కేసీఆర్‌ వల్లే దళిత బంధుకు బ్రేక్‌

ABN , First Publish Date - 2021-10-19T08:57:58+05:30 IST

సీఎం కేసీఆర్‌ వైఫల్యం వల్లే దళిత బంధు పథకం నిలిపివేయాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలిచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టం చేశారు.

కేసీఆర్‌ వల్లే దళిత బంధుకు బ్రేక్‌

ఆ నెపం ఇతరులపై నెట్టే కుట్ర: సంజయ్‌

హైదరాబాద్‌/సిటీ/న్యూఢిల్లీ, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ వైఫల్యం వల్లే దళిత బంధు పథకం నిలిపివేయాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలిచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టం చేశారు. ఏదో విధంగా దళిత బంధు పథకాన్ని నిలిపివేయించి, ఇతరులపై నెపాన్ని నెట్టాలని కేసీఆర్‌ కుట్ర చేశారని ఆరోపించారు. దళితులను మరోసారి మోసం చేసినందుకు ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. దళిత బంధు డబ్బులను లబ్ధిదారుల అకౌంట్‌లో వేస్తూనే.. వాటిని డ్రా చేసుకోకుండా ఫ్రీజ్‌ చేయించారని అన్నారు. 


బ్యాంకులో పడిన నిధులను లబ్ధిదారులు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించాలంటూ జిల్లా రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌కు తాము వినతి పత్రం ఇచ్చామని సంజయ్‌ గుర్తు చేశారు. ఎన్నికల కమిషన్‌ నుండి ఆదేశాలు రాబోతున్నాయని ముందే తెలిసి, సోమవారం దళిత బంధుపై సమీక్ష నిర్వహించి, చిలుక పలుకులు పలికారని దుయ్యబట్టారు. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎ్‌సకు దళితులు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని అన్నారు. రాష్ట్రంలో కుల సంఘాలను చీల్చే కుట్ర జరుగుతోందని బండి సంజయ్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం కుల సంఘాల భవనాలు, అధికార పార్టీకి అడ్డాలుగా మారుతున్నాయని తెలిపారు. సోమవారం సిఖ్‌ విలేజ్‌లోని రాజరాజేశ్వరీ గార్డెన్స్‌లో మున్నూర్‌ కాపుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడారు. కొందరు కుల సంఘాల నేతలు ఆస్తులు కాపాడుకోవడానికి అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని అన్నారు.

Updated Date - 2021-10-19T08:57:58+05:30 IST