కోర్టుకు వస్తే అర్థంకాని భాషతో ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు: ఎన్వీ రమణ

ABN , First Publish Date - 2021-12-26T01:51:16+05:30 IST

రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో సీజేఐ ఎన్వీ రమణకు జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ..

కోర్టుకు వస్తే అర్థంకాని భాషతో ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు: ఎన్వీ రమణ

విజయవాడ: రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో సీజేఐ ఎన్వీ రమణకు జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణ మాట్లాడుతూ ‘‘ఈ పురస్కారంతో నువ్వు ఇంకా చాలా‌ చేయాలనే హెచ్చరిక లాంటిది. నా బాధ్యత మరింత పెరగడంతో పాటు తెలుగువాడిగా గౌరవాన్ని నిలపెట్టడానికి కృషి చేస్తాను. నాకున్న పరిమితుల మేరకు న్యాయం అందేలా చూస్తా. రోటరీ క్లబ్ సభ్యులు సేవలను అభినందిస్తున్నాను. నా గుణగణాలను‌ చూసి నాకు అవార్డు ఇవ్వడాన్ని సంతోషిస్తున్నాను. 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోబోతున్నాం. నేడు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజ్యాంగంపై పెద్ద చర్చ నడుస్తుంది. దీనిపై ప్రజలంతా అవగాహన పెంచుకోవాలి. ప్రజలు తమ హక్కులు, బాధ్యతలు తెలుసుకోవాలి.’’ అని అన్నారు. 


ఎంతో అభివృద్ధి చెందుతున్నా... నిరక్షరాస్యత, అనారోగ్యం, విద్య, మూఢ నమ్మకాలతో బాధ పడుతున్నామని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. ‘‘భారత లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో లో‌ప్రజల్లో చైతన్యం తెస్తున్నాం. న్యాయ సహాయంకోసం, రాజ్యాంగ హక్కుల కోసం రోటరీ క్లబ్ సభ్యులు కొంత సమయం కేటాయించాలి. నేడు రూల్ ఆఫ్ లా అనేది చాలా ముఖ్యం. అది లేకుంటే చాలా అలజడి రేగుతుంది. మేధావి వర్గంగా ఉన్న వారంతా ప్రజలకు రాజ్యాంగం, హక్కుల గురించి తెలియ చెప్పాలి. అన్ని వ్యవస్థల తరహాలో న్యాయ వ్యవస్థ కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది. న్యాయ వ్యవస్థ, న్యాయ విద్య‌ ప్రాధాన్యతను మరచిపోతున్నాం. సమస్య వచ్చినా, హక్కులకు భంగం కలిగినా సామాన్య ప్రజలు న్యాయ స్థానాన్ని ఆశ్రయించాలి. చిన్నవారు నుంచి పెద్ద వారు‌వరకు అవగాహన పెంచుకోవాలి. నేటికీ సరైన అవగాహన ప్రజల్లో లేదు. కోర్టుకు వస్తే అర్ధం‌కాని భాషతో ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు. అన్నీ వారికి అర్ధం అయితేనే న్యాయస్థానం అంటే గౌరవం కలుగుతుంది. కోర్టు భవనాలు, మౌలిక సదుపాయాలను జాతీయ స్థాయిలో పెంచాలి. 4.60కోట్ల కేసులో మన దేశ న్యాయ స్థానాలలో ఉన్నాయి. కేసుల విచారణ సాగుతూ ఉండటానికి అనేక కారణాలు ఉంటాయి. ప్రభుత్వం, కార్యనిర్వాహక వర్గం చట్ట పరిధిలో‌ పని చేస్తే కోర్టుకు రానవసరం‌లేదు. పరిధి దాటితే... కోర్టులు జోక్యం చేసుకుంటాయి.. అది అవసరం కూడా. పౌర హక్కుల ఉల్లంఘన జరిగినా... ప్రశ్నించే తత్వం ప్రజల్లో ఉండాలి. కోర్టుకు వచ్చిన వారికి న్యాయం చేయాలని భావిస్తున్నా. న్యాయమూర్తుల నియామకాలు, ఇతర ఇబ్బందులపై మాట్లాడుతూనే ఉన్నా. బెజవాడ బ్లేజ్ వాడ అంటే... సైద్దాంతిక సిద్దాంతాల వల్లే. ఎంతో చైతన్య వంతమైన ప్రాంతం విజయవాడ. 1983 నుంచి విజయవాడతో నాకు ఎంతో అనుబంధం ఉంది.’’ అని  ఎన్వీ రమణ  తెలిపారు. 


తాను ఊహించినంత గొప్పగా విజయవాడ పురోగతి సాధించలేదని ఎన్వీ రమణ చెప్పారు. అన్ని రంగాల్లో ఈ నగరం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. సాంస్కృతిక, సాహిత్య రంగాలకు వేదిక విజయవాడ. నేడు అవన్నీ కనుమరుగై పోతున్నాయి. తెలుగుభాషను శిధిలం కాకుండా చూసుకోవాలి. ఇంగ్లీషు భాష నేర్చుకోండి... కానీ మాతృభాషతోనే అక్షరాలు దిద్దండి. మాతృభాషతోనే పునాది పటిష్ఠంగా ఉంటుంది. తెలుగు భాష, తెలుగు జాతి గొప్ప తనాన్ని అందరకీ తెలియ చేయండి. ఇదే నేను ప్రజలకు ఇచ్చే సందేశంగా స్వీకరించండి.’’ అని ఆయన సూచించారు. 






Updated Date - 2021-12-26T01:51:16+05:30 IST