షర్మిల పార్టీలోకి కాంగ్రెస్ సీనియర్ నేత!

ABN , First Publish Date - 2021-03-03T21:29:06+05:30 IST

వైఎస్ షర్మిల పార్టీని స్థాపించేందుకు పూర్తిస్థాయిలో కసరత్తు ప్రారంభించారు. ఓ వైపు పార్టీ నిర్మాణం కోసం సమాలోచనలు చేస్తూనే...

షర్మిల పార్టీలోకి కాంగ్రెస్ సీనియర్ నేత!

హైదరాబాద్: వైఎస్ షర్మిల పార్టీని స్థాపించేందుకు పూర్తిస్థాయిలో కసరత్తు ప్రారంభించారు. ఓ వైపు పార్టీ నిర్మాణం కోసం సమాలోచనలు చేస్తూనే... మరోవైపు రాష్ట్రంలోని ప్రధాన పార్టీల్లో ఉన్న అసంతృప్తి నేతలకు గాలాలు వేస్తున్నారు. పార్టీ నాయకులతో పాటు కులసంఘాలు, యువజన, విద్యార్థి సంఘాల నేతలను కలుస్తూ వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. సినీ గ్లామర్, బుల్లితెర యాంకర్లు షర్మిలను కలిసేందుకు ఉత్సాహపడుతున్నారు. ఇప్పటికే నల్లగొండ, హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల సమావేశాలు నిర్వహించారు. మహబూబ్‌నగర్‌ పోగా మిగిలిన ఆరు జిల్లాల ఆత్మీయ సమావేశాలు ఏప్రిల్‌ 10లోపునే పూర్తి కానున్నాయి. చివరి ఆత్మీయ సమావేశం ఏప్రిల్‌ 9న ఖమ్మంలో జరగనుంది. ఈ నెల 1న లోట్‌సపాండ్‌లో పలు కుల సంఘాల నేతలు, ముస్లిం మైనార్టీలు షర్మిలను కలిసి మద్దతు తెలిపారు.


ఈ నేపథ్యంలోనే లోటస్‌పాండ్‌లో షర్మిలను కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్‌ కలిశారు. షర్మిల పార్టీకి అధికార ప్రతినిధిగా ఇందిరా శోభన్‌ వ్యవహరించనున్నారు. ఈ రోజు ఉదయమే ఆమె కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఆ రాజీనామా లేఖలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులను ఎత్తిచూపారు. రెండు రోజుల క్రితమే షర్మిల అనుచరులతో ఇందిరా శోభన్ సమావేశం అయ్యారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే రెండు రోజుల్లో షర్మిల పెట్టబోయే పార్టీలోకి చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


తన పట్ల కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరును ఇందిరా ఆక్షేపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీపై ఉన్న అభిమానంతో కాంగ్రెస్ పార్టీలో కొనసాగానని చెప్పారు. తెలంగాణ బిడ్డగా కాంగ్రెస్‌కు అండగా నిలిచేందుకు పార్టీలో చేరానని తెలిపారు. కాంగ్రెస్‌లో ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీ కోసం పనిచేశానని రాజీనామా లేఖలో తెలిపారు. కొన్ని రోజులుగా పార్టీలోని సీనియర్ నేతలు వ్యవహరిస్తున్న తీరు తనను కలిసివేసిందని చెప్పారు. పార్టీ వైఖరికి నిరసనగా రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నానని ఇందిరా శోభన్ పేర్కొన్నారు. పార్టీలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని లేఖలో ఇందిరా శోభన్ తప్పుబట్టారు.

Updated Date - 2021-03-03T21:29:06+05:30 IST