పారదర్శక పాలనే పట్టుగొమ్మ

ABN , First Publish Date - 2020-11-14T06:00:04+05:30 IST

భారతీయ జనతా పార్టీకే ఎందుకు పట్టం కట్టారు? దీనికి ప్రధాన కారణం ప్రజలకు పారదర్శక పరిపాలన సమకూరడమే. ప్రధాని మోదీ ఇచ్చిన ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’ పిలుపు పాలనలో ఆచరించి చూపించడం వల్లే బీజేపీని ప్రజలు విశ్వసిస్తున్నారు...

పారదర్శక పాలనే పట్టుగొమ్మ

భారతీయ జనతా పార్టీకే ఎందుకు పట్టం కట్టారు? దీనికి ప్రధాన కారణం ప్రజలకు పారదర్శక పరిపాలన సమకూరడమే. ప్రధాని మోదీ ఇచ్చిన ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’ పిలుపు పాలనలో ఆచరించి చూపించడం వల్లే బీజేపీని ప్రజలు విశ్వసిస్తున్నారు. పాలనలో పారదర్శకతను ఆచరించకపోతే విపక్షాల ప్రభుత్వాలకు బీజేపీ రూపంలో ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవు. ఈ సత్యాన్నే దుబ్బాక ప్రజలు కేసిఆర్ ప్రభుత్వానికి స్పష్టం చేశారు.


‘బీజేపీ ఎక్కడుంది?’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. ‘2023 అసెంబ్లీ ఎన్నికలలో జయకేతనం ఎగురవేసి అధికారానికి రానున్నది బీజేపీయే’ అని దుబ్బాక ఘంటాపథంగా చెప్పింది. తెలంగాణ ఉప ఎన్నికలోనే కాదు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మణిపూర్ మొదలైన పది రాష్ట్రాల ఉప ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ గణనీయమైన విజయాలు సాధించింది. దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు జరిగిన 59 స్థానాలలో 41 బీజేపీ కైవసమయ్యాయి. దేశ ప్రజలు బీజేపీని ఎంతగా విశ్వసిస్తున్నారో ఈ విజయాలు విశదం చేస్తున్నాయి. ఇంతకంటే ముఖ్యంగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ ఒక అజేయ శక్తి అని స్పష్టం చేశాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ ఆ కీలక ఉత్తరాది రాష్ట్రంలో బీజేపీ తన బలాన్ని పెంచుకొంది. జనతాదళ్ (యు) తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది. బిహార్ లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, రాష్ట్రీయ జనతా దళ్ నేతృత్వంలోని మహాకూటమి పార్టీలకే ప్రజలు పట్టం కడతారన్న అంచనాలను ఓటర్లు తలకిందులు చేశారు. ప్రతిపక్షాల ప్రచారాలను ప్రజలు తిరస్కరించారు. కొవిడ్ సంక్షోభ సమయంలో కేంద్రం చర్యలు సరిగా లేవని, దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిందని, నిరుద్యోగం పెరిగిందని విపక్షాలు ఎంతగా చెప్పినా ప్రజలు విశ్వసించలేదు. బిహార్‌లోని వాల్మీకి నగర్ లోకసభ స్థానాన్ని ఎన్‌డిఏ భాగస్వామ్య పక్షమైన జనతాదళ్ (యు) గెలుచుకున్నది. 


ఇటీవల జరిగిన ఉపఎన్నికలలో ఒక్కో రాష్ట్రానిది ఒక్కో ప్రత్యేకతగా చెప్పవచ్చు. మధ్యప్రదేశ్ విషయానికి వస్తే 2018 లో బిఎస్‌పి, ఎస్‌పిల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే జ్యోతిరాదిత్య సింధియా రూపంలో వచ్చిన అసమ్మతిని ఎదుర్కొలేక చతికిల పడింది. అధికారం బీజేపీ కైవసమయింది. తదనంతర పరిణామాల్లో జ్యోతిరాదిత్య సింధియా తన అనుచరులతో రాజీనామా చేయించడంతో 28 స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. 19 స్థానాల్లో బీజేపీ విజయం సాధించి అసెంబ్లీలో పూర్తి మెజారిటీకి అవసరమైనవాటి కంటే ఎక్కువ సీట్లు సమకూర్చుకుంది. ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే యోగి అదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన నాటినుంచి విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున దుష్ప్రచారం మొదలు పెట్టింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో చోటుచేసుకున్న అనేకానేక అఘాయిత్యాలను విస్మరించి ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒక అత్యాచార ఘటనను భూతద్దంలో చూపేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఆడిన డ్రామాలు దేశ ప్రజలు గమనించారు. కాంగ్రెస్ నేతల కుటిల నీతికి ఉపఎన్నికల్లో గుణపాఠం చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో 7 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల్లో యోగి బీజేపీకి 6 స్థానాల్లో ప్రజలు పట్టం కట్టారు. తాము బీజేపీనే విశ్వసిస్తామని చెప్పకనే చెప్పారు. కర్ణాటకలో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరుగగా ఆ రెండూ బీజేపీకే దక్కాయి. మణిపూర్‌లో ఉప ఎన్నికలు జరిగిన 5 స్థానాలలో 4 బీజేపీకే రావడం గమనార్హం. 


భారతీయ జనతా పార్టీకే ఎందుకు పట్టం కట్టారు? రాజకీయ పరిశీలకులకు ఆసక్తి గొలుపుతున్న ప్రశ్న ఇది. కొంతమందిని వేధిస్తున్న విషయం కూడా. ఎందుకంటే సహజంగా అధికారంలో ఉన్న పార్టీల పట్ల ప్రజల్లో ఎంతోకొంత వ్యతిరేకత ఉంటుంది. కాబట్టే విపక్షాలు అధికార పక్షాలుగా మారుతుంటాయి. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అధికార మార్పిడి అంతగా జరుగకపోగా ఉపఎన్నికల్లోనూ విజయ బావుటా ఎగురవేస్తుండడాన్ని మనం చూస్తున్నాం. దీనికి ప్రధాన కారణం ప్రజలకు పారదర్శక పరిపాలన సమకూరడమే అనడంలో సందేహం లేదు. మెజారిటీ, మైనారిటీల పేర్లతో ప్రజల్లో పక్షపాతం చూపించకపోవడం మరొక ప్రధాన కారణం. ప్రధాని మోదీ ఇచ్చిన ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్ సబ్ కా విశ్వాస్’ పిలుపు పాలనలో ఆచరించి చూపించడం వల్లే బీజేపీని విశ్వసించి ప్రజలు పట్టం కడుతున్నారని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో పాలనలో పారదర్శకతను ఆచరించకపోతే బీజేపీ రూపంలో ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవు. ఈ నిష్ఠుర సత్యాన్నే దుబ్బాక ప్రజలు కేసిఆర్ నేతృత్వంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి స్పష్టం చేశారు. 


మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించవచ్చని ఇంకా భ్రమల్లో ఉంటే అధికారం వదులుకోవాల్సి వస్తుందని ఆ పార్టీ నాయకులు ఇప్పటికైనా గ్రహించాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికార పగ్గాలు చేపట్టగానే కేసీఆర్ తన నిజస్వరూపాన్ని బయట పెట్టడం ప్రారంభించారు. ఏ మీడియా ద్వారా ఉద్యమాన్ని ముందుకు నడిపారో ఆ మీడియానే అణగదొక్కేందుకు ప్రయత్నించారు. ఉద్యమాల ద్వారా రాష్ట్రాన్ని సాధించినట్లు చెప్పుకునే కేసీఆర్, తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంకెవరూ ఉద్యమాలు చేయకూడదని ధర్నా చౌక్‌ని ఎత్తివేశారు! ఎవరి ద్వారా అధికార పగ్గాలు చేపట్టారో వారినే కించపరిచారు. హిందువులను తీవ్రంగా దూషించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న హామీని విస్మరించారు. ఇక దళితులకు మూడెకరాల భూమి నిస్తామన్న వాగ్దానాన్ని నెరవేర్చలేదు. డబుల్ బెడ్ రూం గృహాలు పేరుతో మోసం చేశారు. అన్నిటి కంటే ముఖ్యంగా ఏ త్యాగధనుల ఫలితంగా రాష్ట్ర సాధన ఫలించిందో వారినే విస్మరించి ఉద్యమకారులపై దాడి చేసిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టి ఆదరిస్తున్నారు. అంతే కాకుండా తెలంగాణ వ్యతిరేక పార్టీ అయిన మజ్లిస్‌తో చేతులు కలిపి వారిని సంతృప్తిపరచడానికి నిజాం పాలనను పొగడడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉన్నాయి. వాటన్నింటినీ ప్రజలు ఇంతకాలం ఓపికగా చూస్తూ వచ్చారు. ఇక వారిలో ఓపిక నశించి దుబ్బాక ఉపఎన్నిక రూపంలో తమ ఆగ్రహాన్ని చూపించారని చెప్పవచ్చు. 


మైనారిటీల సంక్షేమ చర్యలను ఎవరూ వ్యతిరేకించరు కానీ బైంసాలో హిందువులను తీవ్రంగా హింసించిన వారిపై పై కనీసం కేసులు కూడా నమోదు చేయకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆ బాధితులను ఇప్పటిదాకా ఒక్క టిఆర్‌ఎస్ నాయకుడూ పరామర్శించకపోవడం గర్హనీయం. గతంలో ఎక్కడ ఏ చిన్న దుర్ఘటన జరిగినా ప్రభుత్వంలో ఉన్న వారు బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పేవారు. కేసీఆర్ ఈ సత్సంప్రదాయానికి చరమగీతం పాడారు. తమ ప్రభుత్వ నిర్వాకం కారణంగానే ఇంటర్ పరీక్ష ఫలితాల్లో తప్పులు దొర్లి పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ఇంతవరకు ముఖ్యమంత్రి కానీ, పాలక పార్టీ నాయకులుగానీ ఆ విద్యార్థుల కుటుంబాలను పరామర్శించిన దాఖలాలు లేవు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలోనూ ఇదే విధమైన నిర్దయతో వ్యవహరించారు. కేంద్రప్రభుత్వం కార్మికుల పక్షాన నిలబడి ఉండక పోయి ఉంటే ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేవారు కాదా? న్యాయం కోసం ఉద్యమాలు ఎవరు చేసినా బెదిరించడం ఒక పద్ధతి మారింది.


ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా, తమ ప్రభుత్వ వైఫల్యాలకు విపక్షాలని నిందించడం, కేంద్రం అన్ని విధాలా సహకరిస్తున్నా విమర్శించడం, కేంద్ర నిధులతో చేపడుతున్న పథకాలకు కూడా తమ పేర్లే పెట్టుకోవడంలాంటివి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు ధైర్యం చెప్పి, అదుకోవలసిందిపోయి వారికి న్యాయంగా ఇవ్వాల్సిన రూ.10,000లో టిఆర్‌ఎస్ నాయకులు మానవత్వం కూడా మరచి చేతివాటం ప్రదర్శించి కాజేశారనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికైనా టిఆర్‌ఎస్ ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే దుబ్బాక ఫలితమే రాబోయే జి.హెచ్.ఎం.సి. ఎన్నికల్లోనూ, ఆ తరువాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కూడా ప్రతిఫలిస్తుందనేది నిర్వివాదాంశం. 


తెలంగాణలో బీజేపీ, టిఆర్‌ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారానికి రాష్ట్ర బిజెపి తెరదించిందనే చెప్పవచ్చు. బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రోజు నుంచే పార్టీ పంథా ఏ విధంగా ఉండబోతుందో పదే పదే స్పష్టం చేస్తూ వస్తున్నారు. దీంతో కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపయింది. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రజావ్యతిరేక పాలనకు నిరసనగా అందుకే బిజెపి కార్యకర్తలు కూడా ఉద్యమ పంథా ఎంచుకొని ముందుకు సాగుతున్నారు. దీనికి ప్రధాన కారణం సంజయ్ అనుసరిస్తున్న విధానాలు, చేస్తున్న ప్రకటనలే అని సులువుగానే అర్థమవుతుంది. రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు దుబ్బాక ఉప ఎన్నిక విషయంలో నిరూపితమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చి దుబ్బాకలో రఘునందన్ రావుకు మద్దతుగా నిలిచారంటే రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా మారిందో చెప్పాల్సిన అవసరం లేదు.


అంతేకాకుండా ఇటీవల సంజయ్ భవిష్యత్తులో బీజేపీ వైఖరిని, విధానాన్ని స్పష్టం చేస్తూ ఒక సంచలనాత్మక ప్రకటన చేశారు. ‘అవును, భారతీయ జనతా పార్టీ బరాబర్ హిందువుల పార్టీ’ అని ప్రకటించేశారు. దీంతో కనుమరుగవుతున్న కాంగ్రెస్ తోపాటు, మజ్లిస్ పార్టీని సంతృప్తి పరచడానికి తపిస్తున్న టిఆర్ఎస్ లను డిఫెన్స్ లోకి నెట్టినట్లయింది. రాష్ట్రంలో ఇప్పుడు ఎవరు ఎటువైపో తేల్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రధాన బాధ్యత కాంగ్రెస్, టి ఆర్ ఎస్ పార్టీలదే. ఇప్పటికయినా ఇచ్చిన హామీలు నెరవేర్చడమే కాకుండా చేసిన తప్పులు ఒప్పుకొని, అన్ని వర్గాల ప్రజలను సమదృష్టితో చూడకపోతే 2023 అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.


-శ్యామ్ సుందర్ వరయోగి

బీజేపీ రాష్ట్ర ప్రశిక్షణ కమిటీ కో కన్వీనర్

Updated Date - 2020-11-14T06:00:04+05:30 IST