కేర్‌..శానిటైజేషన్‌.. మంచి ఆహారం

ABN , First Publish Date - 2021-04-16T10:11:26+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో మెరుగైన వైద్య సహా యం అందిస్తూ, కరోనా నివార ణకు కృషి చేయాలని అధికార యంత్రాంగాన్ని సీఎం జగన్‌ ఆదేశించారు.

కేర్‌..శానిటైజేషన్‌.. మంచి ఆహారం

ప్రతి ఆస్పత్రిలో ఈ మూడూ ఉండాలి

ఫోన్‌చేసిన 3 గంటల్లో బెడ్‌ ఇవ్వాలి

అదనపు ఆక్సిజన్‌ సిద్ధంగా ఉండాలి

రెమ్‌డెసివిర్‌ రెడీ చేయండి

హోం ఐసొలేషన్‌లోని వారిపైనా శ్రద్ధ

అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష

వ్యాక్సిన్‌ కోసం తిరిగి కేంద్రానికి లేఖ 

పాజిటివిటి రేటు 6.3%: అధికారులు


అమరావతి, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో మెరుగైన వైద్య సహా యం అందిస్తూ, కరోనా నివార ణకు కృషి చేయాలని అధికార యంత్రాంగాన్ని సీఎం జగన్‌ ఆదేశించారు. ‘‘ఆస్పత్రి కేర్‌, శానిటైజేషన్‌, క్వాలిటీ ఫుడ్‌ అందించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఈ మూడు ప్రమాణాలు  ఆస్పత్రులు పాటించేలా చూడాలి’’అని సూచించారు. టీకా ఉత్సవ్‌లో భాగంగా బుధవారం ఒక్కరోజే 6.21 లక్షల వ్యా క్సిన్లు వేసినందుకు వైద్యఆరోగ్య శాఖ సిబ్బందిని సీఎం  అభినందించారు.


టెస్టింగ్‌..ట్రేసింగ్‌..ట్రీట్‌మెంట్‌ను విస్తృతం గా అమలుచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో గురువారం కరోనా నివారణ, వ్యాక్సిన్‌పై జగన్‌ సమీక్ష నిర్వహించారు. కరోనా ఉధృతి నేపథ్యంలో 104 కాల్‌ సెంటర్‌కు మరింత ప్రాచుర్యం కల్పించాలనీ, పెద్దఎత్తున ప్రచారం నిర్వహించాలనీ ఈసందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను జగన్‌ ఆదేశించారు. ఎవరైనా చికిత్స కోసం బెడ్‌ కావాలని కోరితే, కాల్‌ సెంటర్‌ ద్వారా సేవలందించాలన్నారు. హోం ఐసొలేషన్‌, కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ లేక ఆస్పత్రిలో అందించే సేవల విషయంలో వైద్యుల సూచనలు తీసుకోవాలన్నారు. అంబులెన్స్‌ సదుపాయాన్ని ఏర్పాటుచేయడం సహా ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంల సహకారంతో వైద్యసేవలు త్వరితగతిన అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. హోం ఐసొలేషన్‌లో ఉన్నవారిని కూడా పర్యవేక్షించాలనీ, రోగి ఫోన్‌చేసిన మూడుగంటల్లోనే ఆస్పత్రిలో బెడ్‌ సమకూర్చాలని స్పష్టం చేశారు.


‘‘గ్రీవెన్స్‌ కోసం 1902 నంబరును కేటాయించాలి. అలాగే కొవిడ్‌ కోసం 104 కాల్‌ సెంటర్‌ను వినియోగించాలి. ఈ రెండింటికీ విస్తృత ప్రచారం కల్పించాలి. ఈమేరకు ప్రధాన కూడళ్లు, బస్టాండ్‌లలో హోర్డింగ్‌లను ఏర్పాటుచేయాలి. కొవిడ్‌ వైద్య సేవల చార్జీ లపై దృష్టిపెట్టాలి. ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌ చికిత్సా ఫీజులపై నియంత్రణ ఉండాలి. ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు సహా ఇతర ప్రైవేటు ఆస్పత్రు లపైనా పర్య వేక్షణ ఉండాలి. సామాన్యులకు అందుబాటులో బెడ్‌, ఫీజుల ధరలు ఉండాలి. ప్రజలకు అర్ధమయ్యేలా ఫీజుల వివరాలు ప్రదర్శించాలి. అలాగే, ఎక్కువ ఫీ జులు వసూలు చేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా వివరించాలి. మెడికేషన్‌ సహా సమయానికి మందులు అందించాలనీ, ఇవి కచ్చితంగా అమ లయ్యేలా గతంలో మాదిరిగానే కొందరు అధికారులను నియమించుకోవాలి’’ అని సూచించారు. వ్యాక్సినేషన్‌పై అత్యంత శ్రద్ధ పెట్టాలనీ, 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ డోసులు ఇవ్వాలని సీఎం జగన్‌ కోరారు.


‘‘మరికొన్ని రోజులపాటు రోజుకు ఆరు లక్షల వ్యాక్సిన్లు వేయాలి. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సరఫరా అదనంగా ఉండేలా ఏర్పాట్లుచేయాలి. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు అందుబాటులో ఉంచాలి. మరిన్ని వాక్సిన్ల కోసం కేంద్రానికి లేఖ రాయాలి’’ అని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో  పాజిటివిటి రేటు 6.3శాతం ఉందని జగన్‌కు అధికారులు వివరించారు. వైద్యఆరోగ్యశాఖ పరిధిలోని 108 ఆస్పత్రుల్లో 4,899 బెడ్లు, 1987 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయనీ, 22,637 మంది హోం ఐసొలేషన్‌లో ఉన్నారని అధికారులు తెలిపారు.

Updated Date - 2021-04-16T10:11:26+05:30 IST