Abn logo
Jul 21 2021 @ 00:00AM

అంతరిక్షాన్ని జయించింది!

రెప్పలు మూసి తెరిచేలోగా..అమెరికాలో ‘న్యూ షెపర్డ్‌’ వ్యోమగామి నౌక ఆకాశంలోకి దూసుకెళ్లింది.నిమిషాలు క్షణాలయినంత వేగంగా అంతరిక్షంలోంచి తిరిగి ప్యారాచూట్స్‌ సాయంతో భూమిని ముద్దాడింది.  వ్యోమనౌక కిందికి దిగుతూనే.. ప్రపంచమంతా ఉద్విగ్నంగా ఎదురుచూస్తోంది.ఇద్దరు అంతరిక్ష యాత్రికులు దిగాక.. ఓ తెల్లజుట్టు మనిషి మునుపటి వారికంటే రెట్టింపు ఉత్సాహంతో చేతులు చాచి విజయబావుటాను ఎగరేసింది. ఆమెను చూసి ప్రపంచమంతా షాక్‌. ఎందుకంటే ఆమె వయసు 82 ఏళ్లు.. అరవై ఏళ్ల నాటి వ్యాలీ ఫంక్‌ ‘కల’నిజమైన క్షణాలవి...


‘‘1961 సంవత్సరం.. 

మెర్క్యురీ 13 ప్రాజెక్టులో భాగంగా కఠినమైన పరీక్షలు చేసి ఆస్ర్టోనాట్‌లను ఎంపిక చేయాలనుకున్నారు డాక్టర్‌ లోవ్‌లేస్‌. ఆయనే ఆ ప్రాజెక్టును డిజైన్‌ చేశారు. అందులో 24 ఏళ్ల మహిళలూ టీమ్‌లో ఉండాలనుకున్నారాయన. కొన్ని పరీక్షలు చేశారు. మా అందరినీ అతి చల్లని ఐస్‌వాటర్‌ సౌండ్‌ ప్రూఫ్‌ ట్యాంక్‌లో ఉండమన్నారు. అది ఓ పరీక్ష. చిమ్మచీకటిలో ఒంటరిగా అలా పడుకుండి పోయా. ఎలాగైనా స్పేస్‌లోకి వెళ్లాలనే పిచ్చినాది. ఆకాశమంత ప్రేమతో ఆ రోజు ఆ పాతాళంలోని నీళ్లలో పదిగంటలపాటు పడుకున్నా. అలాంటి కఠినమైన చాలా పరీక్షల్లో మగవాళ్లతో పోటీ పడి విజయం సాధించా.


మీకో విషయం తెలుసా.. 

ఆ తర్వాత మూడేళ్లకు.. అమెజాన్‌ అధినేత, ‘న్యూ షెపర్డ్‌’ వ్యోమనౌక నాయకుడు జెఫ్‌ బెజోస్‌ పుట్టాడు. ఇపుడు నేను ఆ వ్యోమనౌకలోనే వెళ్లొచ్చా. ఇంతకంటే గొప్ప అనుభూతి లేదు. ఈ జీవితం నాకు చాలు. చాలా ఇచ్చింది. పిల్లవాడైన జెఫ్‌ బెజోస్‌కు కృతజ్ఞతలు చెప్పటం అనేది చిన్నమాట.

తొమ్మిదేళ్లకే విమానం గురించి.. 

అమెరికాలోని లాస్‌వెగాస్‌లో పుట్టి, న్యూమెక్సికోలో పెరిగాను. మా తల్లిదండ్రులు మెడికల్‌ షాప్‌ నడిపేవాళ్లు. ఏడాది వయసులో ఏ విమానం మా ఇంటిమీద వెళ్తున్నా.. ఆ సౌండ్‌కే తల ఎత్తి పైకి చూసేదాన్నట. ‘విమానంలో వెళ్లాలనుకుంటున్నావా’ అని మా అమ్మానాన్నలు అనేవారట. ఆ విషయం మా అమ్మ చెప్పింది. విమానం గురించి నా తొలిపాఠం తొమ్మిదేళ్ల వయసులో తెలుసుకున్నా. గాల్లోకి ఎగిరిపోవాలనిపించేది. పక్షిలా మనమెందుకు ఎగరలేమని బాధపడేదాన్ని. ఆకాశంలో అంతెత్తున ఎగరాలంటే ఏం చేయాలని ఆలోచించేదాన్ని. మా అమ్మానాన్నతో చెప్పేదాన్ని. నా చదువు సరిగా సాగలేదు. డ్రాపవుట్‌ అయ్యా. స్టీఫెన్స్‌ కాలేజీలో ఏవియేషన్‌ ప్రోగ్రామ్‌కి వెళ్లా. అది నా ఆలోచనల్ని మార్చింది. నా కలంతా నింగిలోకి దూసుకుపోవాలనే ఉండేది.


ఆస్ర్టోనాట్‌ కావాలని...

అండర్‌ వాటర్‌ పరీక్షలో పాల్గొన్నానని అందరూ ఇప్పుడు గొప్పగా చెబుతుంటారు. అది నాకు గొప్పే కాదు. నా శరీరం రేడియేషన్‌కు తట్టుకుంటుందా అని పరీక్షించారు. ఇందులో భాగంగా నా గొంతులోంచి కొన్ని ఆర్గాన్లకు ట్యూబ్స్‌ పెట్టారు. అంతెందుకు ఐసోలేషన్‌ ట్యాంక్‌లో ఉన్నపుడు నీళ్లలో ఉన్నానని ఫీల్‌ కాలేదు. చల్లనీ నీరు కాదు.. నా శరీర ఉష్ణోగ్రతకు సమానమే అనుకున్నా. మెడకి ఫోమ్‌ రబ్బర్‌ను తగిలించి  వెనక్కి వేశారు. నేను గద్ద ఆకారంలో పడుకుండిపోయా. 10 గంటల 35 నిమిషాలపాటు ఎలా ఉన్నానో నాకు తెలీదు. నన్ను ఎవరు బయటకు తీశారో తెలీదు. ఆ రోజు ఆ ట్యాంక్‌లోంచి బయటికి తీశాక.. ఇంటికి వెళ్లిపోతానన్నాను. ఆ కఠిన పరీక్షలో రికార్డులు సాధించిన అమ్మాయిలనే కాదు అబ్బాయిల రికార్డులను బ్రేక్‌ చేశానని నాకు తెలిసిపోయింది ఆ రోజు. ఆస్ర్టోనాట్‌ కావాలనే నా ఉక్కు సంకల్పం ముందు అన్నీ చిన్నగా అనిపించాయి. నా శరీరం, మెదడు అందుకు అనుగుణంగా మారిపోయిందనిపించింది. గ్యాస్‌మాస్క్‌ల్లాంటి పరీక్షలను సులువుగా అధిగమించా. 


మగ రాజకీయాలతోనే వెళ్లలేకపోయా..

ఇంజనీరింగ్‌ డిగ్రీలేదు. పదహారేళ్లకే పైలెట్‌ లైసెన్స్‌ సంపాదించా. మెర్క్యురీ 13 ప్రాజెక్టుకి ఎంపికయ్యా. కేవలం అమ్మాయి అనే ఉద్దేశంతో నన్ను నాసా తిరస్కరించింది. మగవాళ్లకంటే ఆడవాళ్లు తక్కువే అని చెప్పకుండా.. స్పేస్‌లో ఆడవాళ్లు ఉండలేరు. ఆడవాళ్ల రుతుక్రమం సమస్య అంటూ ఏవో కబుర్లు చెప్పారు. అన్ని పరీక్షల్లో నెగ్గినా కేవలం మగరాజకీయాలతో వెళ్లలేకపోయా. వైస్‌ ప్రెసిడెంట్‌ జాన్సన్‌ ‘స్టాప్‌ దిస్‌ నౌ’ అని చెప్పడం విని.. నమ్మలేకపోయా. అంతెందుకు రెండు, మూడుసార్లు నాసాలో దరఖాస్తు చేసినా.. ఇంజనీరింగ్‌ డిగ్రీ లేదని చెప్పారు. ఆ తర్వాత వయసును బూచిగా చూపారు. నా రష్యన్‌ మిత్రురాలు వాలెంతినా తెరష్కోవా సోవియట్‌ యూనియన్‌ తరఫున 1963 లో స్పేస్‌లోకి వెళ్లిన క్షణాలు గుర్తున్నాయి. నేను వెళ్లలేకపోయాననే బాధకంటే.. ఓ మహిళ వెళ్లిందని ఆనందించా. 


19వేల గంటలు..

ఈ అరవై ఏళ్లలో నేను 19 వేల ఫ్లయింగ్‌ హవర్స్‌ పూర్తిచేశా. ఒక్కమాటలో ఏవిషయేషన్‌లో ఎంతో సాధించా. ఆరిజోనాలో ఎయిర్‌లైన్‌ కెప్టెన్‌గా ఉన్నా. మూడు వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చా. వారికి లైసెన్స్‌ ఇచ్చి గాల్లోకి తీసుకెళ్లా. శిక్షణ ఇచ్చే విమానానికి కెప్టెన్‌, ఫస్ట్‌ ఆఫీసర్‌ నేనే. విద్యార్థులకు ఎలా ఎగరాలో నేర్పించడమే నా పని. ఆ పనిని ఎంజాయ్‌ చేస్తా. బోధించడాన్ని ఇష్టపడతా. ఎస్‌టీఈమ్‌(స్టెమ్‌) బోధించడం ఇష్టం. ఎస్‌- సైన్స్‌, టి-టెక్నాలజీ, ఇ-ఇంజనీరింగ్‌, ఎమ్‌- మేథమేటిక్స్‌. పన్నెండేళ్ల పిల్లలనుంచి పెద్దవాళ్ల వరకూ పాఠాలు చెబుతుంటా. పాఠశాలల్లో, కాలేజీల్లో చదివే పిల్లలకు కొత్త జ్ఞానం ఇవ్వాలనే తాపాత్రయం. వాళ్లింటో వాళ్ల పేరెంట్స్‌ ఇచ్చిన నాలెడ్జి కంటే గొప్పగా ఇవ్వాలనేది నా ఆరాటం. 

ప్రత్యామ్నాయం చూసుకోవాలి.. 

నేను సహనం ఉండే ప్రయాణికురాలిని. మొన్న 71 ఏళ్ల విర్జిన్‌ గెలాస్టిక్‌ అధినేత రిచర్డ్‌ బ్రాన్సన్‌ కూడా ‘ఆడవాళ్లు స్పేస్‌లోకా?’ అని వ్యంగ్యంగా మాట్లాడినవారే. నేను 2000 సంవత్సరంలో రెండు లక్షల డాలర్లు పెట్టి టిక్కెట్‌ కొన్నా. బోధనతో పాటు నేను రాసిన పుస్తకాల రాయల్టీతో అది కొన్నా.  చిన్నవాడైన జెఫ్‌ బెజోస్‌ ద్వారా నేను అంతరిక్షంలోకి ఎగరగలిగా. నాతో పాటు అతి పిన్నవయస్కుడు ఆలివర్‌ డేమన్‌ (18 ఏళ్లు) వచ్చాడు. ఇప్పుడు నా వయసు 82 ఏళ్లు. అరవై ఏళ్ల నిరీక్షణలో ‘మన లక్ష్యం నెరవేరడానికి కుదరకుంటే.. ప్రత్యామ్నాయం వెతుక్కోవాలి’ అనే విషయం తెలుసుకున్నా. ఎటూ నాసా వారు పంపించరు కాబట్టి.. ప్రైవేట్‌ వ్యోమనౌక ‘న్యూ షెపర్డ్‌’ లో ప్రయాణం చేసి వచ్చేశా. 10 నిమిషాల పాటు సాగిన అంతరిక్ష ప్రయాణం నా జీవితంలో అద్భుతఘట్టం.’’