సుఖవంతమైన ప్రేమ

ABN , First Publish Date - 2021-08-30T05:54:50+05:30 IST

సుఖవంతమైన ప్రేమ, అది సహజమైనదేనా అది నిజమైనదేనా అది మనకు ఉపయోగకరమేనా ప్రపంచాన్ని పట్టించుకోని ఆ యిద్దరి ప్రేమ వల్ల...

సుఖవంతమైన ప్రేమ

సుఖవంతమైన ప్రేమ, అది సహజమైనదేనా

అది నిజమైనదేనా అది మనకు ఉపయోగకరమేనా

ప్రపంచాన్ని పట్టించుకోని ఆ యిద్దరి ప్రేమ వల్ల

ప్రపంచానికి ఏం ప్రయోజనం

ఏ కారణానో తెలీకుండా


వొకరివైపు మరొకరు ఆకర్షితులైనవాళ్ళు

మిగతా మిలియన్ల మనుషుల కంటే ఏ విధమైన

ప్రత్యేకతా లేనివాళ్ళు

అదంతే అలాగే వుంటుందనే నమ్మకం వున్నవాళ్ళు

దేనికి బహుమతిగా పొందాలనో- బహుశా శూన్యానికేనా

కాంతి కురుస్తోంది ఎక్కణ్నించో-

వాళ్ళ మీదే పడుతుంది కానీ ఇతరుల్ని తాకదంటారా?

ఇది న్యాయాన్ని అవమానించడం కాదూ? అవున్నిజంగానే.

ఎన్నాళ్ళగానో పెంపొందుతున్న విలువల్ని 

కావాలని అస్తవ్యస్తం చేయడం కాదూ

నీతినియమాల్ని వెక్కిరిస్తున్నట్లు కాదూ? అవున్నిజంగానే.


ఆనందంగా వున్న వీళ్ళని చూడండి:

ఏమాత్రం ఆచ్ఛాదననైనా వాళ్ళు తగిలించుకున్నారా.

మిత్రుల్ని కాపాడుకోవడానికి అనవసరపు

ఆప్యాయతల్ని వొలకబోసారా!

వినండి వాళ్ళెలా నవ్వుతున్నారో - మనల్ని కలవరపరుస్తూ

వాళ్ళు మాట్లాడే భాషా - మనకి అర్థమౌతున్నట్లే వుటుంది

వాళ్ళ ఆ పార్టీలూ, హంగూ ఆర్భాటం, ఆ గందరగోళం హడావిడి

వొకళ్ళ కొకళ్ళు చేసుకునే సపర్యలూ-

అవన్నీ మనలాంటి మనుషుల వెనగ్గా వాళ్ళు కావాలని

పన్నుతున్న కుట్రలా కన్పించటం లేదూ!


వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే ఎలాంటి

ఫలితాలు కలుగుతాయో ఊహించడం కష్టమే

మతాల్నీ, కవుల్నీ బ్రతికించుకుంటున్నదేమిటో

ఎల్లకాలం ఏది గుర్తుంటుంది, దేన్ని మనం 

గాలికి వదిలేస్తామో

దాని పరిధుల్ని దాటకుండా ఎవరు స్వేచ్ఛని కోల్పోగలరు.

సుఖవంతమైన ప్రేమ, మనకది నిజంగా అవసరమా?

తెలివిగానూ సునిశితంగానూ ఉన్నతమైన

                   జీవితం గడపాలంటే

ఇలాంటి అపవాదాల్ని పట్టించుకోకపోవడమే మంచిది.


అందమైన పిల్లలు పుడతారు దీని సహాయం లేకుండానే

అది ఏనాటికీ భూమ్మీది జనాన్ని వృద్ధి చేయలేదు

ఎందుకంటే- ఎక్కడో తప్ప పుట్టదు కనక!


సుఖవంతమైన ప్రేమని ఎక్కడా చూడని వాళ్ళనందర్నీ

ప్రపంచంలో ఎక్కడా అది దొరకదని నొక్కి చెప్పమనండి.

అలాంటి నమ్మకం వున్నప్పుడు తప్ప 

వాళ్ళు హాయిగా బ్రతకాలేరు కనీసం హాయిగా చావనూ లేరు

మూలం: వీస్వావా షింబోర్‌స్కా

అనువాదం: సుమనశ్రీ

89785 84995


Updated Date - 2021-08-30T05:54:50+05:30 IST