Abn logo
Apr 8 2021 @ 02:55AM

నక్సల్స్‌ చెరలోనే కోబ్రా కమాండో.. సర్కారు కోర్టులో బంతి..!

  • -వ్యూహాత్మకంగా ఆఫర్‌ ఇచ్చిన మావోయిస్టులు
  • -మధ్యవర్తుల పేర్లు చెప్పాలంటూ ఇప్పటికే లేఖ
  • -ప్రభుత్వం నుంచి ఇంకా వెలువడని ప్రకటన
  • -ఎవరిని పంపాలన్న యోచనలో పోలీసులు!

చర్ల/బీజాపూర్‌/జమ్ము, ఏప్రిల్‌ 7: ఛత్తీ‌స్‌గఢ్‌లోని బీజాపూర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో.. నక్సలైట్లు బందీగా తీసుకెళ్లిన కోబ్రా కమాండో రాకేశ్వర్‌సింగ్‌ మన్హాస్‌ విడుదలపై ఇంకా సందిగ్ధం వీడలేదు. అతడు క్షేమంగానే ఉన్నాడని, త్వరలో విడుదల చేస్తామని చెప్పిన మావోయిస్టులు.. తాజాగా బుధవారం తమ చెరలో ఉన్న రాకేశ్వర్‌ ఫొటోను మీడియాకు విడుదల చేశారు. ఆ ఫొటోలో రాకేశ్వర్‌ ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించారు. అయితే.. మావోయిస్టులు పెట్టిన షరతుపై ఇంకా ఛత్తీ్‌సగఢ్‌ సర్కారు గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ స్పందించలేదు. మావోయిస్టులు మంగళవారం విడుదల చేసిన లేఖలో.. ‘‘మధ్యవర్తుల పేర్లు చెబితే.. రాకేశ్వర్‌ సింగ్‌ను విడుదల చేస్తాం’’ అని స్పష్టంగా పేర్కొన్నారు. మావోయిస్టులు వ్యూహాత్మకంగానే ఈ ప్రకటన చేసినట్లు, బంతిని ప్రభుత్వం కోర్టులో వేసినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ తరఫున మంగళవారం ఓ ప్రకటన విడుదలవగా.. అందులో కేవలం తాము కోబ్రా కమాండోను తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.


అతను మావోయిస్టుల చెరలో ఉన్నాడనడానికి ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు బుధవారం పొటోను విడుదల చేసినట్లు తెలుస్తోంది. కాగా, మధ్యవర్తుల పేర్లను ప్రకటిస్తే జవాన్‌ను వదిలేస్తామన్న మావోయిస్టుల ప్రకటనపై ఛత్తీ్‌సగఢ్‌ పోలీసులు సమాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టులకు పరిచయం ఉన్న రాజకీయ నాయకులు, మావోయిస్టు కొరియర్లు, ఉద్యమంలో లొంగిపోయిన మాజీ మావోయిస్టులు, లేదా పాత్రికేయులు.. వీరిలో ఎవరిని పంపాలనే అనే అంశంపై అధికారులు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై కేంద్రానికి కూడా ఛత్తీ్‌సగఢ్‌ ప్రభుత్వం ఓ నివేదికను అందించినట్లు సమాచారం. మరోవైపు ఎప్పటి నుంచో నడుస్తున్న చర్చల మంత్రానికి ఈ జవాన్‌ విడుదల ద్వారా బీజం పడుతుందని మావోయిస్టులు ఆశిస్తున్నట్లు కొందరు ఇంటెలిజెన్స్‌ అధికారులు అభిప్రాయపడుతున్నారు. 


అభినందన్‌ ఘటనతో పోలుస్తూ..

రాకేశ్వర్‌ సింగ్‌ అపహరణను నెటిజన్లు గత ఏడాది పాకిస్థాన్‌ బాలాకోట్‌లోని ఉగ్ర స్థావరాలపై ఎయిర్‌ స్ట్రైక్‌చేసిన సమయంలో.. అక్కడి సైన్యానికి బందీగా పట్టుబడ్డ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌తో పోల్చి చూస్తున్నారు. అభినందన్‌ను 60 గంటల్లో విడిపించిన ప్రభుత్వం.. 100 గంటలు దాటినా రాకేశ్వర్‌ విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు.


రాకేశ్వర్‌ను వదలాలి: నిర్బంధ వ్యతిరేక వేదిక 

హైదరాబాద్‌: మావోయిస్టులు తమ అధీనంలోకి తీసుకున్న కోబ్రా కమాండో రాకేశ్వర్‌సింగ్‌ మన్హా్‌సను వెంటనే విడుదల చేయాలని నిర్బంధ వ్యతిరేక వేదిక విజ్ఞప్తి చేసింది. విడుదల ద్వారా ఆయన కుటుంబ ఆందోళనను నివారించాలని కోరింది. అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చల దిశగా ముందడుగు వేయాలని నిర్బంధ వ్యతిరేక వేదిక కన్వీనర్‌ ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌, కో కన్వీనర్లు ప్రొఫెసర్‌ జి.లక్ష్మణ్‌, ఎం.రాఘవాచారి, కె.రవిచందర్‌ బుధవారం ఒక ప్రకటనలో కోరారు.నా భర్తను క్షేమంగా తీసుకురండి: మీనూ

తన భర్తను క్షేమంగా తీసుకురావాలంటూ రాకేశ్వర్‌ సింగ్‌ భార్య మీనూ.. ప్రధాని మోదీని, హోంశాఖ మంత్రి అమిత్‌షాను కోరారు. పాకిస్థాన్‌ నుంచి అభినందన్‌ను విడిపించినట్లుగానే.. తన భర్తను సురక్షితంగా విడిపించుకురావాలన్నారు. సీఆర్పీఎ్‌ఫలో క్రమశిక్షణకు పెద్దపీట వేస్తారని, విధుల్లో ఒక గంట ఆలస్యమైనా కఠిన చర్యలు తీసుకుంటారని అన్నారు. అలాంటిది తన భర్తను మావోయిస్టులు అపహరించి నాలుగు రోజులు గడిచినా.. ఇంకా ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. బుధవారం రాకేశ్వర్‌ బంధువులు జమ్మూలోని ఆయన స్వస్థలం బర్నాయ్‌లో ఆందోళన చేపట్టారు. జమ్ము-పూంచ్‌ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి, జమ్ము కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

Advertisement
Advertisement
Advertisement