వేలం ప్రక్రియ కొనసాగించుకోండి

ABN , First Publish Date - 2020-05-29T07:41:06+05:30 IST

విశాఖ, గుంటూరు జిల్లాల్లోని తొమ్మిది చోట్ల భూముల వేలానికి సంబంధించిన ప్రక్రియను కొనసాగించుకునేందుకు హైకోర్టు అంగీకరించింది.

వేలం ప్రక్రియ కొనసాగించుకోండి

  • కానీ టెండర్లను ఖరారు చేయవద్దు
  • భూముల విక్రయంపై సర్కారుకు హైకోర్టు స్పష్టీకరణ..18కి వాయిదా
  • 11న వేలం: మిషన్‌ బిల్డ్‌ ఏపీ డైరెక్టర్‌


అమరావతి, మే 28 (ఆంధ్రజ్యోతి): విశాఖ, గుంటూరు జిల్లాల్లోని తొమ్మిది చోట్ల భూముల వేలానికి సంబంధించిన ప్రక్రియను కొనసాగించుకునేందుకు హైకోర్టు అంగీకరించింది. అయితే టెండర్లను ఖరారు చేయరాదని రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. తదుపరి విచారణను జూన్‌ 18వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ బీ కృష్ణమోహన్‌తో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం విక్రయించదలచిన భూముల్లో గతంలో దాతలు ఇచ్చినవి ఉన్నాయని, నిబంధనల మేరకు వాటిని విక్రయించడానికి వీల్లేదంటూ హైకోర్టులో ఐదు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై గురువారం మరోమారు ధర్మాసనం ఎదుట విచారణ జరిగింది.


ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ఈ నెల 28వ తేదీ నుంచే భూముల వేలం ప్రక్రియ జరగనుందని, చట్టనిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ తంతును అడ్డుకోవాలని అభ్యర్థించారు.  2012 లో తీసుకొచ్చిన భూకేటాయింపు విధానం మేరకు ఈ భూముల్ని విక్రయించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని వివరించారు. గుంటూరులో విక్రయించతలపెట్టిన స్థలంలో మార్కెట్‌ కొనసాగుతోందని, ప్రజావసరాలకు అనుగుణంగా ఉన్న దీనిని విక్రయించరాదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ..భూముల వేలం వాయిదా పడిందని, జూన్‌ 11 నుంచి 13వ తేదీ వరకు వేలం నిర్వహించనున్నామని తెలిపారు. ప్రభుత్వం విక్రయించతలచిన భూములన్నీ ఖాళీ స్థలాలని పేర్కొన్నారు. వాటిని విక్రయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని వివరించారు. ఇరువురి తరఫు వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. దీనిపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందంటూ విచారణను వాయిదా వేసింది. 


వినతులమేరకే పొడిగింపు : ప్రవీణ్‌కుమార్‌

ప్రభుత్వ భూముల వేలాన్ని జూన్‌ 11న చేపడతామని మిషన్‌ బిల్డ్‌ ఏపీ డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం, శుక్రవారం విశాఖ, గుంటూరుల్లోని తొమ్మిది భూముల అమ్మకానికి వేలం నిర్వహించాల్సి ఉంది. అయితే, వేలం తేదీని పొడిగించాలని తమకు పెద్ద ఎత్తున విన్నపాలు వచ్చాయని ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. దీంతోపాటు వేలంలో మరింత మంది పాల్గొనేందుకు అవకాశం కల్పించేందుకు కూడా ఈ నిర్ణయం తీసుకొన్నామని ఆయన వెల్లడించారు. 

Updated Date - 2020-05-29T07:41:06+05:30 IST