తరగతులు ఆన్‌లైన్‌.. పరీక్షలు ఆఫ్‌లైన్‌

ABN , First Publish Date - 2021-06-29T08:16:18+05:30 IST

రాష్ట్రంలో అన్ని రకాల తరగతులను ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తరగతులు ఆన్‌లైన్‌.. పరీక్షలు ఆఫ్‌లైన్‌

  • జూలై 1 నుంచి తరగతులు ప్రారంభం
  • నాలుగో తరగతి నుంచి పీజీ వరకు..
  • ఆగస్టు నుంచి 1, 2, 3 తరగతులకు
  • త్వరలోనే మార్గదర్శకాలు విడుదల
  • బడులకు రోజు విడిచి రోజు 50% టీచర్లు
  • వృత్తివిద్య పరీక్షలన్నీ జూలైలోనే..
  • ఉన్నతాధికారులతో మంత్రి సబిత సమీక్ష
  • విద్యా కార్యక్రమాల ఖరారు


హైదరాబాద్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అన్ని రకాల తరగతులను ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటో తరగతి నుంచి పీజీ వరకు ఇదే పద్ధతిని అనుసరించనుంది. పరీక్షలను మాత్రం ఆఫ్‌లైన్‌లో (భౌతికంగా) నిర్వహించనున్నారు. జూలై 1 నుంచి విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులను ప్రారంభించనున్నారు. నాలుగో తరగతి నుంచి ఇంజనీరింగ్‌, డిగ్రీ, పీజీ వంటి అన్ని కోర్సుల విద్యార్థులకు తరగతులను మొదలుపెట్టనున్నారు. రాష్ట్రంలో విద్యా బోధన విషయాలను ఖరారు చేయడానికి సోమవారం విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రత్యక్ష తరగతులు నిర్వహించే అవకాశం లేనందున, ఆన్‌ లైన్‌ క్లాసులే నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. 


సీఎం కేసీఆర్‌ ఆదేశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ నిర్ణయానికి వచ్చారు. విద్యార్థులు ఈ విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా ఉండేందుకు గుణాత్మకమైన డిజిటల్‌, ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించాలని నిర్ణయించారు. జూలై 1 నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థలన్నీ నాలుగో తరగతి, ఆ పైన అన్ని క్లాసుల విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆగస్టు నుంచి 1, 2, 3 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. పాఠశాలలకు ఉపాధ్యాయులు రోజు విడిచి రోజు 50 శాతం చొప్పున హాజరు కావాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణకు సంబంధించి ఆయా విభాగాలు మార్గదర్శకాలు జారీ చేయనున్నాయి.


పంచాయతీ టీవీలను వాడుకోవాలి: సబిత

సమావేశం అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల్లో ఎవరికైనా టీవీలు లేకపోతే గ్రామ పంచాయతీ కార్యాలయాలు, గ్రంథాలయాల్లోని టీవీలను ఉపయోగించుకోవచ్చని చెప్పారు. ఇందుకోసం కలెక్టర్లు ఏర్పాట్లు చేస్తారన్నారు. డిజిటల్‌, ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న దాదాపు 27 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలను సంబంధిత పాఠశాలలకు చేరవేసే ప్రక్రియ దాదాపు 90 శాతం పూర్తయిందని వివరించారు. ఆన్‌లైన్‌ క్లాసులపై విద్యార్థుల అనుమానాలను తీర్చడానికి టీచర్లు చర్యలు తీసుకుంటారన్నారు.


 ఆన్‌లైన్‌ తరగతులకు సంబంధించి ప్రైవేట్‌ విద్యా సంస్థలు కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని, వాటిని ఉల్లంఘించే స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆన్‌లైన్‌ క్లాసులు టి-శాట్‌, దూరదర్శన్‌, యూట్యూబ్‌ల్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు. పాఠశాలల విద్యార్థుల కోసం టీచర్లు సుమారు 75 వేల వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేశారన్నారు. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌, డిప్లొమా ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులకు పరీక్షలను నిర్వహించేందుకు ఆయా వర్సిటీలు కార్యాచరణ రూపొందించి, జూలైలో అమలు చేయాలని సూచించారు. పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ వరకు బోధనా సిబ్బంది రోజూ 50 శాతం చొప్పున హాజరుకావాల్సి ఉంటుందన్నారు. 


వర్సిటీల వారీగా పరీక్షల షెడ్యూల్‌

వృత్తి విద్యకు సంబంధించిన పరీక్షలన్నింటినీ జూలైలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే కొన్ని యూనివర్సిటీలు తమ పరిధిలోని కాలేజీల విద్యార్థులకు పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించాయి. మిగిలిన వర్సిటీలు కూడా త్వరలోనే షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ ఫైనలియర్‌ విద్యార్థులు సుమారు 40 వేల మంది వరకు ఉంటారు. వీరందరికీ వెంటనే పరీక్షలు నిర్వహిస్తేనే ఉద్యోగాలు, ఇతర ఉన్నత విద్యకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. డిగ్రీ విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహించనున్నారు. వీరేగాక ఇతర వృత్తి విద్య కోర్సులను చదువుతున్న వారికి కూడా త్వరలోనే పరీక్షలు నిర్వహించనున్నారు. వీరికి నేరుగానే పరీక్షలు పెట్టనున్నారు. ఉదయం కొన్ని సబ్జెక్టులకు, సాయంత్రం కొన్ని సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.


దోస్త్‌ నోటిఫికేషన్‌

రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాలకు వీలుగా దోస్త్‌ నోటిఫికేషన్‌ను జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశముంది. ఇంటర్‌ ఫలితాలను వెల్లడించడంతో డిగ్రీప్రవేశాలకు అవకాశం ఏర్పడింది. ఈ ప్రక్రియ కొనసాగింపులో భాగంగా దోస్త్‌ నోటిఫికేషన్‌ను జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు.

Updated Date - 2021-06-29T08:16:18+05:30 IST