మూడు ముక్కలాట చట్ట విరుద్ధమే

ABN , First Publish Date - 2021-06-17T09:27:38+05:30 IST

రాజధాని అమరావతిలో రైతులు ఇచ్చిన భూములలో పది వేల కోట్లతో అభివృద్ధి పనులు జరిగి, రాష్ట్ర పాలన అంతా అమరావతిగా ఐదేళ్ళ నుంచి జరుగుతుందని భూములు త్యాగం చేసిన రైతులు గుర్తు చేశారు

మూడు ముక్కలాట చట్ట విరుద్ధమే

చట్ట ప్రకారం సచివాలయం, అసెంబ్లీ,  హైకోర్టు, రాజ్‌భవన్‌ ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా పరిగణించాలి 

ఐదేళ్లుగా రాష్ట్ర పాలన అంతా అమరావతి రాజధానిగా నుంచే

పాలకులు మారితే రాజధాని మారదు

పది వేల కోట్ల ప్రజాధనంతో నిర్మాణాలు జరిగాయి

అభివృద్ది కొనసాగితే ఆదాయ వనరుగా అమరావతి ఉండేది

అది పట్టని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది

547వ రోజుకు చేరుకున్న రైతుల ఆందోళనలు


తుళ్లూరు, జూన్‌ 16 : రాజధాని అమరావతిలో రైతులు ఇచ్చిన భూములలో పది వేల కోట్లతో   అభివృద్ధి పనులు జరిగి,  రాష్ట్ర పాలన అంతా అమరావతిగా ఐదేళ్ళ నుంచి జరుగుతుందని భూములు త్యాగం చేసిన రైతులు గుర్తు చేశారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ది కొనసాగాలని రైతులు మహిళలు, రైతు కూలీలు చేస్తున్న ఉద్యమం బుధవారంతో 547వ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, రాజ్‌ భవనం, తదితర పాలనకు సంబందించిన అన్నీ కూడా రాజధాని అమరావతిలో ఉన్నాయన్నారు. చట్ట ప్రకారం ఇవి అన్నీ ఉంటేనే రాజధాని అవుతుందన్నారు. అందులోనూ  రాష్ట్ర నడి బొడ్డులో అందరికి సమాన దూరంలో ఉన్న  ప్రాంతం రాజఽధాని అమరావతి అని పేర్కొన్నారు. చట్ట  ప్రకారం అమరావతే రాష్ట్ర ఏకైక  రాజధాని అని స్పష్టం చేశారు. భారత దేశ మ్యాప్‌లో ఏపీ రాజధాని  అమరావతిని గుర్తించటం జరిగిందన్నారు.  మధ్యలో మూడు రాజధానుల ప్రతిపాదన చట్ట విరుద్దమైన ప్రకటన అని పేర్కొన్నారు. ఇప్పటికైనా వైసీపీ  ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. లేదంటే న్యాయ దేవత ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పది వేల కోట్లతో రాజధాని అమరావతి పనులు జరిగాయన్నారు. వాటిని కాదని రాజధాని తరలిస్తామంటే పోరాటం ఉధృతం చేస్తామన్నారు. న్యాయపోరాటం , ప్రత్యక్ష పోరాటం అమరావతి కోసం చేస్తున్నామన్నారు.  


కనీస జ్ఞానం ఉన్న ఏ ప్రభుత్వమైనా రైతులతో చర్చించేదన్నారు. సీఎం జగన్‌ రెడ్డి నియంత లాగ వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. నియంత  పాలన ఎన్నాళ్ళో సాగదన్నారు. ప్రజాస్వామ్యంలో నియంత పాలన కు చరమ గీతమేనన్నారు.  మూడు రాజధానులు స్వార్థ ప్రయోజనాల కోసమన్నారు. ప్రత్యేక హోదాతో అభివృద్ధి జరుగుతుంద న్నారు. దాని ఊసే  సీఎం జగన్‌రెడ్డి  ఎత్తటం లేదన్నారు. ఎంత సేపున్నా విశాఖపట్నంకు రాజధానిని తరలిస్తామని ప్రకటనలు ఇవ్వటం  తప్పితే,  అభివృద్ది గురించి  ఆలోచించింది లేదన్నారు. ప్రజలకు కావాల్సింది ప్రభుత్వం ఇచ్చే తాయిలాలు కాదన్నారు. జీవితానికి భరోసానిచ్చే ఉపాధి కావాలన్నారు. సంక్షేమ పథకాల పేరుతో కాలయాపన వద్దన్నారు. రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తే  వందల కంపెనీలు యువతకు ఉపాధి  చూపేవన్నారు. అదీ చేయకుండా ప్రజలు కట్టిన పన్నులను ప్రజలకే  సంక్షేమ పథకాలు పేరుతో పప్పు బెల్లం మాదిరిగా  పంచుతున్నారని పేర్కొన్నారు. మూడు ముక్కల ఆట ఆపేసి అమరావతిని అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. అమరావతి నిరుపేదల ఫింఛన్‌ను  సీఎం జగన్‌ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి ఐదు వేలు ఇవ్వాలని దళిత జేఏసీ సభ్యులు డిమాండ్‌ చేశారు. అది కనుక చేయటపోతే మాట తప్పి మడమ తిప్పామని సీఎం జగన్‌రెడ్డి ఒప్పుకోవాలన్నారు. ఐదు వేలు ఇచ్చే అంశం కోర్టులో ఉందని పచ్చి అబద్దాలు ఆడుతున్నారని పాలకులపై మండి పడ్డారు. అమరావతి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. జై అమరావతి అంటూ రైతు శిబిరాలు , ఇళ్ల నుండి  ఆందోళనలు కొనసాగాయి.


అమరావతి రైతులకు 195 కోట్లు 

అమరావతి, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు వార్షిక కౌళ్ల నిమిత్తం ప్రభుత్వం రూ.195 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. భూసమీకరణ పథకం(ఎల్పీఎస్‌) కింద అమరావతిలోని 29 గ్రామాల రైతులు సుమారు 34,000 ఎకరాలను రాష్ట్ర రాజధాని నిర్మాణార్థం అందజేసిన సంగతి తెలిసిందే. ఎల్పీఎస్‌ నిబంధనల ప్రకారం వారికి పదేళ్లపాటు వార్షిక కౌళ్లను వారి నుంచి భూములు సమీకరించిన ఏపీసీఆర్డీయే(ప్రస్తుత ఏఎంఆర్డీయే) ఇవ్వాల్సి ఉంది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతి నుంచి ఈ కౌలు మొత్తాల విడుదలలో నెలల తరబడి ఆలస్యం జరగడం పరిపాటైంది. వీటి కోసం రాజధాని రైతులు ఏపీసీఆర్డీయే కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులను అభ్యర్థిస్తున్నారు.  అయినా ఈ ఏడాది కూడా వార్షిక కౌలు విడుదలలో నెలల తరబడి జాప్యం జరిగింది. కరోనా దృష్ట్యా వైద్యఖర్చులు, ఇతర అత్యవసరాల నిమిత్తం మార్చిలోనే వాటిని విడుదల చేయాలంటూ రైతులు ఎంతగా విన్నవించినా ప్రభుత్వంలో చలనం లేదు. దీంతో విసిగిన కొందరు రైతులు వెంటనే వార్షిక కౌళ్లను ఇప్పించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎట్టకేలకు ఈ ఏడాది వార్షిక కౌలు మొత్తాలను మంజూరు చేసింది. 

Updated Date - 2021-06-17T09:27:38+05:30 IST