దేశ విచ్ఛిన్నానికి కుట్ర!

ABN , First Publish Date - 2022-08-18T08:39:02+05:30 IST

నీచమైన రాజకీయాల కోసం దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. కులం, మతం, వర్గం పేరుతో జరుగుతున్న ఈ కుట్ర పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు.

దేశ విచ్ఛిన్నానికి కుట్ర!

నీచ రాజకీయాల కోసం ఎంతకైనా తెగించేవారు ఉన్నారు


ప్రజలు అప్రమత్తంగా లేకుంటే గోసపడతారు

సమాజంలో విద్వేషం పెచ్చరిల్లితే కష్టం

దేశ పరిణామాలపై నిత్యం చర్చ జరగాలి

అంతాయిపల్లి సభలో కేసీఆర్‌ వ్యాఖ్యలు

మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టరేట్‌ ప్రారంభం

బీజేపీపై పరోక్ష విమర్శలు.. తగ్గిన దూకుడు!

ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించట్లేదంటూ

ప్రసంగం ప్రారంభించిన ముఖ్యమంత్రి!


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి)

నీచమైన రాజకీయాల కోసం దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. కులం, మతం, వర్గం పేరుతో జరుగుతున్న ఈ కుట్ర పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. సమాజంలో విద్వేషం పెచ్చరిల్లితే మళ్లీ ఏకం కావడం కష్టమని చెప్పారు. శామీర్‌పేట మండలం అంతాయిపల్లిలో నిర్మించిన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌ నూతన భవనాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కేసీఆర్‌ పరోక్షంగా బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. విచ్ఛిన్నకర శక్తులు, దుర్మార్గులు నీచ రాజకీయాల కోసం ఎంతకైనా తెగించే వాళ్లు ఎప్పుడూ ఉంటారని..


ప్రజలు అప్రమత్తంగా, తెలివిగా ఉండాలని పేర్కొన్నారు. ఏ మాత్రం పొరపాటు చేసినా గోస పడతామన్నారు. 60 ఏళ్ల కిందట తెలంగాణ నిద్రాణమై ఉండేదని, ఆ సమయంలో మనం పోరాడ లేదు కాబట్టి ఈ ప్రాంతాన్ని ఆంధ్రాలో కలిపారని చెప్పారు. 58 ఏళ్లు మడమ తిప్పని పోరాటం చేస్తే మళ్లీ మన రాష్ట్రం మనకు దక్కిందని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని అన్నారు. ‘‘ఈ రోజు ఆంధ్రాలో కలిసి ఉంటే కరెంట్‌ వచ్చేదా? ఈ సంక్షేమం వచ్చేదా? ఇన్ని పింఛన్లు వచ్చేవా? ఈ విధంగా మంచినీళ్లు వచ్చేవా? ఒకసారి ఆలోచించండి. దీన్ని పోగుట్టుకుందామా? మళ్లీ మోసపోతే గోసపడే ప్రమాదం ఉంది’’ అని హెచ్చరించారు. నిద్రాణమైన వ్యవస్థలో ప్రజలకు బాధలు తప్పవని.. చైతన్యవంతమైన సమాజం ఉంటేనే రాష్ట్రం పురోగమిస్తుందని చెప్పారు. 


దేశంలోని పరిణామాలపై చర్చ జరగాలి

దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. దేశవ్యాప్తంగా జరిగే పరిణామాలపై గ్రామాల్లో, బస్తీల్లో నిత్యంచర్చ జరగాలని.. టీవీలు, పేపర్లలో వార్తలు చూసి వదిలేయవద్దని చెప్పారు. నిజమేమిటో, అబద్ధమేమిటో తెలుసుకుంటే మన సమాజాన్ని కాపాడుకోగలుగుతామని అన్నారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారనే విషయం ఆ నిమిషానికి తమషాగా అనిపిస్తుందని, ఫలితాలు మాత్రం చాలా దుర్మార్గంగా ఉంటాయని తెలిపారు.  


విద్వేషం పెచ్చరిల్లితే కష్టం..

ఒక బంగ్లా కట్టాలంటే చాలా కష్టమని, అదే కూలగొట్టాలంటే పది రోజులు కూడా పట్టదని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఒక మార్పు జరగాలన్నా.. ఒక భవంతి నిర్మించాలన్నా చాలా ప్రయాస పడాల్సి ఉంటుందని చెప్పారు. ఎంతో మంది పెద్దలు, పోరాటయోధుల త్యాగాల ఫలితంగానే మనం ఈ స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు స్వార్థ రాజకీయాల కోసం దేశాన్ని మతం, కులం పేరుతో విడదీసే యత్నం జరుగుతోందని, సమాజంలో విద్వేషం పెచ్చరిల్లితేమళ్లీ ఐక్యం కావడం అంత సులభం కాదన్నారు. కులమతాలకతీతంగా భారతీయులందరూ ముందుకు సాగాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.


తెలంగాణ అద్భుతమైన రాష్ట్రం

గతంలో తెలంగాణ ప్రజలు పొట్టకూటి కోసం ముంబై, దుబాయికి వలస వెళ్లేవారని.. ఇప్పుడు రాష్ట్రంలో ఎవరూ ఆకలితో బాధపడే పరిస్థితి లేదని కేసీఆర్‌ అన్నారు. పరిపాలన ప్రజలకు ఎంత చేరువైతే అంత సౌలభ్యంగా పనులు జరుగుతాయని చెప్పారు. కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత తెలంగాణలో 11 వేలకు పైగా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. పింఛన్‌దారులందరికీ త్వరలోనే డిజిటల్‌ కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కరెంట్‌ పోదని.. దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం 24 గంటల పాటు కరెంట్‌, తాగునీరు ఉండదని చెప్పారు. ఢిల్లీలో రోజూ నీళ్లు కొనుక్కుంటారని, ప్రతి ఇంట్లో గొయ్యి తవ్వి నీళ్లు నింపుకుంటారని ఢిల్లీ వెళ్లిన తన మిత్రులు చెప్పారని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ ఏర్పడినపుడు తలసరి ఆదాయం రూ.లక్ష ఉండేదని.. ఇప్పుడు రూ.2.78 లక్షలుగా ఉందని, దేశంలోనే ఇది అత్యధికమని చెప్పారు. భారతదేశంలో అద్భుతమైన రాష్ట్రంగా తెలంగాణ ఉందని, అవినీతిరహిత పాలన వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. దేశంలోనే అత్యధిక వేతనం పొందుతున్న ఉద్యోగులు తెలంగాణ ఉద్యోగులేనని చెప్పారు. కాగా, సీఎం కార్యక్రమం సందర్భంగా పోలీసులు బీజేపీ, కాంగ్రెస్‌, సీపీఐ తదితర పార్టీల నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకుని సనత్‌నగర్‌ స్టేషన్‌కు తరలించారు.  


బీజేపీపై విమర్శల్లో తగ్గిన దూకుడు..

కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ తన ప్రసంగంలో దూకుడు తగ్గించారు. పంద్రాగస్టు వేడుకలతో పాటు మంగళవారం వికారాబాద్‌లో జరిగిన సభల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కేసీఆర్‌.. బుధవారం కాస్త స్పీడ్‌ తగ్గించారు. సభకు హాజరైన వారిలో జోష్‌ పెంచేందుకు ప్రతిపక్షాలపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించే ముఖ్యమంత్రి.. నేరుగా అంశాలపైనే మాట్లాడారు. బీజేపీపై పరోక్షంగానే విమర్శలు చేశారు. అంతకు ముందు ప్రధాని మోదీ వస్త్రధారణతో పాటు బీజేపీ నేతలపై నేరుగా విమర్శనాస్త్రాలు సంధించిన సీఎం.. బుధవారం తాను ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించడం లేదని చెబుతూ ప్రసంగం ప్రారంభించారు. ఇక్కడ జనసమీకరణ కూడా అంతంతగానే ఉండడంతో సీఎం ప్రసంగంలో వాడి తగ్గిందా? అనే చర్చ జరిగింది. 

Updated Date - 2022-08-18T08:39:02+05:30 IST