చేతులెత్తి మొక్కుతున్నా... ఇంట్లనే ఉండుండ్రి

ABN , First Publish Date - 2020-03-25T08:47:54+05:30 IST

‘‘ఈ జబ్బు మహమ్మారి. యావత్‌ ప్రపంచాన్నీ గడగడలాడిస్తోంది. ఒక ఊరికో, పల్లెకో, ఒక వ్యక్తికో సంబంధించిన సమస్య కాదు. ఇది పరిమితమైన సమస్య కాదు.

చేతులెత్తి మొక్కుతున్నా... ఇంట్లనే ఉండుండ్రి

కనిపిస్తే కాల్చి పడేయాలనే పరిస్థితి తెచ్చుకోవద్దు

ఆర్మీని రంగంలోకి దింపే దుస్థితి మనకు అవసరమా?

స్వీయ నియంత్రణ పాటించి ఎక్కడి వాళ్లు అక్కడుండాలి

పోలీసులు ఇప్పటి దాకా దండం పెట్టారు.. ఇక దండాలు అందుకుంటారు

ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగాలి.. పది లక్షల ప్రజాసైన్యం కావాలి

క్వారంటైన్‌లో ఉన్నవారు నకరాలు చేస్తే పాసుపోర్టులు సస్పెండ్‌ చేస్తాం

కూరగాయలు అధిక ధరలకు అమ్మితే పీడీ యాక్ట్‌.. గుంపులుగా వెళ్లద్దు

జర్నలిస్టులకు పోలీసులు ఇబ్బంది కలిగించవద్దు.. మీడియాతో సీఎం కేసీఆర్‌

ముఖ్యమంత్రి చెప్పినా జీవోలో మీడియాకు లేని మినహాయింపు


లాక్‌డౌన్‌ కాలంలో ప్రజలకు రకరకాల సమస్యలు వస్తాయి. చావు, ఆరోగ్య సమస్యల్లాంటివి ఎదురవుతాయి.అప్పుడు డయల్‌ 100కు ఫోన్‌ చేయండి. మీరు గమ్య స్థానానికి వెళ్లేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తారు. వాహనం లేకపోతే పోలీసులే వాహనంలో తీసుకెళ్తారు. 


దండం పెట్టినా నలుగురు డాక్టర్లు కూడా దొరకరు. ఉన్న డాక్టర్లనే కాపాడుకోవాలి. పోలీసులు కూడా ముఖ్యం. వాళ్లు కూడా అలసిపోవద్దు. వాళ్లు అలసిపోతే శాంతిభద్రతలను కాపాడే వాళ్లు దొరకరు’’

ముఖ్యమంత్రి కేసీఆర్‌ 

హైదరాబాద్‌, మార్చి 24(ఆంధ్రజ్యోతి): ‘‘ఈ జబ్బు మహమ్మారి. యావత్‌ ప్రపంచాన్నీ గడగడలాడిస్తోంది. ఒక ఊరికో, పల్లెకో, ఒక వ్యక్తికో సంబంధించిన సమస్య కాదు. ఇది పరిమితమైన సమస్య కాదు. ప్రత్యేకమైన సందర్భం. మనమందరం అప్రమత్తంగా ఉండాలి. ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మంచిగానే ముందుకుపోవాలని ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వ చర్యలకు ప్రజలు సహకరించాలి. లేకపోతే చర్యలు ఆగవు. అమెరికాలో స్థానిక పోలీసులు నియంత్రించలేక ఆర్మీని పిలిపించి, అక్కడి ఎక్కువ ప్రాంతాలను అప్పగించారు. మన దగ్గర కూడా ఒకవేళ ప్రజలు పోలీసులకు సహకరించకపోతే 24 గంటల కర్ఫ్యూ పెట్టాల్సి వస్తుంది.


కనిపిస్తే కాల్చిపడేయండని ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుంది. అప్పటికీ పరిస్థితులు నియంత్రణలోకి రాకపోతే ఆర్మీని దించాల్సి వస్తుంది. ‘అలాంటి పరిస్థితి తెచ్చుకుందామా?’ అని ప్రజలంతా ఆలోచించాలి’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. ‘‘స్వీయ నియంత్రణ పాటించి ఎక్కడి వాళ్లు అక్కడ ఉంటే అయిపోతుంది కదా. ఒక వ్యక్తితో వెయ్యిమందికి కూడా వ్యాపించే పరిస్థితి ఉంటుంది. కర్ఫ్యూ, కనిపిస్తే కాల్చేయాలనే ఆదేశాలిచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దు. మనమే కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది’’ అని విజ్ఞప్తి చేశారు. వైరస్‌ వ్యాప్తిపై మంగళవారం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ అత్యవసర, అత్యున్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో  మాడ్లాడారు. ‘‘తెలంగాణలో మొత్తం 36 కేసులు నమోదయ్యాయి. ఒకరికి నయమైంది.


అంటే మొత్తం 35 కేసులు మాత్రమే. ఉన్న రోగుల్లో కూడా ఎవరికీ సీరియ్‌సగా లేదు. ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ పెట్టే పరిస్థితి లేదు. అందరూ కోలుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న వాళ్లకు ఏప్రిల్‌ ఏడో తేదీ వరకు నయమవుతుంది. ఆలోపు కొత్త కేసు రాకపోతే సున్నాకు వెళ్లే ఆస్కారం ఉంటుంది. కానీ, చర్యలు గట్టిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వైరస్‌ సోకని దేశమే లేదని వార్తలు వస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వాళ్లు తిరిగిన చోట ఇతరులకు సంక్రమించి ఉంటుందనే అనుమానంతో 19,313 మంది నిఘాలో ఉన్నారు. వాళ్ల పాసుపోర్టులు సీజ్‌ చేయాలని కలెక్టర్లకు చెప్పాం. కొంతమంది నియంత్రణలో ఉండటం లేదు. తప్పించుకుని పోతున్నారు. ఒకతను నిర్మల్‌లో మూడుసార్లు తప్పించుకునిపోయాడు. వీళ్లను నియంత్రించాలంటే ఏదో ఒకటి చేయాలి. 114 మంది అనుమానితులు నియంత్రణలో ఉన్నారు. వారిలో 82 మంది విదేశాల నుంచి వచ్చిన వాళ్లు, 32 మంది వాళ్లకు వచ్చిందేమో అని అనుమానిస్తున్న వాళ్లు. టెస్టింగ్‌ కోసం పంపించారు. బుధవారానికి రిజల్ట్‌ తెలుస్తుంది’’ అని సీఎం వివరించారు. సమస్య ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. మన రాష్ట్రంలో నుంచి బయటకు వెళ్లే అవకాశం లేదు. అడుగడుగునా చెక్‌పోస్టులు పెట్టారు. అసలు పోవడం ఎందుకు? దండం పెట్టి మనవి చేస్తున్నా. ఇంట్లోనే ఉండండి’’ అని కేసీఆర్‌ కోరారు. 


ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగాలి

‘‘నియంత్రణలో పోలీసులు, కలెక్టర్లు, మునిసిపాలిటీల సిబ్బందే కనిపిస్తున్నారు. ప్రజాప్రతినిధులు ఏమయ్యారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 మంది కార్పొరేటర్లు ఎక్కడకు పోయారు. వారితో పాటు హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలోని ఎమ్మెల్యేలు, మునిసిపాలిటీల చైర్మన్లు, కౌన్సిలర్లు రంగంలోకి దిగాలి. మంత్రులంతా జిల్లా, ఎమ్మెల్యేలు నియోజకవర్గ కేంద్రాలకు వెళ్లాలి. ఎమ్మెల్సీలూ వెళ్లాలి. ఆరోగ్య, వ్యవసాయ, మునిసిపల్‌ మంత్రులు మాత్రం హైదరాబాద్‌లో ఉండాలి’’ అని కేసీఆర్‌ చెప్పారు. 


పది లక్షల ప్రజాసైన్యం కావాలి

‘‘గ్రామ పంచాయతీ స్టాండింగ్‌ కమిటీల్లో 8,20,727మంది సభ్యులు ఉన్నారు. మనం ప్రజల కోసమే ఎన్నికయ్యాం. జడ్పీ చైర్‌పర్సన్లు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, డీసీసీబీ, డీసీఎంఎస్‌, సింగిల్‌ విండో చైర్‌పర్సన్లు, వార్డు మెంబర్లు అంతా ఎక్కడికి అక్కడ కథానాయకులు కావాలి. నేను దండం పెట్టి చెబుతున్నా. రంగంలోకి దిగాలి. ప్రజలకు అవగాహన కల్పించాలి. మునిసిపాలిటీల్లో 3400 పైచిలుకు వార్డులు ఉన్నాయి. మొత్తం 10 లక్షల ప్రజాసైన్యం తయారు కావాలి. సమాజాన్ని అప్రమత్తం చేయాలి. ఎక్కడన్నా దుర్మార్గులు ఉంటే లాఠీ పట్టుకుని నిలబడాలి. అంటే కొట్టాలని చెప్పడంలేదు. ఆర్మీని పిలవడం, కనిపిస్తే కాల్చి పడేయడంలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు’’ అని కేసీఆర్‌ అన్నారు. 


తెల్లవారేలోగా గమ్యస్థానాలకు చేరాలి

‘‘రాష్ట్రంలోకి వచ్చేవి, రాష్ట్రంగుండా పోయే 3,400 వాహనాలు వేర్వేరు సరిహద్దుల వద్ద ఉన్నాయి. వస్తువులు తీసుకొచ్చారు. మనకు కావాల్సిన వస్తువులూ  ఉన్నాయి. ఆ వాహనాలకు టోల్‌ మినహాయిస్తున్నాం. తెల్లవారేలోగా వాళ్లంతా గమ్యస్థానాలకు చేరాలి. ఆ లారీలను మళ్లీ రానివ్వరు. లాక్‌డౌన్‌ ప్రకటించే సమయానికి చేరుకున్న వాళ్లకు రిలీఫ్‌ రావాలి’’ అని కేసీఆర్‌ చెప్పారు.


డయల్‌ 100కు ఫోన్‌ చేయండి

‘‘ప్రజలకు రకరకాల సమస్యలు వస్తాయి. చావు, ఆరోగ్య సమస్యల్లాంటి ఎమర్జెన్సీ విషయంలో 100కు ఫోన్‌ చేయాలి. వెళ్లేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తారు. అవసరమైతే వాహన సదుపాయం కల్పిస్తార’’ని కేసీఆర్‌ తెలిపారు. 


రైతులు బెంబేలెత్తొద్దు.. ధాన్యం కొంటాం

‘‘వరి, మొక్కజొన్న పంట చేతికొస్తోంది. మొత్తం ప్రభుత్వం కొంటుంది. రైతులు బెంబేలెత్తాల్సిన అవసరమే లేదు. మద్దతు ధర, బ్యాంకు అకౌంటు తీసుకుని వస్తే చెక్కులు బ్యాంకుల్లో వేస్తారు. టౌన్లలో ఉండే మార్కెట్‌ కమిటీలకు రావద్దు. వాటిని మూసేస్తాం. ఉన్న చోటనే అమ్ముకోవాలి. ఐకేపీ కేంద్రాలు పెంచుతాం. ఎవరు ఎప్పుడు పంట తీసుకురావాలో కూపన్లు ఇస్తారు’’ అని రైతులకు కేసీఆర్‌ భరోసానిచ్చారు.


నకరాలు చేస్తే పాస్‌పోర్టుల సస్పెన్షన్‌

‘‘హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నవాళ్లపై గట్టి నిఘా ఉంచాం. నకరాలు చేసి కొందరు పారిపోతున్నారు. వాళ్ల పాస్‌పోర్టులు సీజ్‌ చేస్తాం. అయినా బుద్ధి లేకుండా ప్రవర్తిస్తే సస్పెండ్‌ కూడా చేస్తాం. అటువంటి వారి పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలని కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చాం. వాళ్ల మీద కచ్చితంగా చర్యలుంటాయి. క్వారంటైన్‌లోనే ఉండాలి’’ అని కేసీఆర్‌ తెలిపారు.


ధరలు పెంచితే పీడీ యాక్ట్‌

‘‘తెలంగాణలో ఏడాదికి 30 లక్షల మెట్రిక్‌ టన్నుల కూరగాయలు ఉత్పత్తి అవుతున్నాయి. వాటిలో మనం వాడుకునేది దాదాపు 27లక్షల మెట్రిక్‌ టన్నులే. 3 లక్షల మెట్రిక్‌ టన్నులు మిగులు ఉంది. అయినా కూడా ధరలు పెంచుతామంటే నడవదు. ఎక్కువ ధరలకు అమ్మితే పీడీ యాక్ట్‌ పెట్టి జైలుకు పంపుతాం. ఈ సమయంలో ధరలు పెంచి ప్రజల రక్తం పిండుకుంటామనే వాడెవడైనా లైసెన్సులు రద్దు చేస్తాం. దుకాణాలు సీజ్‌ చేస్తాం. జైలుకు పంపుతాం. తస్మాత్‌ జాగ్రత్త. సమాజానికి శాశ్వత ద్రోహులుగా గుర్తించి బ్లాక్‌ లిస్టులో పెడుతాం. తర్వాత ఎంత రోదించినా పట్టించుకోం’’ అని కేసీఆర్‌ హెచ్చరించారు. 


పోలీసులు ఇక దండాలు అందుకుంటారు

‘‘సాయంత్రం 7 నుంచి ఉదయం 7 వరకు కర్ఫ్యూ విధించాం.  ఎవరూ బయటకు రావద్దు. ఇప్పటిదాకా పోలీసులు దండం పెట్టారు. ఇక దండాలు అందుకుంటారు. అన్ని  షాపులు సాయంత్రం 6 గంటల్లోపు మూసేయాలి. ఏడులోగా అందరూ ఇళ్లకు చేరాలి. 6 తర్వాత ఒక నిమిషం పాటు తెరిచి ఉన్నా లైసెన్సు రద్దు చేస్తాం’’ అని కేసీఆర్‌  హెచ్చరించారు.


గ్రామాల్లో కంచెలు వేస్తున్నారు

‘‘చాలా గ్రామాల్లో ‘మేం రాము. వేరే వాళ్లెవరూ రావద్దు’ అని రాళ్లు పెట్టారు. కంచెలు వేశారు. గ్రామీణ ప్రాంతాలు బాగానే ఉన్నాయి. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పరిధిలోని ప్రజలు నియంత్రణ పాటించాలి’’ అని కేసీఆర్‌ సూచించారు. ‘‘వైరస్‌ విస్తరించడం లేదు. లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌ కేసులు రాలేదు. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రైళ్లు బంద్‌ అయ్యాయి. వేరే రాష్ట్రం, దేశం నుంచి మనకు వైరస్‌ వచ్చే అవకాశం లేదు. విదేశాల నుంచి వచ్చిన వాళ్ల ద్వారా వైరస్‌ వ్యాప్తి కాకుండా మనం కాపాడుకోవాలి. దేవుని దయ వల్ల అది చాలా తక్కువ మందికే ఉంది. రేపు ఎలా ఉంటుందో చెప్పలేం. ఎక్కువ మందికి వ్యాప్తి కాలేదు. దీన్ని ఇలాగే కాపాడుకుంటే ప్రాణాలు, రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకున్నవాళ్ల అవుతాం. తెలివికళ్లోళ్లం అవుతాం’’ అని కేసీఆర్‌ వివరించారు. 


షాపులకు గుంపులుగా పోవద్దు

‘‘షాపులకు గుంపులు గుంపులుగా పోవద్దు. గుమిగూడవద్దు. అందుకే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు అనుమతించాం. ప్రజలు ఒక చోట గుమిగూడితే ప్రమాదం. అలుసుగా తీసుకుని బలాదూర్‌గా తిరగద్దు. నాలుగు రోజులు కళ్లు మూసుకుంటే కచ్చితంగా రాష్ట్రాన్ని కాపాడుకున్నవాళ్లం అవుతాం’’ అని కేసీఆర్‌ చెప్పారు.


కవి సమ్మేళనాలు నిర్వహించాలి

‘‘ఐనంపూడి శ్రీలక్ష్మి అనే కవయిత్రి అద్భుతమైన కవిత రాశారు. ‘క్వారంటైనే ఇప్పుడు మన వాలంటైన్‌ అనుకోవాలి. ఒంటరిగా ఉంటూనే సమష్టి యుద్ధం చేయాలి’ అని ఆమె చెప్పారు. చాలా గొప్ప భావంతో ఎంతో అద్భుతంగా ఆమె రాశారు. ‘పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి? మనిషికి జీవితేచ్ఛ ఉంటుంది. కలరా, గత్తర లాంటి ఎన్నో వ్యాధులు పోయాయి. కరోనా కూడా పోతుంది’ అని ఆమె చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కవులంతా మంచి కవిత్వాలు రాయాలి. మీడియాలో ఎలాగో సంచలన వార్తలు చూపిస్తుంటారు. అది వేరే సంగతి. ఇద్దరు, ముగ్గురు కవుల్ని పిలిచి, ప్రజలకు అవగాహన కల్పించేలా సమ్మేళనాలు నిర్వహించండి. మీడియా సంస్థలు ఆ ప్రయత్నం చేయాలి’’ అని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. 


కలెక్టర్లూ కఠినంగా  ఉండండి

హైదరాబాద్‌, మార్చి 24(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ కట్టడిలో కలెక్టర్లు కఠినంగా, జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ప్రతి గ్రామం, పట్టణం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం సీఎం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునే క్రమంలో కఠినమైన నిబంధనలు అమలు చేయక తప్పదన్నారు. ప్రజలంతా వారి బాధ్యతలు పాటించాలని.. ఎవరికీ ఎలాంటి మినహాయింపు లేదని చెప్పారు. ఈ పరిస్థితి ఎప్పటి వరకు ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి హోమ్‌ క్వారంటెయిన్‌ చేయాలని ఆదేశించారు. ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాల్లోని అన్నీ ఆస్పత్రులను పరిశీలించాలని, మరమ్మతులుంటే వెంటనే చేయించాలని ఆదేశించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కార్మికులకు ఈ నెల మొత్తం వేతనం ఇచ్చేలా కంపెనీలకు ఆదేశాలివ్వాలని ఆదేశించారు.    


జర్నలిస్టులకు ఇబ్బంది కలిగించవద్దు

‘‘పోలీసులు, జర్నలిస్టులకు మధ్య గొడవ జరిగిందని తెలిసింది. అది మంచిది కాదు. మీడియాకు ప్రభుత్వమే అనుమతిచ్చింది. డీజీపీకి కూడా ఈ విషయం చెప్పాను. మీడియా వాళ్ల పట్ల దురుసుగా ప్రవర్తించద్దు. దాన్ని అపార్థం చేసుకోవద్దు. మీడియా లేకపోతే ప్రజలకు వార్తలు పోవు. నేను మాట్లాడేవి కూడా ప్రజలకు తెలియదు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు చెప్పిన విషయాలు ప్రజలకు తెలియాలంటే మీడియా ఉండాలి. వాళ్లను తిరగనివ్వాలి. వాళ్లేం గుంపులు గుంపులుగా వెళ్లరు. మనం పిలిస్తే తప్ప రారు. మీడియాను అనవసరంగా ఆపవద్దు. పోలీసులు సంయమనం పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీడియాతో ఘర్షణ వైఖరిని వీడాలి. అది మంచిది కాదు. ఏదైనా ఉంటే మీరు కూడా మనసులో పెట్టుకోవద్దు. ఆపద కాలంలో సరికాదు. ఏవైనా ఘటనలు జరిగితే డీజీపీ చర్యలు తీసుకుంటారు. దాన్ని పెద్దగా చేయద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్లు వార్తలు సేకరించి మన కోసం పనిచేస్తారు. దురుసుగా ప్రవర్తించవద్దు. జాగ్రత్తగా వ్యవహరించాలి’’ అని సీఎం కేసీఆర్‌ వివరించారు. 


వ్యవసాయానికి అనుమతి

‘‘గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని పనులకు అనుమతులు ఇస్తున్నాం. వ్యవసాయం జరగపోతే పాలు, కూరగాయలు రావు. పంటలు కోయాలి. ధాన్యం రావాలి. వ్యవసాయ పనులకు ప్రభుత్వం అనుమతిస్తోంది. వాటికి ఎలాంటి ఆటంకం లేదు. గుంపులుగా ఉండకూడదని చెబుతున్నాం. ఉపాధి హామీ పనులు కూడా గుంపులుగా ఉండకుండా చేసుకోవాలని చెబుతున్నాం. లేబర్‌ ఉండే క్యాంపుల వద్ద శానిటేషన్‌ బాగా చేయాలని కాంట్రాక్టర్లకు చెప్పాం. వాళ్ల ఆరోగ్యాలు కాపాడుకుంటూ పనిచేసుకోవాలని చెప్పాం’’ అని కేసీఆర్‌ వెల్లడించారు.

Updated Date - 2020-03-25T08:47:54+05:30 IST