సీజేఐ రమణకు అభినందనల వెల్లువ

ABN , First Publish Date - 2021-06-18T09:24:46+05:30 IST

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణను గురువారం కూడా పలువురు ప్రముఖులు కలిశారు.

సీజేఐ రమణకు అభినందనల వెల్లువ

  • సీజేఐను కలిసిన నారాయణ, చాడ
  • పార్టీ ఫిరాయింపు’లపై స్పందించాలని విజ్ఞప్తి
  • మల్లారెడ్డి, ఒవైసీ, తుమ్మల శుభాకాంక్షలు
  • జగ్గారెడ్డి యోగక్షేమాలు అడిగిన జస్టిస్‌ రమణ


హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణను గురువారం కూడా పలువురు ప్రముఖులు కలిశారు. రాజ్‌భవన్‌లో ఉన్న ఆయన్ను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి  మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. తెలంగాణ హైకోర్టు జడ్జిల సంఖ్యను పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపు కేసులు, రాజ్యాంగ ఉల్లంఘనల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. న్యాయవ్యవస్థలోని లోపాలకు తానూ బాఽధితుడిగా మిగిలానని నారాయణ చెప్పారు. సాంకేతిక లోపాల కారణంగా తన పాస్‌పోర్టును తిరస్కరించడంతో అమెరికాలోని తన కుమార్తె దగ్గరకు వెళ్లలేక పోయానన్నారు. ఆర్థిక నేరగాళ్లకు పాస్‌పోర్టులు సులభంగా దక్కుతున్నాయి కానీ, తనలాంటి వారికి మాత్రం ఆటంకాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. మంత్రి మల్లారెడ్డి, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌లు జస్టిస్‌ రమణను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రగతి రిసార్ట్స్‌ చైర్మన్‌ జీబీకే రావు, వైజాగ్‌ పీడీజే హరిహరనాథ శర్మ, ప్రొఫెసర్‌ పురుషోత్తంరెడ్డి, లీలా లక్ష్మారెడ్డి, లక్ష్మణ్‌రెడ్డి, దిలీ్‌పరెడ్డి, రాష్ట్ర క్రీడాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి సీజేఐని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర క్రీడాకారులు ఎంతమంది ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు? వంటి వివరాలను సీజేఐ ఆరా తీశారు.


కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు..?

జస్టిస్‌ ఎన్వీ రమణను కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కలిశారు. ‘‘తెలుగు వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టడం నాకెంతో సంతోషం కలిగించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారైనందున మిమ్మల్ని కలవగలిగాను. ఇతర రాష్ట్రాల వారైతే నాకు కలిసే అవకాశమే వచ్చేది కాదు’’ అని జగ్గారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి కుటుంబ సభ్యుల యోగ క్షేమాలను జస్టిస్‌ రమణ ఆరా తీశారు. కాగా, రాష్ట్రంలో 16 ప్రజాసంఘాలపై ప్రభుత్వం అమలు చేస్తున్న నిషేధానికి సంబంధించి జస్టిస్‌ ఎన్వీ రమణకు పౌర హక్కుల సంఘం నివేదిక సమర్పించింది. రాజ్‌భవన్‌లో ఆయన్ను కలిసిన సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్‌, ప్రధాన కార్యదర్శి నారాయణరావులు ఈ నివేదికను అందజేశారు. ప్రజా సంఘాలపై నిషేధం ఎత్తివేయించాలని, జీవో 73ను రద్దు చేయించాలని జస్టిస్‌ రమణను కోరినట్లు వారు తెలిపారు. 


ఏడీఆర్‌ ఏర్పాటుకు మద్దతు ఇవ్వండి: ఎఫ్‌టీసీసీఐ

సీజేఐ జస్టిస్‌ రమణను ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) బృందం కలిసింది. ఫెడరేషన్‌లో నల్సార్‌-ఎఫ్టీసీసీఐ ప్రత్యామ్నాయ వివాద పరిష్కార (ఏడీఆర్‌) కేంద్రం ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని సీజేఐని ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు రమాకాంత్‌ ఇనానీ కోరారు. వివాదాలను వేగంగా పరిష్కరించడానికి ఏడీఆర్‌ దోహదపడుతుందన్నారు. ఏడీఆర్‌ ఏర్పాటు, విజయవంతంగా నిర్వహించడంలో తన పూర్తి మద్దతు ఉంటుందని జస్టిస్‌ రమణ హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-06-18T09:24:46+05:30 IST