పెద్దలకు మాత్రమే!

ABN , First Publish Date - 2020-09-07T08:55:28+05:30 IST

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో గ్రామీణ, మండల రహదారులు, బ్రిడ్జిల నిర్మాణంకోసం రూ.6,400 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు రూపొందించారు.

పెద్దలకు మాత్రమే!

  • ఎన్‌డీబీ పనుల్లో బిగ్‌ గేమ్‌
  • చిన్న, మధ్యస్థాయి కాంట్రాక్టర్లకు నో ఎంట్రీ
  • 500 కోట్లపైన పనులు చేసినవారికే చాన్సు
  • పెద్ద కాంట్రాక్టర్లలోనూ అయినవారికే!
  • దేశంలో ఎక్కడా లేని షరతులు, రూల్స్‌ 
  • తెరవెనుక శాసిస్తున్న సీమ నేత
  • టెండర్లు వేసినా ముందే తెలిసిపోతోంది
  • గతంలో తొలగించిన నిబంధన తెరపైకి!
  • ప్రైస్‌ బిడ్డింగ్‌కు ముందే హార్డ్‌ కాపీలు
  • రోడ్లు భవనాల శాఖ తాజా నిబంధనలు

రాష్ట్రంలో గ్రామీణ రహదారుల నిర్మాణం కోసం న్యూడెవలప్‌ మెంట్‌ బ్యాంకు (ఎన్‌డీబీ) ఆర్థిక సహకారంతో చేపట్టిన ప్రాజెక్టులపై ప్రభుత్వ పెద్దల కన్ను పడింది. అస్మదీయులైన బడా కాంట్రాక్టర్లకే ఆ పనులు కట్టబెట్టేందుకు తెరవెనుక చక్రం తిప్పుతున్నారు. చిన్న, మధ్య స్థాయి కాంట్రాక్టర్లు బరిలోకి దిగకుండా.. తమ వారికి ఎవరూ పోటీరాకుండా దేశంలో ఎక్కడా లేని షరతులు, నిబంధనలు విధిస్తున్నారు. తమ మాట వినకుండా గుట్టుగా ఎవరైనా టెండర్లలో పాల్గొన్నా వెంటనే వారెవరో తెలుసుకునేలా రూల్స్‌ మార్చేశారు. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో గ్రామీణ, మండల రహదారులు, బ్రిడ్జిల నిర్మాణంకోసం రూ.6,400 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు రూపొందించారు. ఇందులో న్యూడెవల్‌పమెంట్‌ బ్యాంకు ఆర్థిక సహాయం 70 శాతం, రాష్ట్ర ప్రభుత్వ వాటా 30 శాతం. జగన్‌ సర్కారు వచ్చాక ప్రాజెక్టు అమలు, టెండర్ల నిర్వహణకు విధివిధానాలు ఖరారు చేశారు. ఇటీవలే ఈ టెండర్‌ నిబంధనలను జ్యుడీషియల్‌ కమిషన్‌ కూడా ఆమోదించింది. ఆ వెంటనే రోడ్లు-భవనాల శాఖ (ఆర్‌అండ్‌ బీ) తొలి దశ కింద అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కలిపి రూ.880 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచింది. ఈ నెల 11నాటికి టెక్నికల్‌ బిడ్లు సమర్పించాలి. 13వ తేదీన రివర్స్‌ బిడ్డింగ్‌ జరుగుతుంది.


అయితే ఈ టెండర్లలో పెద్ద కాంట్రాక్టర్లు మాత్రమే పాల్గొనేలా.. చిన్న, మధ్య తరహా కాంట్రాక్టర్లకు అవకాశం దక్కకుండేలా ఆర్‌ అండ్‌ బీ నిబంధనలను రూపొందించడం గమనార్హం. రూ.100 కోట్లు, రూ.250 కోట్ల మేర పనులు చేసిన అనుభవం ఉన్నవారికీ మోకాలడ్డింది. కనీసం రూ.500 కోట్లు, ఆపైన పనులు చేసిన అనుభవం ఉన్న వారే టెండర్లలో పాల్గొనాల ని షరతు విధించింది. ఇంత పెద్ద కాంట్రాక్టర్లు, సంస్థలను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఏ పనిలోనైనా పోటీ ఎక్కువగా ఉంటేనే నాణ్యత ఉంటుంది. అయితే తాజా పనుల్లో పెద్ద కంపెనీల మఽధ్యే పో టీ ఉండనుంది. అయితే పెద్ద కాంట్రాక్టర్లకు టెండర్‌ దక్కాక.. అవసరమనుకుంటే.. ఇష్టమయితే సబ్‌ కాంట్రాక్టులు ఇచ్చుకోవచ్చన్న వెసులుబాటు కల్పించారు. రూ.లక్షల కోట్ల వ్యయంతో కేంద్రం నిర్మిస్తున్న హైవే పనుల్లోనూ ఇలాంటి ‘పెద్దల’ నిబంధనలు లేవన్న విమర్శలు రేగుతున్నాయి.


జిల్లాలో పనులన్నీ ఒక్కరికే!

ఒక జిల్లాలోని పనులన్నీ ఒకే కాంట్రాక్టరుకు ఇవ్వాలన్నది మరో కీలక నిర్ణయం. ఉదాహరణకు.. అనంతపురం జిల్లా మొత్తమ్మీద 100 కిలోమీటర్ల నిర్మాణం పనులుంటే అవన్నీ ఒక్కరికే ఇస్తారు. ఇందులోనూ మరో ట్విస్టు ఉంది. నిర్వహణలో లేని వి, కొత్తగా చేపట్టే, రిమోట్‌ ఏరియాల్లోని పనులన్నీ కలగలిపి ఒకే ప్యాకేజీగా రూపొందించారు. ఇవన్నీ ఒకే కాంట్రాక్టరుకు అప్పగించనున్నారు. ఒకే రూట్‌ లో ఉన్న రహదారులను నిర్మించాలంటేనే నిర్మాణ సంస్థలు అనేకసార్లు ఎక్సెటెన్షన్‌ ఆఫ్‌ టైమ్‌(ఈఏటీ )లు తీసుకుంటాయి. అలాంటిది ఒక్కరికే అప్పగిస్తే అవి ఎప్పటికి పూర్తవుతాయన్నది ప్రశ్న.


సెలెక్టివ్‌ బిగ్‌ గేమ్‌..

కీలకమైన ఈ ప్రాజెక్టు టెండర్లను నిర్వహించేది రోడ్లు-భవనాలశాఖే. అందరికీ బయటకు కనిపించే అంశం ఇది. టెండర్లకు ఉత్తర్వులు ఇవ్వడంతో దా ని పని ముగిసింది. కానీ కొందరికే  కనిపించే బిగ్‌ గేమ్‌ ఒకటి ఉంది. అది సెలెక్టివ్‌ సెటిల్‌మెంట్‌. గత ఎన్నికల్లో ముఖ్యనేత తరపున అభ్యర్ధులకు లెక్కలు సెటిల్‌ చేసిన రాయలసీమకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ఎన్‌డీబీ పనుల్లో చక్రం తిప్పుతున్నారు. టెం డర్లలో ఏయే కంపెనీలు పాల్గొనాలన్న అంశం నుంచి.. పోటీలో ఎవరుండాలో దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలిసింది. అనంతపురం, నెల్లూరు, కర్నూలు జిల్లాలకు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్లు ఈ టెండర్లలో పాల్గొనకూడదని ఇప్పటికే ఫోన్‌లో బెదిరించినట్లు సమాచారం. మాట ధిక్కరించి టెండర్లు వేస్తే గతాన్ని తవ్వుతామని.. తీవ్రంగా హెచ్చరించినట్లు తెలిసింది.


దీంతో ముగ్గురు కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నారు. పెద్ద కాం ట్రాక్టర్లలో కూడా అందరూ పాల్గొనకుండా, తాము ఎంపిక చేసిన వారే ఉండేలా ముందే ఆదేశించిన ట్లు తెలుస్తోంది. తమ మాటవిని టెండర్లకు దూ రంగా ఉంటే సరి. అలాకాకుండా గుట్టుచప్పుడు కా కుండా టెండర్లు వేస్తే వెంటనే తెలుసుకునే వెసులుబాటు కూడా ఉంది. టెండర్ల సందర్భంగా ఆర్‌అండ్‌బీ విధించిన రూల్‌ వల్ల ఇది సాధ్యమవుతోం ది. టెక్నికల్‌ బిడ్‌ సమర్పించాక ముగింపు తేదీ నా టికి టెండర్‌ దాఖలు చేసిన కాంట్రాక్టర్లు, సంస్థలు వ్యక్తిగతంగా ఆర్‌అండ్‌బీ ఆఫీసుకు వెళ్లి కీలకమై డాక్యుమెంట్ల హార్డ్‌ కాపీలను సంబంధిత అధికారికి ఇవ్వాలి. ప్రైస్‌ బిడ్‌ తెరవకముందే టెండర్లు ఎవరు వేశారో తెలుసుకోవడానికి ఈ నిబంధన ఉపకరిస్తోంది. గతంలో ఇదే నిబంధన హైవేలు, ఇతర టెండర్లలో ఉండేది. దీనివల్ల సమస్యలు తలెత్తడం తో ఆ రూల్‌ను తొలగించారు. ఆర్‌అండ్‌బీ మాత్రం దీనిని అందిపుచ్చుకుంది. ఈ నిబంధనతో తాము వద్దని వారించినా టెండర్లు వేసిన వారెవరో ప్రభు త్వ పెద్దలు తెలుసుకోవచ్చు. నిజానికి ప్రైస్‌ బిడ్‌ తెరిచే సమయంలో హార్డ్‌ కాపీలు తీసుకుంటే ఈ ప్రక్రియలో బెదిరింపులు, హెచ్చరికలకు అవకాశం తక్కువ. అయితే ఇప్పుడు ముందే వ్యక్తిగతంగా డాక్యుమెంట్లు ఇవ్వాలన్న నిబంధన.. అస్మదీయులకు కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు పెద్దలకు అవకాశం కల్పించింది.

Updated Date - 2020-09-07T08:55:28+05:30 IST