రైతులకు పరిహారం ప్రకటించండి

ABN , First Publish Date - 2020-10-21T09:41:20+05:30 IST

భారీ వర్షాలు, వరదలతో పంట నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, దీనిపైన వెంటనే సమీక్ష నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ను కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు.

రైతులకు పరిహారం ప్రకటించండి

పంటల నష్టంపై వెంటనే సమీక్షించండి..

వరదలకు అంతా కొట్టుకుపోతే ధరణి చుట్టూ తిరుగుతారా? 

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధ్వజం 


హైదరాబాద్‌, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలు, వరదలతో పంట నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, దీనిపైన వెంటనే సమీక్ష నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ను కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలన్నారు. ఒకవైపున వరదలొచ్చి రాష్ట్రం కొట్టుకుపోతుంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దరణి చుట్టూ తిరుగుతున్నారన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మంగళవారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు.  రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? సీఎం, సీఎ్‌సలు ఉన్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాల కారణంగా జీహెచ్‌ఎంసీ, ఇతర మునిసిపాలిటీల్లో ఉన్న బస్తీల్లోని ప్రజలకు నీళ్లు ఎత్తిపోసుకోవడమే సరిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘గ్రామాల్లో చేతి దాకా వచ్చిన పంటను రైతులు నష్టపోయారు. పత్తి పంటను సీఎం కేసీఆర్‌ వేయమంటేనే రైతులు వేశారు. ఒక్కో కౌలు రైతు ఐదెకరాల పత్తికి కనీసంగా రూ. లక్ష పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు ఆ పెట్టుబడినీ, పంటనూ నష్టపోయాడు. ఈ వర్షాలతో కౌలు రైతుల జీవితం నాశనమయ్యే పరిస్థితి ఉంది. పట్టా భూమి ఉన్న రైతు పరిస్థితీ ఇదే. వీరిని ఆదుకునే విషయంపై సీఎం కేసీఆర్‌ నుంచి ఇంతవరకు ప్రకటన రాలేదు’’ అన్నారు. పంటకు నష్టం వాటిల్లి రైతులు ఇబ్బంది పడుతుంటే.. దానిపై ఇంతవరకు సమీక్ష జరపని సీఎస్‌.. ధరణి పైన మాత్రం 31 జిల్లాల కలెక్టర్లతో పది గంటల పాటు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష జరిపారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకోవడం అవసరమా? లేక ప్రజల ఆస్తులు ఎంత మేరకు ఉన్నయో తెలుసుకోవడం అవసరమా? అని ప్రశ్నించారు. గతంలో ఎవరి ఇల్లు కూలినా కట్టిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్‌.. ఇప్పుడు రూ. లక్ష ఇస్తానని ప్రకటించారన్నారు. రైతులకు ప్రకటించిన రూ. లక్ష రుణమాఫీకే ఇంతవరకు దిక్కులేదని, ఇక ఈ రూ. లక్ష వస్తయా రావా? అని ప్రశ్నించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, కానీ మొక్కుబడి ప్రకటనలకే పరిమితమవుతోందన్నారు.


సీఎం కేసీఆర్‌ బ్రేకింగ్‌ ప్రకటనలకు, సీఎస్‌ ధరణికి పరిమితమయ్యారని విమర్శించారు. ‘‘జీహెచ్‌ఎంసీకి రూ. 550 కోట్ల సాయం ప్రకటించారు. ఇవి సరిపోతయా? తెలంగాణలో హైదరాబాద్‌ మాత్రమే ఉందా? రైతులు లేరా? మిగిలిన 31 జిల్లాల్లో మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పరిస్థితి ఏంటి? జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వ్యతిరేకత రాకుండా మొక్కుబడిగా రూ. 550 కోట్లు విడుదల చేసినట్లున్నరు. చెరుకులో రసాన్ని సీఎం, మంత్రులు, సీఎస్‌ తాగేసి పిప్పిని మాత్రం ప్రజలకు వదిలేస్తున్నరు’’ అంటూ ధ్వజమెత్తారు. ఒక వైపు రైతులు ఇబ్బందుల్లో ఉంటే.. కలెక్టర్లు, కమిషనర్‌లు, ఎమ్మార్వోలు బొందలగడ్డల కాంపౌండ్‌ వాల్‌లపైన సమీక్షలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులు నష్టపోయి ఉంటే.. గ్రామాలు తిరిగి పరిస్థితిని సమీక్షించాల్సిన ఆర్థిక మంత్రి హరీశ్‌రావు... దుబ్బాక ఎన్నికల్లో బిజీ అయిపోయారన్నారు. మంత్రులపైన ప్రజలు కోపంగా ఉన్నారన్నారు. హైదరాబాద్‌కే రూ.10 వేల కోట్లు కావల్సి ఉంటుందన్నారు. మునిసిపాలిటీలు, గ్రామాలూ కలుపుకొంటే రూ. లక్ష కోట్ల వరకు ఉంటుందన్నారు.

Updated Date - 2020-10-21T09:41:20+05:30 IST