లాక్‌డౌన్‌లో లొల్లి!

ABN , First Publish Date - 2020-06-07T05:35:42+05:30 IST

ప్రతి సమ్మర్‌లో సినిమాలు వచ్చేవి... ప్రేక్షకులకు వినోదాన్ని పంచి వెళ్లేవి! ఈసారి సినిమాలు రాలేదు...

లాక్‌డౌన్‌లో లొల్లి!

ప్రతి సమ్మర్‌లో సినిమాలు వచ్చేవి...

ప్రేక్షకులకు వినోదాన్ని 

పంచి వెళ్లేవి!

ఈసారి సినిమాలు రాలేదు...

సమస్యలొచ్చాయి. సెగలు సృష్టించాయి!!

ఒకవేళ సినిమాలు వచ్చి ఉంటే?

పరిస్థితులు సాధారణంగా ఉండి ఉంటే?

సమస్యలు ఈ స్థాయిలో వచ్చేవి కాదేమో!?

లాక్‌డౌన్‌లో లొల్లి...

కరోనా చేసిన కుట్రల్లో ఒకటి!!!


పిలుపు లేదు... పలుకు ఘాటు!

కరోనా కాటుకు చిత్రసీమ కుదేలైంది! చిత్రీకరణలు బంద్‌ కావడంతో ఉపాధి లేక కార్మికులకు కష్టాలు తప్పలేదు. థియేటర్ల బంద్‌ వలన సినిమాలు విడుదల చేసే పరిస్థితులు లేక నిర్మాతలూ కష్టనష్టాలు అనుభవిస్తున్నారు. కుదేలైన చిత్ర పరిశ్రమను ఒడ్డున పడేయాలని తెలంగాణ ప్రభుత్వం, పరిశ్రమలో కొందరు పెద్దలు ప్రయత్నాలు ప్రారంభించారు. చర్చలు జరిపారు. అయితే, వాటికి అగ్ర హీరో నందమూరి బాలకృష్ణను సమావేశ నిర్వాహకులు ఆహ్వానించలేదు. తనను చర్చలకు పిలవలేదని ఆయన చెప్పిన సమయంలో ఉపయోగించిన ఓ పలుకు పరిశ్రమలో ఘాటుకు కారణమైంది. బాలకృష్ణను ఆహ్వానించకపోవడంపై టి. ప్రసన్నకుమార్‌ వంటి వ్యక్తులు అసంతృప్తి వ్యక్తం చేయడం, ‘ఎవరితో పని జరుగుతుందంటే వాళ్లతో ముందుకు వెళతాం’ అని ఒకరిద్దరు బదులివ్వడంతో పరిశ్రమలో వాతావరణం వేడేక్కింది.


భూములు పంచుకుంటున్నారనే బాలకృష్ణ ఆరోపణ మరింత ఆజ్యం పోసింది. పరిస్థితి తెలుగు చిత్రసీమలో ఐకమత్యమనేది నేతి బీరకాయలో నేతి చందమే అని ఒక దశలో అనిపించింది. రెండు వర్గాలుగా విడిపోయి మాటల తూటాలు పేల్చుకున్నారు. బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని నాగబాబు డిమాండ్‌ చేశారు. ఆ తర్వాత పరిస్థితి పరిశ్రమ చేయి దాటింది. అభిమానులు రంగ ప్రవేశం చేసి, సోషల్‌ మీడియా వేదికగా శృతిమించారు. నాగబాబును నందమూరి అభిమానులు తిడితే... లేపాక్షి ఉత్సవాల సమయంలో బాలకృష్ణ మాట్లాడిన తీరును మెగాఅభిమానులు ఎండగట్టారు. తర్వాత ఈ వివాదం సద్దుమణిగింది.


విస్మరించారు... విమర్శించారు!

సినిమా సమష్టి కృషికి నిదర్శనమని చెబుతారు. అందులో అగ్ర తాంబూలం తెరపై కనిపించే కథానాయకుడు, చిత్రాన్ని తెరకెక్కించే దర్శకుడు, డబ్బులు ఖర్చుపెట్టే నిర్మాతకు కట్టబెడతారు. దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ఎందుకో నిర్మాత బండ్ల గణేశ్‌కి తాంబూలం ఇవ్వలేదు. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన ‘గబ్బర్‌ సింగ్‌’ చిత్రం విడుదలై ఎనిమిదేళ్లు పూర్తయి న సందర్భంగా చిత్రబృందంలో పలువురికి హరీశ్‌ శంకర్‌ పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పారు. బండ్ల గణేశ్‌ పేరును విస్మరించారు. పొరపాటుగా పేరు రాయడం మర్చిపోలేదని, కావాలనే చేశారని తదనంతర పరిణామాలు తేటతెల్లం చేశాయి. దర్శక, నిర్మాతల మధ్య లొల్లి ఉందనే విషయాన్ని చెప్పకనే చెప్పాయి. హరీశ్‌ శంకర్‌తో మళ్లీ సినిమా చేయనని బండ్ల గణేశ్‌ టీవీ ఛానళ్లతో చెప్పారు. అటు దర్శకుడు పరోక్షంగా స్పందించారు. మధ్యలో బండ్లకు వ్యతిరేకంగా, హరీశ్‌కి మద్దతుగా నిర్మాత పీవీపీ ‘బ్లేడు బాబు యూట్యూబ్‌లో షార్ట్‌ ఫిల్మ్‌ కూడా తీయలేడు. నీకు (హరీశ్‌కి) చాలామంది నిర్మాతలున్నారు’ అని ట్వీటేశారు. ‘‘ఓ మనిషిని చీల్చి చెండడానికి ఫైటే అక్కర్లేదు. ట్వీటు చాలని నిరూపించారు’’ అని పీవీపీకి హరీశ్‌ శంకర్‌ బదులిచ్చారు. దాంతో ఇద్దరి మధ్య లొల్లి నిజమేనని తెలిసింది.


ప్రియాంకా చోప్రా.. తమన్నాకు సైతం!

లాక్‌డౌన్‌లో ఖాళీ ఎక్కువ కావడమో? చేతిలో పని లేకపోవడమో? సోషల్‌ మీడియాలో చేతికి పని చెప్పే ప్రజలు ఎక్కువయ్యారు. సెలబ్రిటీలను టార్గెట్‌ చేస్తూ ట్రోల్స్‌ చేయడం ఈమధ్య మరీ ఎక్కువైంది. అమెరికాలో ఆఫ్రో-అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు మద్దతు తెలిపిన ప్రియాంకా చోప్రా, తమన్నాను ట్రోల్‌ చేశారు. గతంలో బ్యూటీ ప్రొడక్ట్స్‌కి వాళ్లు బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరించడంతో ‘అప్పుడు మీరు చేసిందేంటి? అదీ వర్ణ వివక్షే’ అని పలువురు నెటిజన్లు కామెంట్స్‌ చేశారు. సద్విమర్శ ఎప్పుడూ మంచిదే. అయితే, ప్రతి విషయంలోనూ భావవ్యక్తీకరణలో కొందరు బోర్డర్లు దాటడం వివాదాలకు కారణమవుతోంది. సోషల్‌ మీడియా గల్లీల్లో లొల్లి తప్పడం లేదు.



సైబర్‌... సెటైర్‌!

ఎవరో సైబర్‌ నేరగాళ్లు చేసిన పనికి పూజా హెగ్డేను సమంత అభిమానులు నానాతిట్లు తిట్టారు. ఇటీవల కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన కొంత మంది సోషల్‌ మీడియా ఖాతాలు హ్యాకింగ్‌కు గురయ్యాయి. కన్నడ కస్తూరి పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతానూ హ్యాక్‌ చేసి, సమంత ఏమంత అందంగా లేదని పోస్టు చేశారు. దానికి ‘మజిలీ’లో సమంత ఫొటో జత చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా హ్యాకింగ్‌కి గురైందనీ, ఆ సమయంలో వచ్చిన పోస్టులను పట్టించుకోవద్దనీ, తన డిజిటల్‌ టీమ్‌ సెక్యూరిటీపరమైన జాగ్రత్తలు తీసుకుంటోందని పూజా హెగ్డే తెలిపారు. కొంతసేపటి తర్వాత హ్యాకర్స్‌ చేతిలోంచి ఇన్‌స్టా ఖాతాను తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు ఆమె పేర్కొన్నారు. అయితే, పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌ను ఎవరూ హ్యాక్‌ చేయలేదనీ, కావాలనే డ్రామా ఆడారనేది సమంత అభిమానుల ఆరోపణ. ఆరోపించడమే కాదు, ఆమెపై విమర్శలూ చేశారు. ‘టీమ్‌ సమంత’ హ్యాష్‌ట్యాగ్‌తో సమంత చేసిన మంచి పనులను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అభిమానులకు సమంత స్నేహితురాలు గాయని చిన్మయి జత కలిశారు. ‘టీమ్‌ సమంత’ అంటూ ఆమె కూడా పోస్టులు చేశారు. అయితే... దర్శకురాలు నందినీరెడ్డి ఇన్‌స్టా పోస్టు కింద ‘నా అకౌంట్‌ హ్యాక్‌ కాలేదు’ అంటూ చిన్మయి కామెంట్‌ చేయడం, ‘హ్యాక్‌ కావాలంటే నీ స్వభావం చెడ్డది అయి ఉండాలి’ అని నందినీరెడ్డి బదులివ్వడం, ‘తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ హ్యాకింగ్‌ మీద జోకులు సస్పెండ్‌ చేస్తున్నాం’ అని సమంత పేర్కొనడం పూజా హెగ్డే అభిమానులకు కోపం తెప్పించాయి. హుందాగా ప్రవర్తించడం మాని, ఈ విధంగా ఎగతాళి చేయడం, సెటైర్లు వేయడం ఏంటని ప్రశ్నించారు. ‘వుయ్‌ సపోర్ట్‌ పూజా హెగ్డే’ హ్యాష్‌ట్యాగ్‌తో స్ట్రాంగ్‌ కౌంటర్లు వేశారు. అందులో కొందరు హద్దుమీరి కామెంట్స్‌ చేయడంతో చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు.


ట్వీట్సు.. ట్రోల్సు!

మీరా చోప్రా చేసిన ఒక్క ట్వీటు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తుందనీ, ఆమెపై విపరీతంగా ట్రోల్స్‌ వస్తాయని ఎవరూ ఊహించి ఉండరు. ఒక్క ఉదంతంతో తెలుగు ప్రేక్షకులు దాదాపుగా మర్చిపోయిన ఉత్తరాది భామ, మరోసారి వార్తల్లో నిలిచారు. వివరాల్లోకి వెళితే... మొన్నామధ్య ట్విట్టర్‌లో ప్రేక్షకులతో మీరా చోప్రా ముచ్చటించారు. తెలుగు హీరోల్లో ఎవరంటే ఇష్టమన్న ప్రశ్నకు మహేశ్‌బాబు అని బదులిచ్చారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ గురించి అడిగితే ‘నేను అతని అభిమానిని కాదు’ అని ఆమె చెప్పారు. ఈ సమాధానం కొందరికి ఆగ్రహం తెప్పించింది. దాంతో ఆమెపై విరుచుకుపడ్డారు. ట్విట్టర్‌లో తమను తాము ఎన్టీఆర్‌ అభిమానులుగా పేర్కొన్న కొందరు, మీరా చోప్రాను ట్రోల్‌ చేయడం ప్రారంభించారు. ఆమె తల్లితండ్రులకు కరోనా సోకి మరణించాలని శాపనార్థాలు పెట్టారు. ఇంకా అడుగు ముందుకు వేసి... రేప్‌ చేస్తామనీ, మర్డర్‌ చేస్తామనీ బెదిరింపులకు దిగారు. ట్విట్టర్‌లో తనను వేధించినవారిపై మీరా చోప్రా సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో 15మందికి పోలీసులు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.

Updated Date - 2020-06-07T05:35:42+05:30 IST