‘పంచాయితీ’లో రాజ్యాంగ న్యాయం

ABN , First Publish Date - 2021-01-27T06:52:07+05:30 IST

మెజారిటీ ఎంత అన్నది ముఖ్యం కాదు. పాలన ఎలా ఉన్నదన్నది ముఖ్యం. మెజారిటీ ప్రభుత్వం అయినా, సంకీర్ణ ప్రభుత్వం అయినా పాలన...

‘పంచాయితీ’లో రాజ్యాంగ న్యాయం

మెజారిటీ ఎంత అన్నది ముఖ్యం కాదు. పాలన ఎలా ఉన్నదన్నది ముఖ్యం. మెజారిటీ ప్రభుత్వం అయినా, సంకీర్ణ ప్రభుత్వం అయినా పాలన రాజ్యాంగబద్ధంగా సాగాలి. రాజ్యాంగానికి/రూల్ ఆఫ్ లాకి విరుద్ధంగా ప్రవర్తిస్తే కోర్టులు తప్పకుండా జోక్యం చేసుకొంటాయి. నిరంకుశ పాలకులను ఊహించే రాజ్యాంగ రూపకర్తలు వ్యవస్థలను ఏర్పాటు చేసి, వాటికి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించారు. అందుకే రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇచ్చి వ్యవస్థలన్నిటినీ తనకు విధేయంగా మార్చుకోవాలన్న వైసీపీ ప్రయత్నాలు ఇలా బెడిసికొడుతున్నాయి. 


‘నాకు 151మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నేను ఏం చేసినా చెల్లుతుంది’ అన్న అహంకారంతో పంతానికి పోయి సమస్యలు కొనితెచ్చుకొన్నది జగన్ ప్రభుత్వం. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ హైకోర్టు, సుప్రీంకోర్టులతో ఈ స్థాయిలో తలంటించుకొన్న పరిస్థితి లేదు. రాష్ట్రంలో శిశుపాలుడి లెక్కను దాటాయి జగన్ తప్పులు. ప్రమాణస్వీకారం రోజున దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా పేరుతెచ్చుకొంటానని బులిపించారు. కానీ కోర్టులతో చీవాట్లు తినడంలో మాత్రమే ప్రతిభ కనపడుతోంది. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల సమీక్ష అంశంతో మొదలైన చివాట్లు, నేడు స్థానిక సంస్థల నిర్వహణను అడ్డుకోవడం వరకు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా నవ్వి పొదురు నాకేమిటి సిగ్గు అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. న్యాయ వ్యవస్థ నేడు నిష్పక్షపాతంగా వ్యవహరించబట్టి సరిపోయింది, లేకుంటే రాజ్యాంగ విలువలను నేలమట్టం చేసేవారే!


స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా ఎన్నో సాకులు చూపి అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగులు చేసిన ప్రయత్నాన్ని  సర్వోన్నత న్యాయస్థానం అడ్డుకొని రాజ్యాంగ స్ఫూర్తికి పట్టం కట్టింది. న్యాయస్థానం తీర్పు స్థానిక సంస్థలకు జవజీవాలను కల్పించింది. స్థానిక ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ పలాయన వాదం ఫలించలేదు. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ లాంటి స్థానిక ఎన్నికలను ఎగవేద్దామని అనేక ఎత్తులు వేసింది వైసీపీ ప్రభుత్వం. రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఎన్నికల సమరం నుంచి తప్పించుకోవడానికి విశ్వప్రయత్నం చేసింది. ఒక రాజకీయ పక్షం ఎంత శక్తివంతమైనది అయినా కావచ్చు; కానీ రాజ్యాంగం కన్నా శక్తివంతమైనది కాదని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ద్వారా మరొకసారి ఋజువైంది. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు వల్లె వేసిన కుంటి సాకులు సహేతుకంగా లేవంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పాలక శ్రేణికి జ్ఞానభోధలాంటిది. 


ఏడాదిగా రాజ్యాంగ వ్యవస్థపై రాజకీయ యుద్ధం చేస్తూ వస్తోంది వైసీపీ ప్రభుత్వం. ఎన్నికల నిర్వహణను పెనుదుమారంగా  మార్చింది. గత ఏడాది మార్చిలో కరోనా తీవ్రత దృష్ట్యా ఎన్నికలను వాయిదా వెయ్యడంపై అక్కసు వెళ్లగక్కుతూ ఎన్నికల కమిషనర్‍నే అనుచితంగా సాగనంపే ప్రయత్నం చేసి భంగపడింది. ఇప్పుడు ఎన్నికల నిర్వహణకు పూనుకొంటే అడుగడుగునా అడ్డుపడుతూ న్యాయస్థానంతో తలంటించుకొని గౌరవాన్ని దిగజార్చుకున్నది. ప్రభుత్వ సంకుచిత రాజకీయాన్ని గ్రహించిన సర్వోన్నత న్యాయస్థానం ఎన్నికల కమిషనర్‌దే అంతిమ నిర్ణయం అనీ, రాజ్యాంగానికి లోబడే ఎన్నికల కమిషన్ నోటిపికేషన్ జారీ చేసినందున ఎన్నికలు నిర్వహించి తీరాలని తేల్చి చెప్పింది.


రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల నిర్వహణకై జారీ చేసిన షెడ్యూల్ని సమర్థిస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు, వైద్య సంఘాలు విడివిడిగా దాఖలు చేసిన పిటిషన్లు అన్నింటినీ సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేయడం అభినందనీయం. ఆ పిటిషన్లపై ఎక్కువగా విచారణ చెయ్యవలసింది ఏమీ లేదనీ, రాజ్యాంగబద్ధులైనవారు ఏం చెయ్యాలో న్యాయస్థానాలు చెప్పవలసిన అవసరం లేదనీ తీవ్రమైన వ్యాఖ్యలు చేయటమేగాక, ఉద్యోగులు విధులు నిర్వహించకుండా ఇలాంటి పిటిషన్లు దాఖలు చెయ్యడం ప్రమాదకరమని వ్యాఖ్యానించటం ఉద్యోగ సంఘాలకు చెంపపెట్టు లాంటిది. కరోనా టీకా సాకుతో ఎన్నికల్లో పాల్గొనడం సాధ్యం కాదని చెప్పినా వారి పప్పులు ఉడకలేదు. ఎన్నికల వాయిదాకు కరోనా టీకాలు కారణం కాదనీ, ప్రస్తుత పరిస్థితులు రెండు వ్యవస్థల మధ్య అహంకార యుద్ధానికి దారితీసినట్లు కనిపిస్తోందనీ, అందులో తాము భాగస్వాములు కాదలుచుకోలేదని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం అనుచితంగా వ్యవహరించిందని ఉద్యోగ సంఘాలు కమిష‍న్‌కి వ్యతిరేకంగా చేసిన తీర్మానాన్ని న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. రాష్ట్ర ఎన్నికల సంఘం పిలిచినా ఉద్యోగులు సమావేశానికి  హాజరుకాకపోవడం అరాచకమని వ్యాఖ్యానించింది.  


ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఒకే విధమైన అధికారాలుంటాయని గతంలోనే సుప్రీం కోర్టు వివరణాత్మకంగా స్పందించింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అన్న దానిపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వంతో మాట్లాడితే సరిపోతుందని, కానీ అనుమతి పొందాల్సిన అవసరంలేదని ఎన్నికల సంఘానికి విశేష అధికారాలను దఖలు పరిచింది రాజ్యాంగం. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ నిబంధనలకు లోబడి తగిన సవరణలను రాష్ట్ర శాసనసభ చేయగల వీలుందన్న 243-కె అధికరణ కింద ఎన్నికల నిర్వహణపై సమస్త అధికారాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికే కట్టబెట్టింది. దాన్ని కూడా తిరగ తోడేలా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అవసరం అని అసెంబ్లీలో తీర్మానం చేసి రాజ్యాంగ స్ఫూర్తికి, సంప్రదాయాలకు తూట్లు పొడిచారు. స్థానిక ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘానికి సహకరించేది లేదని అఖిల భారత సర్వీసు అధికారులు, ఉద్యోగ సంఘాలు ఒక తాటి మీదకు రావడం దారుణం. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా వ్యవహరించడం కనీవినీ ఎరుగనిది. ఏ వ్యక్తి, ఏ వ్యవస్థ, ఏ ప్రభుత్వం అయినా రాజ్యాంగానికి లోబడి నడుచుకోవాల్సిందే. కాదని కయ్యానికి కాలు దువ్వితే ఈ విధంగానే కోర్టుల చేత చివాట్లు తింటూ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.  


అఖిల భారత సర్వీసు అధికారులు సర్వీసులో చేరే ముందు రాజ్యాంగాన్ని, చట్టాలను కాపాడతామని ప్రమాణం చేస్తారు. కానీ నేడు వారే రాజ్యాంగ నిబంధనలను పాటించాల్సిన అవసరాన్ని గుర్తించకపోవడం బాధాకరం. ఏ ప్రభుత్వమూ శాశ్వతం కాదు. ప్రభుత్వాలు ఐదేళ్లకొకసారి మారుతుంటాయి. ఐఎఎస్ అధికారులు మాత్రం 60 ఏళ్ళ దాకా పదవుల్లో కొనసాగుతారు. వీరికి రాజ్యాంగ నిర్మాతలు కల్పించిన హక్కులు, అధికారాలు సామాన్యమైనవి కావు. కీలక సమయాల్లో విచక్షణాధికారాలతో నిర్ణయాలు తీసుకొనే వెసులుబాటును వీరికి రాజ్యాంగం కల్పించింది. కానీ చట్టానికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా బాధ్యత లేకుండా పనిచేస్తూ, వ్యక్తి గుర్తింపు కోసం, ప్రమోషన్లకోసం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు. ఎన్నికల సంఘం విధి నిర్వహణకు అధికార యంత్రాంగం సహకరించని పరిస్థితి దేశంలో ఎక్కడా లేదు. ఎన్నికల నిర్వహణకై ఎన్నికల సంఘానికి రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అధికారాలను ప్రభుత్వం, అధికారులు ధిక్కరించిన చరిత్ర దేశంలో మునుపు లేదు. న్యాయమూర్తులపై, ఎన్నికల సంఘంపై కులం పేరుతో విషం కక్కడం ముఖ్యమంత్రి స్థాయిలో ఎక్కడా జరగలేదు. రాజ్యాంగానికి లోబడి పనిచేస్తామని చేసిన ప్రమాణాన్ని ఉద్యోగులు, అధికారులు గుర్తు చేసుకోవాలి. రాజ్యాంగ, ప్రజాస్వామ్య, చట్ట వ్యతిరేక చర్యలను ప్రజలే ప్రశ్నిస్తారు. జగన్మోహన్ రెడ్డి ఫాసిస్టు పాలనకు ప్రజలే బుద్ధి చెబుతారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పూర్తి సహకారాన్ని అందించాలి. ప్రభుత్వం కూడా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో ఎన్నికల కమిషన్‌కు సంపూర్ణ సహకారాన్ని  అందించాలి. పోలీసు యంత్రాంగం, ఇతర సిబ్బంది ఎలాంటి వివక్షత లేకుండా తమ వంతు కృషి చెయ్యాలి. అందరూ అహం వీడి ఈ అనుభవాన్ని గుణపాఠంగా తీసుకోవాలి.

యనమల రామకృష్ణుడు 

మాజీ ఆర్థిక మంత్రి

Updated Date - 2021-01-27T06:52:07+05:30 IST