హైదరాబాద్‌కు కేసీఆర్‌

ABN , First Publish Date - 2021-09-10T08:16:36+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొమ్మిది రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకున్నారు.

హైదరాబాద్‌కు కేసీఆర్‌

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొమ్మిది రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈనెల ఒకటో తేదీన ఢిల్లీ వెళ్లిన ఆయన సుదీర్ఘంగా 9 రోజులపాటు దేశ రాజధానిలో గడపడం ఇదే మొదటిసారి. ఈసారి తన పర్యటనలో ఆయన ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, గజేంద్ర సింగ్‌ షెకావత్‌, నితిన్‌ గడ్కరీతో భేటీ అయి రాష్ట్రానికి సంబంధించి ఆయా అంశాలపై చర్చించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలవాలని సీఎం భావించినా.. ఆయన ఢిల్లీలో అందుబాటులో లేని కారణంగా అపాయింట్‌మెంట్‌ లభించలేదు. మంత్రులతో భేటీ అనంతరం మరో రెండు రోజులపాటు కేసీఆర్‌ ఢిల్లీలోనే ఉన్నారు.


కాగా, హైదరాబాద్‌ చేరుకున్న తర్వాత నమస్తే తెలంగాణ పత్రిక మేనేజింగ్‌ డైరెక్టర్‌ దామోదర్‌రావు ఇంటికి సీఎం కేసీఆర్‌ వెళ్లారు. వారం రోజుల కిందట దామోదర్‌రావు తండ్రి నారాయణరావు మరణించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నారాయణరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నారాయణరావు సతీమణి ఆండాళ్లమ్మను ఓదార్చారు. కేసీఆర్‌ వెంట ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌, ఎమ్మెల్యే జాజుల సురేందర్‌, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌ రెడ్డి, కె.నవీన్‌ కుమార్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్‌ రెడ్డి తదితరులు ఉన్నారు 

Updated Date - 2021-09-10T08:16:36+05:30 IST