పించారు. లాక్‌డౌన్‌ పక్కాగా అమలయ్యేలా అత్యవసర సేవల్లో పాల్గొనే విభాగాలను ఎప్పటికప్పుడు సమన్వయం చేయడం, నిత్యావసర సరుకులు పక్కాగా ప్రజలకు చేరేందుకు అవసరమైన తక్షణ చర్యలు తీసుకోవడాన్ని ఈ బృందాలు పర్యవేక్షిస్తుంటాయి. ఇక ఆయా అంశాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు, సూచనలు, సలహాలు తీసుకునేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేయాలని సీఎస్‌ ఆదేశించారు. జిల్లా స్థాయిలో జాయింట్‌ కలెక్టర్‌ నే తృత్వంలో కంట్రోల్‌ రూమ్‌లు పనిచేస్తాయి.


కమిటీల విధులు: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఎలా అవుతోందో నిర్ధారిస్తాయి. ఈ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిత్యావసరాలు అందుతున్నాయా? లేదా?, సరుకు రవాణాలో ఏమైనా చిక్కులు ఎదురవుతున్నాయా? అన్నది పరిశీలించి వాటి పరిష్కారానికి సత్వర చర్యలను సిఫారసు చేస్తాయి. అంతేకాదు, ఈ మొత్తం వ్యవహారంతో ముడిపడిన, సంబంధించిన శాఖల వ్యవహారాల్లో ఈ బృందాలు పాలుపంచుకొంటాయి. నిత్యావసరాల ప్రస్తుత ధరలు, రానున్న రోజుల్లో ఉండే ట్రెండ్‌ ఎలా ఉంటుందో ముందుగానే ప్రకటిస్తారు. 1902, స్పందన కాల్‌ సెంటర్లకు వచ్చే ఫిర్యాదులు, సూచనలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాయి. మార్కెటింగ్‌, పౌరసరఫరాలు, పోలీసు, డైయిరీ డెవల్‌పమెంట్‌, పశుసంవర్థక, మత్స్య, పురపాలక, పంచాయితీరాజ్‌, కార్మిక శాఖల నుంచి వచ్చే సమాచారాన్ని క్రోడీకరిస్తారు. ఈ సమన్వయ బృందం ఇన్‌చార్జి నేతృత్వంలో రాష్ట్ర స్థాయిలో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేయనున్నారు.

Updated Date - 2020-03-31T09:24:52+05:30 IST