ఎన్నారైల తోడ్పాటుతో వలసకూలీలకు రైతుల సాయం

ABN , First Publish Date - 2020-05-26T20:09:30+05:30 IST

మ‌హ‌మ్మారి క‌రోనా లాక్‌డౌన్‌తో వ‌ల‌స‌కూలీల అవ‌స్థ‌లు వ‌ర్ణ‌ణాతీతంగా మారాయి. ఉన్న‌చోట ఉపాధి క‌రువై.. చేతిలో చిల్లిగ‌వ్వ‌లేక కాలిన‌డ‌క‌న‌ సొంతూరికి త‌ర‌లి వెళ్తున్న దృశ్యాలు త‌ర‌చూ క‌నిపిస్తున్నాయి.

ఎన్నారైల తోడ్పాటుతో వలసకూలీలకు రైతుల సాయం

వలస జీవులకి నిరంతర సాయం అందిస్తున్న నిడమానూరు రైతు బిడ్డ‌లు 

నిడమానూరు(విజ‌య‌వాడ‌): మ‌హ‌మ్మారి క‌రోనా లాక్‌డౌన్‌తో వ‌ల‌స‌కూలీల అవ‌స్థ‌లు వ‌ర్ణ‌ణాతీతంగా మారాయి. ఉన్న‌చోట ఉపాధి క‌రువై.. చేతిలో చిల్లిగ‌వ్వ‌లేక కాలిన‌డ‌క‌న‌ సొంతూరికి త‌ర‌లి వెళ్తున్న దృశ్యాలు త‌ర‌చూ క‌నిపిస్తున్నాయి. ఇలా ఇక్క‌ట్లు ప‌డుతున్న వ‌ల‌స‌కూలీల‌ను నిడ‌మానూరు రైతులు... ఎన్నారైల తోడ్పాటుతో సాయం చేస్తూ మాన‌వ‌త్వం చాటుకుంటున్నారు. నడుచుకుంటూ వెళ్తున్న వారికి రైతులు అన్నదానం చేస్తున్నారు. వ‌ల‌స‌కూలీల‌కు పట్టెడన్నం పెట్టి వారి పొట్ట నింపుతున్నారు. రైతులు చేస్తున్న ఈ అన్న‌దాన కార్య‌క్ర‌మానికి ఈ ప్రాంతం నుంచి వెళ్ళిన కొంతమంది ఎన్నారై పిల్లలు సాయం చేస్తున్నారు. ఇంకెవరయినా దాతలు ముందుకు వస్తే మరింత మందికి సాయం చేయ గలమని రైతులు అంటున్నారు. 


ఈ విషయం మిత్రుల ద్వారా తెలుసున్న పారిశ్రామికవేత్త రవి మాదల గారు రైతుల‌ను అభినందించారు.  ఈ సందర్భంలో ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని తమవంతు సాయంగా పీపీఈ సరంజామా పంపిస్తామని చెప్పారు. కాగా, రైతులు గత రెండు వారాలుగా నిరంతరంగా ఆహారము, నిత్యావసర వస్తువులు, చెప్పులు త‌దిత‌ర వ‌స్తువుల‌ను టీ నగర్, 100 కిమీ రోడ్డు, ఏలురు, పొట్టీపాడు టోల్ గేటుల వద్ద, నిడమానూరు బైపాస్, బెంజ్ సర్కిల్, రామవరప్పాడు రింగు రోడ్డు, మంగళగిరి బైపాస్ వద్ద ఉన్న వారికి అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నిడమానూరు రైతుబిడ్డలు సర్వశ్రీ శ్రీధర్ నాగళ్ళ, హేమంత్ నాగళ్ళ, కౌశల్ కృష్ణ కర్రి, మౌనిక చిన్నమనేని, నందిని నాగళ్ళ, లక్ష్మణ రావు ఈడుపుగంటి, సుబ్బారావు, విక్రం ఆదిలక్ష్మి, కాటమనేని సర్వేశ్వర వర ప్రసాదు, యశ్వంత్ వల్లూరు, శంకరరావు పరిమి త‌దిత‌రులు చేదోడు వాదోడుగా నిలిస్తున్నారు. 


మీరు ఏమి ఆశించి ఈ పని చేస్తున్నారు అని రైతుల‌ను అడిగితే... వారు చెప్పిన సమాధానం "వీళ్ళు ఎంతో దూరం నుంచి మన పనులు చేసి పెట్టడానికి ఇక్కడకు వచ్చారు. వారికి ఇంత కష్టం వచ్చినపుడు వారి పక్కన నిలచి పట్టెడన్నం కూడా పెట్టకుండా ఏ రైతుబిడ్డయినా ఎలా ఉండ గలడు? ఈ మాత్రం కూడా చెయ్యలేకపోతె ఇంక మానవత్వమన్నదానికి విలువేముంది." అని అంటున్నారు.

Updated Date - 2020-05-26T20:09:30+05:30 IST