షట్లర్లు, ప్యాడ్లర్లు సూపర్‌

ABN , First Publish Date - 2022-07-30T09:45:54+05:30 IST

కామన్వెల్త్‌ క్రీడల పతకాల వేటలో షట్లర్లు, ప్యాడ్లర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు.

షట్లర్లు, ప్యాడ్లర్లు  సూపర్‌

హాకీ జట్టు గెలుపు

బాక్సర్‌ శివథాపా ముందంజ

స్విమ్మింగ్‌ సెమీస్‌లో నటరాజ్‌

సాజన్‌ విఫలం 

కామన్వెల్త్‌ తొలిరోజు


కామన్వెల్త్‌ క్రీడల మొదటి రోజు భారత అథ్లెట్లు మిశ్రమ ఫలితాలు సాధించారు..ఊహించినట్టుగానే బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌, హాకీ, బాక్సింగ్‌ విభాగాల్లో విజయాలు దక్కాయి..బ్యాడ్మింటన్‌ తొలి పోరులో భారత్‌ 5-0తో పాకిస్థాన్‌ను చిత్తుచేసింది..టీటీలో మహిళలు, పురుషుల జట్లు అద్భుత ఆరంభం అందుకోగా, బాక్సర్‌ శివథాపా ప్రీక్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టాడు..స్విమ్మింగ్‌లో సీనియర్‌ సాజన్‌ ప్రకాశ్‌ విఫలంకాగా, నటరాజ్‌ సెమీ్‌సలో ప్రవేశించాడు..సైక్లింగ్‌లో మహిళలు, పురుషులు పూర్తిగా నిరాశపరిచారు..క్రికెట్‌లో మన మహిళలు ఎప్పటిలాగే ఆస్ట్రేలియా చేతిలో పరాజయం చవిచూశారు.. 


బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ క్రీడల పతకాల వేటలో షట్లర్లు, ప్యాడ్లర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. హాకీలో మహిళల జట్టు బోణీ కొట్టింది. స్టార్లు పీవీ సింధు, మనికా బాత్రా ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్‌, టీటీ జట్లు ప్రత్యర్థులపై అలవోక విజయాలతో ముందంజ వేశాయి. స్టార్‌ బాక్సర్‌ శివథాపా తొలి రౌండ్‌లో పాకిస్థాన్‌ ప్రత్యర్థిని మట్టికరిపించాడు.


బోణీ చేశారు కానీ..:

కామన్వెల్త్‌ మహిళల హాకీలో భారత జట్టు బోణీ చేసింది. శుక్రవారం జరిగిన పూల్‌-ఎ మ్యాచ్‌లో భారత్‌ 5-0తో ఘనాపై విజయం సాధించింది. అయితే భారత్‌ శుభారంభం అందుకున్నా..చిట్టిపొట్టి జట్టయిన ప్రత్యర్థిపై మన మహిళలు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. గుర్జిత్‌కౌర్‌ (3, 39ని), నేహా గోయల్‌ (28), సంగీతా కుమారి (36), సలీమా టేటె (56) భారత్‌ తరపున గోల్స్‌ చేశారు. తొలి రెండు క్వార్టర్లలో సవితా పూనియా సేన ఆట తీరు అంతంత మాత్రంగానే ఉంది. ఈ రెండు క్వార్టర్లలో ఘనా డిఫెండర్లు మనోళ్లను సమర్థంగా ఎదుర్కోవడం విశేషం. మిడ్‌ఫీల్డ్‌, ఫార్వర్డ్‌ లైన్‌ల మధ్య సమన్వయం స్పష్టంగా కానవచ్చింది. అలాగే పెనాల్టీకార్నర్లను గోల్స్‌గా చేయడంలో భారత బలహీనత మరోసారి బయటపడింది. 10 పెనాల్టీకార్నర్లు లభిస్తే అందులో ఒకదానినే గోల్‌గా మలచగలిగింది.  


ఎదురులేని షట్లర్లు..:

మిక్స్‌డ్‌ టీం గ్రూప్‌-ఎ తొలి పోరులో భారత్‌ 5-0తో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. మొదట సుమిత్‌రెడ్డి, పొన్నప్ప జోడీ 21-9, 21-12తో మహ్మద్‌ ఇర్ఫాన్‌, గజాలా సిద్దిఖిని చిత్తు చేసి జట్టును 1-0 ఆధిక్యంలో నిలిపింది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ 21-7, 21-12తో మురాద్‌ అలీపై గెలిచి ఆధిక్యాన్ని మరింత పెంచాడు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు 21-7, 21-6 మహూర్‌ షహజాద్‌ను ఓడించడంతో భారత్‌ తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. డబుల్స్‌లో సాత్విక్‌, చిరాగ్‌ 21-12, 21-9 తో మురాద్‌, ఇర్ఫాన్‌పై నెగ్గారు. చివరి మ్యాచ్‌లో గాయత్రీ గోపీచంద్‌, ట్రీసా జోలీ ద్వయం 21-4, 21-5తో మహూర్‌ షహజాద్‌, గజాలా సిద్దిఖిని చిత్తు చేసింది.


స్విమ్మింగ్‌ సెమీ్‌సలో నటరాజ్‌:

పురుషుల 100మీ. బ్యాక్‌స్ట్రోక్‌లో శ్రీహరి నటరాజ్‌ సెమీ్‌సకు చేరాడు. అయితే సీనియర్‌ స్విమ్మర్‌ సాజన్‌ ప్రకాశ్‌, తొలిసారి కామన్వెల్త్‌ బరిలో దిగిన కుశాగ్ర రావత్‌ తమ ఈవెంట్లలో సెమీఫైనల్‌కు చేరడంలో విఫలమయ్యారు. 100 మీ. బ్యాక్‌స్ట్రోక్‌లో 54.68సె.లో గమ్యం చేరిన 21 ఏళ్ల నటరాజ్‌ సెమీస్‌ స్థానం ఖాయం చేసుకున్నాడు. ఇక 50మీ. బటర్‌ఫ్లైలో సాజన్‌ 25.01 సె.టైమింగ్‌తో 8వ స్థానంలో నిలిచాడు. తొలి 16 స్థానాల్లో నిలిచిన స్విమ్మర్లు సెమీ్‌సకు అర్హత సాధిస్తారు. పురుషుల 400మీ. బట్టర్‌ఫ్లైలో 3ని.57.45సె.లో గమ్యం చేరిన కుశాగ్ర చివరి స్థానంతో సరిపెట్టుకున్నాడు. 


టీటీలో సూపర్‌ షో..:

టీటీలో మహిళలు, పురుషుల జట్లకు ఎదురులేకుండా పోయింది. మహిళల జట్టు 3-0తో దక్షిణాఫ్రికాపై, రెండో పోరులో ఫిజిపై 3-0తో నెగ్గింది. పురుషులు తొలి పోరులో 3-0తో బార్బడో్‌సపై నెగ్గారు. దక్షిణాఫ్రికాతో మొదటి పోరులో.. శ్రీజ ఆకుల, రీత్‌ టెన్నిసన్‌ జోడీ 11-7, 11-7, 11-5తో లైలా, ఎడ్వర్డ్స్‌, దనీషా పటేల్‌ ద్వయంపై నెగ్గి శుభారంభం ఇచ్చింది. అనంతరం సింగిల్స్‌లో మనికా బాత్రా 11-5, 11-3, 11-2తో ముష్ఫిక్‌ కలామ్‌ను చిత్తు చేసింది. రెండో సింగిల్స్‌లో శ్రీజ  11-5, 11-3, 11-6తో పటేల్‌పై నెగ్గడంతో భారత్‌ విజయం పరిపూర్ణమైంది. ఫిజితో రెండో పోరులో.. డబుల్స్‌లో శ్రీజ, చితాలె 11-8, 11-3, 11-5తో టిటానా, గ్రేస్‌పై గెలిచారు. సింగిల్స్‌లో మనికా 11-2, 11-4, 11-2తో కరోలిన్‌ని ఓడించింది. ఆఖరి సింగిల్స్‌లో శ్రీజ 11-7, 11-1, 11-2తో గ్రేస్‌పై గెలుపొందింది. పురుషుల గ్రూప్‌-3లో బార్బడో్‌సపై..హర్మీత్‌, సాథియన్‌ జంట 11-9, 11-9, 11-4తో కెవిన్‌, నైట్‌ను చిత్తు చేసి జట్టుకు 1-0 ఆధిక్యం అందించారు. సింగిల్స్‌లో వెటరన్‌ శరత్‌ కమల్‌ 11-5, 11-3, 11-3తో మ్యాక్స్‌వెల్‌ను చిత్తు చేశాడు. రెండో సింగిల్స్‌లో సాథియన్‌ 11-4, 11-4, 11-5తో నైట్‌ను ఓడించాడు. 


రౌండ్‌-16లో శివథాపా: పురుషుల బాక్సింగ్‌లో బోణీ కొట్టాడు. లైట్‌వెల్టర్‌ వెయిట్‌ ఆరంభ బౌట్‌లో థాపా 5-0తో పాకిస్థాన్‌ బాక్సర్‌ సులేమాన్‌ బలోచ్‌ను చిత్తు చేసి ప్రీక్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించాడు. 

సైక్లింగ్‌..:

పురుషుల టీం స్ర్పింట్‌ క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో రొనాల్డో, రోజిత్‌, బెక్‌హామ్‌తో కూడిన భారత జట్టు 44.702 సె.టైమింగ్‌తో ఆరో స్థానంలో నిలిచి ఫైనల్‌కు క్వాలిఫై కాలేకపోయింది. మహిళల టీం స్ర్పింట్‌లో భారత్‌ ఏడో స్థానం సాధించింది. 4000 మీ. టీం పర్స్యూట్‌లో పురుషుల జట్టు ఆరో, చివరి స్థానంలో నిలిచింది. 


ఇతర ఫలితాలు..

లాన్‌బౌల్‌ పురుషుల టీం ఈవెంట్‌లో  భారత్‌ 6-23తో న్యూజిలాండ్‌ చేతిలో, అనంతరం 12-19తో స్కాట్లాండ్‌ చేతిలో ఓడింది. ఉమెన్‌ సింగిల్స్‌లో తానియా చౌధరి 10-21తో డీన్‌ హాగన్‌ (స్కాట్లాండ్‌) చేతిలో, 20-21తో డఫ్నే ఆల్మండ్‌ (ఫాక్లాండ్‌) చేతిలో పరాజయం చవిచూసింది.  


ఫ్లోరాకు ట్రయాథ్లాన్‌ స్వర్ణం:

బెర్ముడాకు చెందిన ఫ్లోరా డఫి ట్రయాథ్లాన్‌ స్వర్ణం గెలిచింది. జార్జ్‌ టేలర్‌ (బ్రిటన్‌) రజతం, బేత్‌ పాటర్‌ (స్కాట్లాండ్‌) కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. 

Updated Date - 2022-07-30T09:45:54+05:30 IST