తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి

ABN , First Publish Date - 2020-05-29T15:57:34+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి తగ్గడంలేదు. రెండు రాష్ట్రాల్లో రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి తగ్గడంలేదు. రెండు రాష్ట్రాల్లో రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో రికార్డు స్థాయిలో 117 కేసులు నమోదు అయ్యాయి. సౌదీ అరేబియా నుంచి వచ్చిన 49 మంది కరోనా బారిన పడగా.. ఇద్దరు వలస కార్మికులకు వైరస్ సోకింది. మరో 66 మంది స్థానికులకు కరోనా సోకినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 2,256కు చేరింది. కరోనా బారిన పడి ఇప్పటి వరకు 67 మంది మృతి చెందారు. మరో 1,345 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 844 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.   


ఏపీలోనూ కరోనా ఉధృతి తగ్గడంలేదు. గడిచిన 24 గంటల్లో 54 కేసులు నమోదయ్యాయి. వైరస్ సోకినవారిలో ఎక్కువమంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు ఉండడం కలవరానికి గురిచేస్తోంది. విదేశాల నుంచి వస్తున్నవారికి నిర్వహిస్తున్న పరీక్షల్లో కూడా ఎక్కువ మందికి కరోనా వైరస్ బయటపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో 24 గంటల్లో 9,858 శాంపిల్స్ పరీక్షించగా 54 మందికి పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కరోనా కేసుల సంఖ్య 2,841కి చేరుకుంది. కరోనాతో కొత్తగా ఒకరు మరణించడంతో దీంతో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 59కి చేరుకుంది. మరోవైపు కర్నూలు జిల్లాలో కరోనా రోగి ఆస్పత్రి నుంచి పరారవడం కలకలం రేపింది. అయితే స్వగ్రామానికి వెళుతుండగా గుర్తించి ఆస్పత్రికి తరలించడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. 

Updated Date - 2020-05-29T15:57:34+05:30 IST