కానిస్టేబుల్‌ పరీక్ష 28కి వాయిదా

ABN , First Publish Date - 2022-08-09T20:06:59+05:30 IST

పోలీస్‌ శాఖలోని ఆయా విభాగాల్లో కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన ప్రాథమిక రాత పరీక్ష వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం

కానిస్టేబుల్‌ పరీక్ష 28కి వాయిదా

హైదరాబాద్‌,(ఆంధ్రజ్యోతి): పోలీస్‌ శాఖలోని ఆయా విభాగాల్లో కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన ప్రాథమిక రాత పరీక్ష వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 21న కానిస్టేబుల్‌ ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించాల్సి ఉండగా 28వ తేదీకి వాయిదా వేసినట్లు నియామక బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాస్‌ రావు తెలిపారు. 28 (ఆదివారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు ఈనెల 18 నుంచి నియామక బోర్డు వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వెల్లడించారు.


అంచనా తప్పితే ఇబ్బందులనే వాయిదా!

పోలీస్‌ శాఖలో కానిస్టేబుల్‌ సివిల్‌, ఏఆర్‌ తదితర విభాగాల్లో 16,321 పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 9,54064 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో నిర్వహించిన పరీక్షల అనుభవాల నేపథ్యంలో దరఖాస్తు చేసుకున్నవారంతా పరీక్ష రాయరనేది అధికారుల అంచనా. సుమారు 6.50 లక్షల నుంచి 7 లక్షల మంది అభ్యర్థులు ప్రాథమిక రాత పరీక్షకు హాజరవుతారని అధికారులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. ఈసారి పోలీస్‌ నియామకాల పరీక్షల్లో బయోమెట్రిక్‌ హాజరు అత్యంత కీలకం కావడంతో అధికారులు ఆ మేరకు యంత్రాల్ని సిద్ధం చేసుకున్నారు. అయితే పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చినందువల్ల అంచనాకు మించి అభ్యర్ధులు రాత పరీక్షకు హాజరైతే చివరి నిమిషంలో బయోమెట్రిక్‌ మెషిన్లలో ఏవైనా కొన్ని మొరాయిస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి వీలుగా రాత పరీక్షను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2022-08-09T20:06:59+05:30 IST