కమ్యూనిస్టులు మొరిగే కుక్కలు

ABN , First Publish Date - 2021-12-29T08:49:34+05:30 IST

కమ్యూనిస్టులు మొరిగే కుక్కలు

కమ్యూనిస్టులు మొరిగే కుక్కలు

యూనియన్లతో వ్యవస్థలను నాశనం చేశారు

మాకు అధికారమిస్తే రూ.50కే చీప్‌ లిక్కర్‌

మూడేళ్లలో రాజధాని నిర్మాణం: వీర్రాజు


అమరావతి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): కమ్యూనిస్టులు మొరిగే కుక్కలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజమెత్తారు. తమకు అధికారమిస్తే చీప్‌ లిక్కర్‌ బాటిల్‌ రూ.70కి.. ఆర్థిక పరిస్థితి సహకరిస్తే రూ.50కే ఇస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర నిధులతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు జగన్‌ పేరు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. మంగళవారం ప్రజా ఆగ్రహ సభలో ఆయన ప్రసంగించారు. కమ్యూనిస్టులు నీచులని, యూనియన్లతో వ్యవస్థల్ని నాశనం చేశారని మండిపడ్డారు. బీజేపీకి అధికారమిస్తే మూడేళ్లలో రాజధాని నిర్మిస్తామని, పాలనపై అవగాహన ఉన్న వ్యక్తిని సీఎం చేస్తామని మాటిచ్చారు. జగన్‌ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి విశాఖలో కబ్జాలు చేస్తున్నారని, సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేశారని వాపోయారు. గ్రామ సర్పంచ్‌లకు మోదీ నిధులిస్తే ఆ డబ్బుకూడా దారి మళ్లించి జగనన్న పేరు ప్రచారం చేసుకొంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ సభతో మంత్రి పేర్ని నాని, టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌కు ఎక్కడో కాలిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


చాక్లెట్‌ ఇచ్చి నెక్లెస్‌ కాజేస్తున్నారు: కన్నా

సీఎం జగన్‌ ప్రజలకు చాక్లెట్‌ ఇచ్చి నెక్లెస్‌.. కుదిరితే నిలువు దోపిడీయే చేస్తున్నారని బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా ఆరోపించారు. ‘నీ పాలనపై నీకు నమ్మకం ఉంటే పీకే ఎందుకు.. భారతీ సిమెంట్‌ ధర తగ్గించు.. నీ పత్రికలో ఉచితంగా ప్రభుత్వ ప్రకటనలివ్వు.. టీడీపీ అధికారంలో ఉన్నప్పటి కన్నా ఇసుక తక్కువ ధరకు ఇవ్వు.. లేదంటే 2024లో ప్రజలకు నీకు తగిన బుద్ధి చెబుతారు’ అని హెచ్చరించారు. దేశమంతా 2020 మార్చిలో కరోనా వైరస్‌ వస్తే ఏపీలో మాత్రం 2019 మే నెలలోనే జగన్‌ అనే వైరస్‌ వచ్చిందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ వ్యాఖ్యానించారు.


వాళ్లే చంపి.. వాళ్లే కుట్లేసి..

తనను అన్యాయంగా వివేకా హత్య కేసులో ఇరికించారని, వాళ్లే చంపి, వాళ్లే కుట్లేసి, వాళ్లే గుండెపోటని, చంద్రబాబు వేసిన సిట్‌ వద్దు సీబీఐ కావాలని.. ఇప్పుడు నిజం బయట పడటంతో అరెస్టు భయం పట్టుకుందని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. సొంత వాళ్లను చంపే జగన్‌ కావాలా.? ఆలయాలు నిర్మించే మోదీ కావాలా అని ప్రజల్లోకి వెళ్దామని కార్యకర్తలకు పిలుపిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, కార్యకర్తలు శ్రమిస్తే 2024కన్నా ముందే సాధ్యమవుతుందని శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద వ్యాఖ్యానించారు. ఎస్‌సీ రిజర్వుడు నియోజకవర్గంలో రాజధాని ఉంటే దళితులు బాగుపడతారనే జగన్‌ అమరావతిని నిర్వీర్యం చేశారని మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు ఆరోపించారు. రాక్షస పాలన సాగించే జగన్‌.. సామాన్యుల నుంచి జడ్జిల వరకూ ఎవ్వరినీ వదల్లేదని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు అన్నారు. సభలో ఎమ్మెల్సీలు మాధవ్‌, వాకాటి నారాయణరెడ్డి, వల్లూరు జయప్రకాశ్‌, సుధీష్‌ రాంబొట్ల, నాగోతు రమేశ్‌, మాలతీ రాణి, నిమ్మక జయరాజ్‌, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-29T08:49:34+05:30 IST