అమెరికాలో కరోనా విశ్వరూపం.. ఒక్కరోజే..!

ABN , First Publish Date - 2020-07-13T13:58:11+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విశ్వరూపం చూపుతోంది! ఇంతింతై.. వైరస్‌ ఇంతై.. అన్నట్టుగా రోజురోజుకూ కొత్త కేసుల సంఖ్య వేలల్లో పెరిగిపోతూ ఆందోళనకరస్థాయికి చేరుకుంటోంది. జూలై 7న 53 వేల కేసులు.. 663 మరణాలు, 8న 61 వేల కేసులు..962 మరణాలు, 9న 63 వేల కేసులు.. 970 మరణాలు, 10న 66 వేల కేసులు.. 879 మరణాలు

అమెరికాలో కరోనా విశ్వరూపం.. ఒక్కరోజే..!

  • ఒకేరోజు 66 వేలకుపైగా కేసులు
  • 5 రోజుల్లో నాలుగోసారి 60వేల మార్కు
  • శనివారం ఒక్కరోజే 915 మరణాలు
  • దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లో భారీగా వ్యాప్తి
  • కాలిఫోర్నియా, టెక్సస్‌, ఫ్లోరిడా, అరిజోనాల్లో విశ్వరూపం

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విశ్వరూపం చూపుతోంది! ఇంతింతై.. వైరస్‌ ఇంతై.. అన్నట్టుగా రోజురోజుకూ కొత్త కేసుల సంఖ్య వేలల్లో పెరిగిపోతూ ఆందోళనకరస్థాయికి చేరుకుంటోంది. జూలై 7న 53 వేల కేసులు.. 663 మరణాలు, 8న 61 వేల కేసులు.. 962 మరణాలు, 9న 63 వేల కేసులు.. 970 మరణాలు, 10న 66 వేల కేసులు.. 879 మరణాలు నమోదయ్యాయి! ఇక శనివారం ఒక్కరోజే అమెరికాలో రికార్డు స్థాయిలో 71 వేలకు పైగా కేసులు, 915 మరణాలు నమోదయ్యాయంటే అక్కడ పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు! అమెరికాలో కేసుల సంఖ్య 33 లక్షలు, కరోనా మరణాల సంఖ్య 1.37 లక్షలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రాలవారీగా చూస్తే ఇన్నాళ్లూ న్యూయార్క్‌లో భారీగా కేసులు నమోదైతే.. ఇప్పుడు దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలైన టెక్సస్‌, ఫ్లోరిడా, అరిజోనా, కాలిఫోర్నియా వంటిచోట్ల కేసులు భారీగా పెరుగుతున్నాయి. అమెరికాలో నమోదైన కేసుల్లో 30ు ఆ రాష్ట్రాలవే. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. జూలై 8 నుంచి రోజూ 850 మందికి పైగా కరోనాతో ప్రాణాలు కోల్పోతున్నారు. అలా 5 రోజుల్లో 3500 మందికి పైగా మరణించారు. మే మూడోవారం నుంచి తగ్గుతూ వచ్చిన మరణాల సంఖ్య జూలై 5న అతి తక్కువగా 200కు చేరుకుంది. కానీ, అనూహ్యంగా మళ్లీ భారీగా పెరగడం మొదలైంది.


ఎందుకిలా?

దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లో కేసులు, మరణాలు పెరగడమే అమెరికాలో కరోనా ప్రస్తుత విశ్వరూపానికి కారణం. గతవారంలో అలబామా, అరిజోనా, ఫ్లోరిడా, మిస్సిసిపి, ఉత్తర కరొలినా, దక్షిణ డకోటా, టెక్సస్‌, టెన్నిసీ రాష్ట్రాల్లో ఒకరోజు అత్యధిక మరణాలు నమోదయ్యాయి. టెక్స్‌సలో గతవారంతో పోలిస్తే మరణాలు ఏకంగా 20ు పెరిగాయి. ఫ్లోరిడాలో 11ు పెరగ్గా కాలిఫోర్నియాలో పెరుగుదల 12ు. కొత్త కేసుల సంఖ్య కూడా టెక్సస్‌,ఫ్లోరిడా, అరిజోనా, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో పెరగడం గమనార్హం. దీంతో ఆయా రాష్ట్రాలు ఆస్పత్రులపై భారాన్ని తగ్గించేందుకు లాక్‌డౌన్‌ ఆంక్షలను పునరుద్ధరించాయి.


ఆ నాలుగు రాష్ట్రాల్లో..

అమెరికాలో కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరగడానికి ప్రధాన కారణం 4 రాష్ట్రాలు. అవి.. టెక్సస్‌, ఫ్లోరిడా, అరిజోనా, కాలిఫోర్నియా. జూలై నెలలో తొలి 10 రోజుల్లో నమోదైన కేసులు 5,27,278. అందులో 2,90,700కేసులు ఈ నాలుగు రాష్ట్రాలవే. అంటే దాదాపు 55ు! ఫ్లోరిడాలో అయితే 10 రోజులుగా కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. 5 రోజులు 10 వేలకు పైగా పాజిటివ్‌లు వచ్చాయి. ఇక.. న్యూయార్క్‌ తర్వాత కరోనాకు హాట్‌స్పాట్‌గా మారిన టెక్స్‌సలో వారం రోజుల్లో రెండుసార్లు 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనాతో మందగించిన ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించిన తొలి రాష్ట్రాల్లో టెక్సస్‌ కూడా ఒకటి. ఈ నెలలో ఆ రాష్ట్రంలో 72,500కేసులకు పైగా నమోదయ్యాయి. అమెరికాలో ఈ నెలలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రం అదే. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆర్థిక లాక్‌డౌన్‌ విధించే అవకాశం ఉందని ఆ రాష్ట్ర గవర్నర్‌ గ్రెగ్‌ అబ్బాట్‌ ప్రకటించారు. ఇక, భారతీయులు, తెలుగువారు ఎక్కువగా ఉండే కాలిఫోర్నియాలో కరోనా కారణంగా ఆస్పత్రులపాలైనవారి సంఖ్య రెట్టింపు అయ్యింది. 2 వారాల్లోనే కేసుల సంఖ్య 2 లక్షల నుంచి 3 లక్షలకు చేరింది. లాక్‌డౌన్‌ విధించినా కాలిఫోర్నియాలో జూలై 5న 11,800 కేసులు, 7న 13 వేల కేసులు నమోదయ్యాయి. వారం రోజుల సగటును పరిశీలిస్తే రోజుకు సరాసరి 8 వేల మంది కొత్తగా వైరస్‌ బారిన పడినట్టు అని ఆ రాష్ట్ర గవర్నర్‌ గవిన్‌ న్యూసమ్‌ తెలిపారు. 


మరణాల పెరుగుదల.. ఊహిస్తున్నదే!

అమెరికాలో కరోనా మరణాల సంఖ్య భారీగా పెరుగుతుందన్న వైద్యనిపుణుల అంచనా ఇప్పుడు నిజమవుతోంది. కరోనా కేసులు, హాస్పిటలైజేషన్‌ పెరగుతున్నాయంటే అక్కడ భారీగా మరణాలు నమోదవుతాయని చెబుతున్నారు. దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్నది అదే అన్నారు. కొత్తగా వైరస్‌ బాధితుల సంఖ్య పెరుగుతున్నందున మరణాల సంఖ్య ఇలాగే పెద్ద సంఖ్యలో ఉంటుందని హెచ్చరిస్తున్నారు. జాన్స్‌హాప్కిన్స్‌ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం 2 వారాల క్రితం అమెరికాలో రోజువారీ మరణాల రేటు సగటున 578గా   ఉండగా.. జూలై 10 నాటికి 664కు పెరిగింది. 27 రాష్ట్రాల్లో మరణాల సంఖ్య పెరిగినా మెజారిటీ రాష్ట్రాల్లో రోజువారీ సగటు 15గానే ఉంది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే భారీగా చనిపోతున్నారు. కాలిఫోర్నియాలో రోజువారీ మరణాల సగటు 91గా ఉండగా.. టెక్స్‌సలో 66గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన 1.27 కోట్ల కేసుల్లో.. 33 లక్షలకు పైగా.. అంటే నాలుగో వంతుకు పైగా కేసులు అమెరికావే!


ఒకేరోజు 66 వేల కేసులు

ఎట్టకేలకు మాస్క్‌ ధరించిన ట్రంప్‌

వాషింగ్టన్‌, జూలై 12: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌ రికార్డుల మోత మోగిస్తోంది. జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ లెక్కల ప్రకారం శనివారం ఇక్కడ 66,570 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అమెరికాలో ఒకేరోజు ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారి. కాగా.. 60 వేలకుపైగా పాజిటివ్‌లు తేలడం గత ఐదు రోజుల్లో ఇది నాలుగోసారి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 33,87,470కి ఎగబాకింది. ఇప్పటి వరకు 1,37,631 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా కలవరం మొదలైంది మొదలు ఇప్పటివరకూ ఫేస్‌ మాస్క్‌ ధరించని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎట్టకేలకు విమర్శలకు తలొగ్గారు. తొలిసారిగా మాస్క్‌ ధరించి కనిపించారు. శనివారం వాల్టర్‌ రీడ్‌ మిలటరీ ఆస్పత్రికి వచ్చిన ఆయన అధ్యక్ష ముద్ర ఉన్న మాస్క్‌ ధరించి కనిపించారు. బ్రెజిల్‌లోనూ వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పట్టడం లేదు. 24 గంటల్లో ఇక్కడ 35,558 మందికి వైరస్‌ సోకగా.. మొత్తం కేసుల సంఖ్య 18,46,249కి పెరిగింది. 

-సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - 2020-07-13T13:58:11+05:30 IST