తెలంగాణ ప్రభుత్వం కళ్లున్న కబోది: శ్రీధర్ బాబు

ABN , First Publish Date - 2020-08-12T04:02:26+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం కళ్లున్న కబోదిగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు విమర్శించారు. పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యం కోసమే తాము రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని

తెలంగాణ ప్రభుత్వం కళ్లున్న కబోది: శ్రీధర్ బాబు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కళ్లున్న కబోదిగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు విమర్శించారు. పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యం కోసమే తాము రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసుకువచ్చామని ఆయన గుర్తుచేశారు. ఆ పేరు ఇష్టం లేకుండా మరో పెరుతోనైనా కరోనా చికిత్స కోసం ఒక పథకాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కోవిడ్‌కు ఉచితంగా చికిత్స అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అయితే ప్రభుత్వం తన బాధ్యతలను విస్మరిస్తోందని దుయ్యబట్టారు. శుక్రవారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహరశైలిని తూర్పారబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఐసోలేషన్, క్వారంటైన్ సెంటర్లు లేవని అన్నారు. జిల్లాల్లో ఆక్సిజన్ కూడా అందుబాటులో లేదని పేర్కొన్నారు. కోవిడ్ మరణాల విషయంలో కేంద్రం కితాబిచ్చిందా? అని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ప్రజల్లో ధైర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. ఎన్ని కోట్లయినా ఖర్చు పెడతామని సీఎం కేసీఆర్ మాటలను ఆచరణలో పెట్టాలని కోరారు. పట్టణ పేదలకు ఉపాధి కల్పించే పథకాన్ని తేవాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. 


అసెంబ్లీ మీడియా పాయింట్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాత్రమే ప్రెస్ మీట్ పెట్టాలని కార్యదర్శి సర్క్యూలర్ జారీ చేశారని గుర్తుచేసిన శ్రీధర్ బాబు.. అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు ఎలా అవకాశం ఇచ్చారని ప్రశ్నించారు. అదే తమ పార్టీకి చెందిన ఎంపీ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడానికి అసెంబ్లీ కార్యదర్శి ఎందుకు ఒప్పుకోలేదని ఆయన నిలదీశారు. రూల్స్ ఎవరికైనా ఒక్కటేనని అన్నారు. అలాగైతే తమ పార్టీ మాజీ ఎమ్మెల్యేలకు కూడా అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో చిల్లర రాజకీయాలకు అవకాశం ఇవ్వొద్దని శ్రీధర్ బాబు హితవుచెప్పారు.

Updated Date - 2020-08-12T04:02:26+05:30 IST