అంతరిక్ష కేంద్రంలో షూటింగ్‌ పూర్తి

ABN , First Publish Date - 2021-10-18T08:28:36+05:30 IST

రష్యాకు చెందిన దర్శకుడు, నటి కలిసి అంతరిక్షంలో విజయవంతంగా షూటింగ్‌ పూర్తి చేసి చరిత్ర సృష్టించారు. వారితో పాటు ఒక వ్యోమగామితో ..

అంతరిక్ష కేంద్రంలో షూటింగ్‌ పూర్తి

భూమికి తిరిగొచ్చిన రష్యా సినీ బృందం

మాస్కో, అక్టోబరు 17: రష్యాకు చెందిన దర్శకుడు, నటి కలిసి అంతరిక్షంలో విజయవంతంగా షూటింగ్‌ పూర్తి చేసి చరిత్ర సృష్టించారు. వారితో పాటు ఒక వ్యోమగామితో కూడిన సోయూజ్‌ వ్యోమనౌక తాజాగా భూమి మీదకు చేరింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌) నుంచి మూడున్నర గంటల ప్రయాణం అనంతరం.. కజకిస్థాన్‌లో ఆదివారం ఉదయం 4.35 గంటలకు ఈ కాప్స్యూల్‌ ల్యాండ్‌ అయింది.


రష్యాకు చెందిన నటి పియర్‌సిల్డ్‌, దర్శకుడు షిపెంకో కలిసి చాలెంజ్‌ అనే సినిమా షూటింగ్‌ గురించి ఈ నెల 5న రోదసిలోకి ప్రయాణించారు. సినిమా కథ ప్రకారం.. పియర్‌సిల్డ్‌ ఒక వైద్యురాలు. ఐఎస్‌ఎస్‌లో అత్యవసరంగా ఆపరేషన్‌ అవసరమైన వ్యోమగామికి చికిత్స చేసేందుకు గాను పియర్‌సిల్డ్‌ ఐఎస్‌ఎస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఈ కథను నిజంగానే ఐఎస్‌ఎస్‌లో తీసి చరిత్ర సృష్టించారు షిపెంకో. ఇక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యోమగామిగా నోవిట్‌స్కీ అనే నిజ వ్యోమగామి నటించారు. భూమిపై మరిన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందని, ఆ తర్వాత విడుదల తేదీని ప్రకటిస్తామని ఈ చిత్ర బృందం పేర్కొన్నారు.

Updated Date - 2021-10-18T08:28:36+05:30 IST