కరోనా డాక్టర్లకు రక్షిత కిట్లు ఉన్నాయా?

ABN , First Publish Date - 2020-04-07T09:22:18+05:30 IST

కరోనా వైరస్‌ రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బందికి వ్యక్తిగత భద్రతా సామగ్రిని(పీపీఈ కిట్లు) సరిపడా అందుబాటులో ఉన్నాయా అని రాష్ట్ర హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

కరోనా డాక్టర్లకు రక్షిత కిట్లు ఉన్నాయా?

  • వ్యాధి కట్టడికి చర్యలేం తీసుకున్నారు?
  • నిత్యావసరాలు దొరుకుతున్నాయా?
  • రాష్ట్ర సర్కారును నివేదిక కోరిన హైకోర్టు


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బందికి వ్యక్తిగత భద్రతా సామగ్రిని(పీపీఈ కిట్లు) సరిపడా అందుబాటులో ఉన్నాయా అని రాష్ట్ర హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు తీసుకున్న చర్యలు తెలియజేయాలని ఆదేశించింది. ఈమేరకు హైకోర్టు సీజే రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఆదేశాలు జారీచేసింది. ‘‘సామాన్య ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచారా? వలస కార్మికుల సంక్షేమానికి ఎలాంటి చర్యలు చేపట్టారు?’’ తదితర వివరాలతో ఈనెల 9లోగా మధ్యంతర నివేదిక ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. ఈనెల 15లోగా సమగ్ర నివేదికను  కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు పీఎల్‌ విశ్వేశ్వరరావు,  చెరుకు సుధాకర్‌ కలిసి దాఖలు చేసిన వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చింది. తెలంగాణలో కరోనా వ్యాపించిన నేపథ్యంలో ఫిబ్రవరి 1, మార్చి 25 మధ్య కాలంలో విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారందరినీ  క్వారంటైన్‌ చేయాలని పిటిషనర్లు కోరారు. కరోనా  రోగులకు చికిత్స చేస్తున్న డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కులు అందచేయాలని కూడా వారు కోరారు. ఈ వ్యాజ్యాన్ని పరిశీలించిన ధర్మాసనం కోవిడ్‌-19 రోగులకు చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందికి కూడా వైరస్‌ సోకినట్లు పత్రికల్లో కథనాలు చూసామని తెలిపింది. డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బందికి ఈ వ్యాధి సోకకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి నెలకొందని రాష్ట్ర ఏజీ బీఎస్‌. ప్రసాద్‌నుద్దేశించి ధర్మాసనం ప్రశ్నించింది.


గిరిజన ప్రాంతాలపై దృష్టి

రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను 27 జిల్లాల్లో ఈ వైరస్‌ విస్తృతంగా వ్యాప్తి చెందుతోందని, కేసుల సంఖ్య పెరుగుతోందని ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో గిరిజన ప్రాంతాలపై దృష్టిసారించాలని ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపర్చాలని సూచించింది. కరోనా ప్రబలకుండా తెలంగాణ ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకుంటోందని, అయితే అక్కడక్కడ కొన్ని లోపాలు కనిపిస్తున్నాయని, వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని తెలిపింది. సీజే వేసిన ప్రశ్నలకు ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ సమాధానమిచ్చారు. కరోనా రోగులకు చికిత్స చేస్తున్న డాక్టర్ల రక్షణకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు తెలిపారు. అవసరమైన పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ధర్మాసనం అభినందించింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు బాగున్నాయని వ్యాఖ్యానించింది.


మత ప్రార్థనలపై ఆంక్షలు తప్పదు

లాక్‌డౌన్‌ సమయంలో పెద్దఎత్తున ప్రజలు ప్రార్థనల్లో పాల్గొనకుండా అన్ని మతాలవారిపై కఠిన ఆంక్షలు విధించాలని ధర్మాసనం సూచించింది. ‘ఈస్టర్‌’ కార్యక్రమాలు చర్చిల్లో జరగకుండా చూడాలంది. ఈ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం ఒక సర్క్యులర్‌ జారీచేసిందని ఏజీ కోర్టుకు తెలిపారు. ప్రార్థనా స్థలాల పరిసరాల్లో గట్టి నిఘా ఉంచినట్లు తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో పేదలకు, ఆహారం కోసం భారీగా జనం గుమిగూడుతున్నారని జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి పేర్కొన్నారు. ఇదే వరవడి కొనసాగితే లాక్‌డౌన్‌ లక్ష్యం నెరవేరదని అన్నారు.

Updated Date - 2020-04-07T09:22:18+05:30 IST