బీజేపీలో కాంగ్రెస్‌ విలీనం ఖాయం

ABN , First Publish Date - 2021-12-28T07:19:15+05:30 IST

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్‌, బీజేపీ అడ్డంకిగా

బీజేపీలో కాంగ్రెస్‌ విలీనం ఖాయం

  • రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో పోరాడాలి
  • ఉద్యోగాల ప్రణాళికలు సాగుతుంటే దీక్షలెందుకు?
  • మోదీకే కాదు.. ఎవరికీ భయపడం: నిరంజన్‌రెడ్డి
  •  కాంగ్రె్‌సను అమ్మకానికి పెట్టిన రేవంత్‌: వంటేరు


హైదరాబాద్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్‌, బీజేపీ అడ్డంకిగా మారాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. ఆ రెండు పార్టీలు కేంద్రంలో కత్తులు దూసుకుంటూ రాష్ట్రంలో ప్రేమ బాణాలు వేసుకుంటున్నాయని, కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని అన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కాంగ్రెస్‌ పార్టీ త్వరలోనే బీజేపీలో విలీనం కావడం ఖాయంగా కనిపిస్తోందన్నారు.


తెలంగాణ రైతులకు దేశంలో గౌరవం పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని, కేంద్రం సహకరించకున్నా.. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి వ్యవసాయాన్ని అగ్రభాగాన నిలిపారని తెలిపారు. నారు పోయని, నీరు పోయని కాంగ్రెస్‌, బీజేపీ మాత్రం రైతాంగాన్ని తప్పుదోవ పట్టించే ఆలోచన చేస్తున్నాయని విమర్శించారు. రైతు బంధు, ఉచిత కరెంటు, రైతుబీమా పథకాలకు, సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. ధాన్యం కొనబోమని కేంద్రం చెప్పడంవల్లే తప్పనిసరై రాష్ట్రంలోని రైతాంగానికి వరి సాగు చేయొద్దని చెప్పాల్సి వచ్చిందని వివరించారు. రాష్ట్ర ముఖ్యమత్రినే ఏకవచనంతో సంబోధిస్తూ.. రేవంత్‌రెడ్డి దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే.. ఆ రెండు జాతీయ పార్టీల నాయకులు ఢిల్లీలో పోరాడాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ ఎంపీల పోరాటానికి పీసీసీ అధ్యక్షుడు ఎందుకు కలిసిరాలేదని, రాహుల్‌, సోనియా ఎందుకు కేంద్రాన్ని నిలదీయలేదని ప్రశ్నించారు. 



దమ్ముంటే కేంద్ర ఉద్యోగాలను భర్తీ చేయించండి..

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 40,04,941 ఉద్యోగాలకుగాను 31,32,698 మందే ఉన్నారని, బండి సంజయ్‌కి, కిషన్‌రెడ్డికి దమ్ముంటే కేంద్రంతో పోరాడి ఖాళీగా ఉన్న 8,72,243 పోస్టులను భర్తీ చేయించాలని నిరంజన్‌రెడ్డి సూచించారు. ఉద్యోగుల జోనల్‌ వ్యవస్థ క్రమబద్ధీకరణ అనంతరం త్వరలోనే ఖాళీలను గుర్తించి భర్తీ చేసేందుకు తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలిపారు. తాము ప్రణాళికలు రూపొందిస్తున్న సమయంలో బండి సంజయ్‌ నిరుద్యోగ దీక్ష చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఎలాగూ జరిగే ప్రక్రియకు దీక్షలెందుకని ప్రశ్నించారు.


తామేమీ బొగ్గు గనులు అమ్మలేదని, అదానీ, అంబానీలకు ఆస్తులు కూడబెట్టలేదని, దేశ సంపదను కొల్లగొట్టలేదని అన్నారు. తమ నాయకుడు ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. తాము మోదీకి కాదు కదా.. ఎవరికీ భయపడబోమని స్పష్టం చేశారు.


అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఎర్రవెల్లిని దేశంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారని, అక్కడ ఎంత అభివృద్ధి చేశారో రేవంత్‌రెడ్డి చూస్తానంటే తానే తిప్పి చూపిస్తానని అన్నారు. మీడియాలో ప్రచారం కోసమే పీసీసీ అధ్యక్షుడు రచ్చ చేస్తున్నారని, గొప్పవాళ్లు కూర్చున్న పీసీసీ పీఠంపై సంస్కారంలేని వ్యక్తిని కూర్చోబెట్టారని విమర్శించారు. రేవంత్‌ కమర్షియల్‌ బిడ్డ అని, ఇంతకుముందు టీడీపీని కాంగ్రె్‌సకు అమ్ముకున్నారని, ఇప్పుడు కాంగ్రె్‌సను బీజేపీకి అమ్ముకునే ప్రయత్నంలో ఉన్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, శాట్స్‌ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.



బీజేపీ భరతం పట్టాలి: బాల్క సుమన్‌

రాష్ట్రంలో బీజేపీ అరాచకాలపై యువత మౌనం వీడాలని, ఆ పార్టీ నాయకులు ఏ వేదిక వద్ద కనబడ్డా నిలదీయాలని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ పిలుపునిచ్చారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఒక్కరోజు కూడా లేని వ్యక్తులు ఉద్యోగాల పేరుమీద దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న బీజేపీ ఏడేళ్లలో ఎన్ని ఉద్యోగాలిచ్చిందో, అందులో తెలంగాణకు ఎన్ని వచ్చాయో బండి సంజయ్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇందూరు రైతులను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర యువత, ప్రజలు బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, నోముల భగత్‌, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గజ్జెల నగేశ్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-28T07:19:15+05:30 IST