రాష్ట్రంలో పత్తి పరిశోధన కేంద్రం

ABN , First Publish Date - 2020-06-04T08:34:28+05:30 IST

రాష్ట్రంలో పత్తి పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని (కాటన్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌) ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఏ రకమైన పత్తి

రాష్ట్రంలో పత్తి పరిశోధన కేంద్రం

  • డిమాండ్‌ ఉన్న వంగడాలపై పరిశోధన
  • అవసరమైతే మరిన్ని జిన్నింగ్‌ మిల్లులు
  • పత్తి ఎక్కువ సాగయ్యే ప్రాంతాల్లో ఏర్పాటు
  • డిమాండ్‌ ఉన్న పంటలపై అధ్యయనానికి 
  • సాగు ఉత్పత్తి, మార్కెటింగ్‌ కమిటీ
  • ఎరువుల వాడకం, యాంత్రీకరణపై 
  • సాగు పరిశోధన కమిటీ  
  • పట్టణ సమీప ప్రాంతాల్లో కూరగాయలు, 
  • పండ్ల సాగుకు ప్రోత్సాహం
  • పంటల లెక్కల కోసం గణాంక విభాగం
  • దేశంలో పోషకాహార భద్రత లేదు
  • ప్రజలు పౌష్ఠికాహారం తినేలా చూడాలి
  • నియంత్రిత సాగుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పత్తి పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని (కాటన్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌) ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఏ రకమైన పత్తి వంగడం వేస్తే ఉత్పత్తి ఎక్కువగా వస్తుంది? ఏ రకమైన పత్తికి మార్కెట్‌లో డిమాండ్‌ ఉంది? సాగు పద్ధతులు ఏమిటి? అనే  విషయాలను ఈ కేంద్రం పరిశోధించి, రైతులకు తెలియజేస్తుందని ఆయన చెప్పారు. నూలు పొడవు ఎక్కువగా ఉండటం వల్ల రాష్ట్రంలో పండే పత్తికి డిమాండ్‌ ఎక్కువగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో జిన్నింగ్‌, స్పిన్నింగ్‌ మిల్లుల సామర్థ్యంపై శాస్త్రీయమైన అంచనా వేయాలని అధికారులకు సూచించారు. అవసరమైతే మరిన్ని జిన్నింగ్‌, స్పిన్నింగ్‌ మిల్లులను నెలకొల్పుతామని, పత్తి పంట సాగయ్యే ప్రాంతాల్లోనే వీటిని స్థాపిస్తామని, అప్పుడు రైతులకు రవాణా పరంగా వ్యయప్రయాసలు తప్పుతాయని పేర్కొన్నారు.


ఈసారి వర్షాకాలం సీజన్‌తో రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమల్లోకి వస్తోందని, ఇది ప్రతీ ఏటా ప్రతీ సీజన్‌లో కొనసాగాలని సీఎం సూచించారు. రైతు లాభం కోసం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం కోసం జరుగుతున్న ఈ ప్రయత్నాన్ని రైతుల సహకారంతో అధికార యంత్రాంగం విజయవంతం చేయాలని కోరారు. వానాకాలం సీజన్‌లో నియంత్రిత సాగు విధానంలో అనుసరించాల్సి వ్యూహాన్ని ఖరారు చేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయరంగ నిపుణులతో కేసీఆర్‌ మూడు రోజుల పాటు విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ సమావేశాల్లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ బి. జనార్థన్‌ రెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్‌ రావు, అగ్రో బిజినెస్‌ కన్సల్టెంట్‌ గోపీనాథ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుధవారం వారికి కేసీఆర్‌ పలు సూచనలు చేశారు. 


అమ్ముడుపోయే పంటలనే వేయాలి

సాగు పద్ధతుల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులు వస్తున్నాయని.. ఆ మేరకు రాష్ట్రంలోనూ ఆధునిక సాగు పద్ధతులను అవలంబించాలన్నారు.మేలు రకమైన విత్తనాలు వేయడంలో.. ఎరువులు, పురుగు మందుల వాడకంలో శాస్త్రీయ అవగాహన ఉండాలన్నారు. సాగులో యాంత్రీకరణ పెరగాలని అన్నారు. ఈ విషయాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ తగు సూచనలను ఇచ్చేందుకు ‘వ్యవసాయ పరిశోధన కమిటీ నియమిస్తామని వెల్లడించారు. ఈ కమిటీ సూచించిన విధంగా సాగు పద్ధతుల్లో మార్పులు చేసుకోవాలని  అన్నారు. పట్టణ ప్రాంతాల్లో పండ్లు, కూరగాయలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుందని.. అందుకే పట్టణ ప్రాంత పరిసరాల భూముల్లో అనువైన నేలలను గుర్తించి పండ్లు, కూరగాయల సాగును ప్రోత్సహించాలన్నారు. దీని వల్ల రైతులకు, వినియోగదారులకు మేలు జరుగుతుందన్నారు.


దేశంలో, రాష్ట్రంలో ఆహార భద్రత సాధించినా పోషకాహార భద్రతను సాధించలేదని కేసీఆర్‌ పేర్కొన్నారు. ప్రజలు బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం లేదని, పుష్ఠికరమైన ఆహారాన్ని తీసుకునేలా వారిని ప్రోత్సహించాలని అన్నారు. రైతులు కూడా అలాంటి పంటలు పండించాలని సూచించారు. ప్రజల్లో జీవన ప్రమాణాలతో పాటు, రోగ నిరోధక శక్తి పెరగాలని ఆకాంక్షించారు. మార్కెట్లో అమ్ముడుపోయే పంటలనే సాగుచేసే అలవాటు రైతాంగంలో రావాలని, దీనికోసం వ్యవసాయ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. 


సీఎం చేసిన మరిన్ని సూచనలు.. 

  1. రాష్ట్రంలో, దేశంలో ప్రజల ఆహార అలవాట్లపై అధికారులు కచ్చితమైన అంచనాలు రూపొందించాలి. రాష్ట్రంలో, దేశంలో ఏ ప్రాంతానికి ఏ ఆహార పదార్థాల అవసరం ఉందో గమనించాలి. ప్రపంచవ్యాప్తంగా ఏ పంటకు డిమాండ్‌ ఉందో తెలుసుకోవాలి. దానికి అనుగుణంగా రాష్ట్రంలో పంటల సాగు జరగాలి. ఇది ఏ ఒక్క ఏడాదికో పరిమితం కావొద్దు. నిరంతరం సాగాలి. దీని కోసం ప్రభుత్వం ‘అగ్రికల్చర్‌ ప్రొడక్ట్స్‌ మార్కెటింగ్‌ కమిటీ’ని నియమిస్తుంది. నిపుణుల, నిష్ణాతులను ఈ కమిటీలో నియమిస్తారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల డిమాండ్‌, మార్కెటింగ్‌ ధరలు తదితర అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. ఏ పంటలు వేయడం వల్ల లాభం కలుగుతుందో సూచిస్తుంది. 
  2. పత్తిలో మట్టి, పుల్లలు, ఇతర చెత్త కలవడం వల్ల సరుకులో నాణ్యత (ఫేర్‌ ఆవరేజ్‌ క్వాలిటీ - ఎఫ్‌ఏక్యూ) శాతం పడిపోయి, ధర తగ్గుతోంది. కష్టపడి పంట పండించే రైతులు పత్తి ఏరిన తర్వాత అందులో చెత్తా చెదారం కలవకుండా జాగ్రత్త పడాలి. ఈ విషయంలో రైతులకు అవగాహ కల్పించాలి. 
  3. తెలంగాణలో విభిన్న స్వభావాలు కలిగిన నేలలున్నాయి.  ఏ పంట సాగుకు ఏ నేలలు అనువైనవో తేల్చాలి. దానికి అనుగుణంగా పంటల సాగు చేపట్టాలి. పంటల కాలనీల ఏర్పాటుకోసం నేలల విభజన చేయాలి. ఈ వివరాలను రైతులకు తెలపాలి. 
  4. ప్రజలు నిత్యం తినే పండ్లు, కూరగాయలను రాష్ట్రంలో దిగుమతి చేసుకుంటున్నాం. ఏఏ రకాల పండ్లు, కూరగాయలు దిగుమతి చేసుకంటున్నామో లెక్కలు తీయాలి. వాటిని మన రాష్ట్రంలోనే పండించాలి.   
  5. ఆలుగడ్డలు, అల్లం, ఎల్లిపాయలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. రాష్ట్రంలోనే వాటిని పండించాలి. ఎక్కడ పండించాలి? మేలైన సాగు పద్ధ్థతులు ఏమిటి? తదితర విషయాలపై రైతులకు మార్గదర్శనం చేయాలి. 
  6. రాష్ట్రంలో  ఏటా కొత్తగా ఆయకట్టు పెరుగుతూ వస్తోంది. పెరుగుతున్న విస్తీర్ణాన్ని సరిగ్గా అంచనా వేస్తూ, పంటల సాగు ప్రణాళికలను తయారు చేయాలి. ఉద్యానశాఖను మారిన పరిస్థితులకు అనుగుణంగా మార్చాలి. సరైన పంటల లెక్కల నమోదు కోసం ప్రత్యేకంగా స్టాటిస్టికల్‌ విభాగం ఏర్పాటు చేయాలి. 

Updated Date - 2020-06-04T08:34:28+05:30 IST