యువరాజు పర్యటనకు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2021-04-12T05:36:15+05:30 IST

రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సోమవారం నగరంలో సుడిగాలి పర్యటన జరపనున్నారు. మంత్రి తన పర్యటనలో భాగంగా 21 పనులకు శంకుస్థాపనలు, 8 పనులకు ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ పనుల మొత్తం అంచనా వ్యయం రూ.2176.99 కోట్లు. ఒకే రోజు ఇన్ని పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడం ఇదే ప్రథమం. రెండు బహిరంగ సభల్లో కూడా పాల్గొంటారు. వరంగల్‌ నిట్‌లో మధ్యాహ్నం భోజనం అనంతరం విశ్రాంతి తీసుకుంటారు.

యువరాజు పర్యటనకు సర్వం సిద్ధం
ఆగమేఘాల మీద జరుగుతున్న అంబేద్కర్‌ జంక్షన్‌ సుందరీకరణ పనులు

నేడు నగరానికి మంత్రి కేటీఆర్‌ రాక
అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
ఉదయం నుంచి రాత్రి వరకు  సుడిగాలి పర్యటన
అధికారుల విస్తృత ఏర్పాట్లు.. పోలీసుల భారీ బందోబస్తు
పర్యవేక్షించిన ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు


హన్మకొండ, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సోమవారం నగరంలో సుడిగాలి పర్యటన జరపనున్నారు. మంత్రి తన పర్యటనలో భాగంగా 21 పనులకు శంకుస్థాపనలు, 8 పనులకు ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ పనుల మొత్తం అంచనా వ్యయం రూ.2176.99 కోట్లు. ఒకే రోజు ఇన్ని పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడం ఇదే ప్రథమం. రెండు బహిరంగ సభల్లో కూడా పాల్గొంటారు. వరంగల్‌ నిట్‌లో మధ్యాహ్నం భోజనం అనంతరం విశ్రాంతి తీసుకుంటారు.

రానున్న జీడబ్ల్యూఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా ఇన్ని కోట్ల విలువైన పనులను మంజూరు చేసింది. వీటిలో శంకుస్థాపనలు చేసే పనులే ఎక్కువగా ఉన్నాయి. ఇందులో అమృత్‌ అర్బన్‌ మిషన్‌ భగీరథ పనులదే అగ్రస్థానం. నగర ప్రజలకు సురక్షితమైన తాగునీటిని సరఫరా చేసేందుకు రూ.1589కోట్లతో ఈ పనులను చేపట్టారు. మంత్రి కేటీఆర్‌ ఉదయం 10గంటలకు రాంపూర్‌ చేరుకుంటారు. అక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు కేటీఆర్‌కు ఘనస్వాగతం పలుకుతారు. మంత్రి రాంపూర్‌ వద్ద అమృత్‌ పనులకు ప్రారంభోత్సవం చేయడంతో పర్యటన ప్రారంభమవుతుంది. రాత్రి 8 గంటల వరకు పర్యటన సాగుతుంది. మధ్యాహ్నం 1.20 గంటలకు ఖిలా వరంగల్‌ మైదానంలో బహిరంగ సభలో పాల్గొని నగర ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. మధ్యాహ్నం  2.30 గంటల వరంగల్‌ నిట్‌లో భోజనం చేస్తారు. సాయంత్రం 4.30 గంటల వరకు అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరిస్తారు. ప్రజాప్రతినిధులతో  మాట్లాడుతారు. సాయంత్రం 7.30 గంటలకు శాయంపేట జంక్షన్‌లో బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు  హైదరాబాద్‌కు తిరిగి వెళతారు.

ముమ్మరంగా ఏర్పాట్లు
పలుమార్లు వాయిదా పడిన అనంతరం కార్పొరేషన్‌ ఎన్నికల షెడ్యూల్‌ జారీ అవుతున్న తరుణంలో మంత్రి కేటీఆర్‌ పర్యటన ప్రాధాన్యత సంతరించుకున్నది. టీఆర్‌ఎ్‌సపార్టీ నేతలు ఈ పర్యటన నుంచి వీలైనంత ఎక్కువ రాజకీయ లబ్ధి పొందే దిశగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఆ మేరకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇద్దరు మంత్రులు ఎర్రబెల్లి దయకార్‌రావు, సత్యవతి రాథోడ్‌ వారం రోజులుగా నగరంలోనే ఉండి పర్యటన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్‌, నన్నపునేని నరేందర్‌, అరూరి రమేష్‌, మాజీ మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, ‘కుడా’ చైర్మన్‌ మర్రి యాదవ రెడ్డి, తాజా మాజీ కార్పొరేటర్లు, ఆశావహులు పర్యటన ఏర్పాట్లలో పాలుపంచుకుంటున్నారు. రెండు బహిరంగ సభలకు భారీగా జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యటన సందర్భంగా ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ పమేలాసత్పతి, ఇతర అధికారులు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. కరోనా వ్యాప్తిస్తున్న నేపథ్యంలో అన్ని రక్షణ చర్యలను తీసుకుంటున్నారు. ప్రతీ కార్యక్రమం వద్ద ప్రజాప్రతినిధులు, నేతలు, ప్రజలు విధిగా మాస్క్‌లు ధరించేట్లు, భౌతికదూరం పాటించేట్లు ఆంక్షలు పెట్టారు.

సుందరీకరణ
కేటీఆర్‌ రాక సందర్భంగా నగరాన్ని అందంగా ముస్తాబు చేశారు. ప్రధాన కూడళ్లను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. పరసరాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా  తీర్చిదిద్దారు. జంక్షన్లను పూల మొక్కలతో అలంకరించారు. నగరం శోభాయమానంగా కనిపించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. కేటీఆర్‌ పర్యటన వరంగల్‌, హన్మకొండ, కాజీపేటలో ఉండడంతో ఈ మూడు పట్టణాల ప్రధానరహదారులను అందంగా తీర్చిదిద్దారు.

భారీ భద్రత
మంత్రి కేటీఆర్‌ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన పాల్గొనే అన్ని కార్యక్రమాల వద్ద పోలీసు బలగాలను పెద్దఎత్తున మోహరిస్తున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు చొచ్చుకురాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అడుగడుగునా పోలీసుల నిఘా ఉంటుంది. బహిరంగ సభలు జరిగే ఖిలా వరంగల్‌, శాయంపేట ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కేటీఆర్‌ బస చేసే వరంగల్‌ నిట్‌ వద్ద కూడా భారీ భద్రత ఉంటుంది. కేటీఆర్‌ పర్యటన సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలకు దిగకుండా ముందే కట్టడి చేస్తున్నారు. ఇటీవల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నేపథ్యంలో విద్యార్థి నేతలు, నిరుద్యోగ సంఘాలు ఆందోళనకు దిగే అవకాశం ఉండడంతో పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.


ఆగమాగం పనులు.. హడావిడి ఏర్పాట్లు

మంత్రి కేటీఆర్‌ రాకతో ఉరుకులు పరుగులు
ఎప్పుడో పూర్తయిన పనులకు ఇప్పుడు మోక్షం


హన్మకొండ, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి) :
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వరంగల్‌ పర్యటన నేపథ్యంలో నగరంలో అభివృద్ధి పనులను ఆగమేఘాల మీద పూర్తి చేస్తున్నారు. మంత్రి కేటీఆర్‌కు ఓరుగల్లు నగరం అత్యంత సుందరంగా కనిపించేలా చేయడానికి జీడబ్ల్యూఎంసీ, ‘కుడా’, ఆర్‌అండ్‌బీ అధికారులు, సిబ్బంది చెమటోడుస్తున్నారు. అధికారులు రాత్రంతా నిద్రపోకుండా దగ్గరుండి పనులు చేయిస్తున్నారు. కానీ పనుల్లో నాణ్యతకు మాత్రం తూట్లు పొడుస్తున్నారు. ఇందుకు ఉదాహరణ అంబేద్కర్‌ జంక్షన్‌. ఇక్కడ నెలరోజుల కిందటే జంక్షన్‌ సుందరీకరణ పనులు మొదలుపెట్టారు. ఇన్నాళ్లూ నత్తనడక సాగుతూ వచ్చాయి. మంత్రి కేటీఆర్‌ పర్యటన ఖరారు కావడంతో అధికారులు సుప్తావస్థ నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చారు. పనులు ఇంకా అసంపూర్తిగా ఉండడంతో వారిపై మంత్రులు, ఎమ్మెల్యేల ఒత్తిడి పెరిగింది. కేటీఆర్‌ నగరానికి వచ్చేలోగా ఎట్టి పరిస్థితుల్లో పనులు పూర్తి కావాలని వార్నింగ్‌ ఇవ్వడంతో పెద్దసంఖ్యలో కూలీలను దించారు. యుద్ధప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు. ఆదివారం రాత్రి వరకు పనులు జరిగాయి.
మంత్రి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లే మార్గాల్లో అప్పటికప్పుడు మరమ్మతులు చేపట్టారు. అమృత్‌, మిషన్‌భగీరథ పనులతో దెబ్బతిన్న రోడ్లు అధ్వానంగా కనిపించకుండా ప్యాచ్‌వర్క్‌లు చేపట్టారు. రోడ్ల వెంట సైడ్‌బర్మ్‌లను అప్పటికప్పుడు మట్టితో నింపేశారు. రోడ్ల పనులకు  పోసిన కంకరను రోలర్లతో చదును చేశారు. ఎత్తుగా ఉన్న స్పీడ్‌ బ్రేకర్లను తొలగించేశారు. రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్తను ఎత్తిపోశారు. దెబ్బతిన్న డివైడర్లకు రంగులు పూసి మెరుగులు దిద్దారు. నీళ్లు లేక ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త పూల మొక్కలను అప్పటికప్పుడు తెచ్చిపెట్టారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల శిలా ఫలకాలు ఏర్పాటు చేసిన పరిసరాలను అందంగా తీర్చిదిద్దారు.
కొన్ని అభివృద్ధి పనులను ఎప్పుడో ప్రారంభించాల్సి ఉండగా, కేటీఆర్‌ పర్యటన నాలుగుసార్లు వాయిదా పడడంతో ఏడాదిన్నర కాలంగా అవి అలాగే ఉండిపోయాయి. నిర్వహణ లేక దుమ్ముకొట్టుకుపోయాయి. మంత్రి వస్తుండడంతో ఆ పరిసరాల్లో దుమ్ము దులిపి కొత్తరూపు ఇచ్చారు. హన్మకొండలోని జైన తీర్థంకరులున్న అగ్గలయ్య పర్యాటక ప్రాంతం పనులు ఎప్పుడో పూర్తయ్యాయి. ప్రారంభోత్సవం జరగలేదని సందర్శకులకు ఇన్నాళ్లూ అనుమతివ్వలేదు. భద్రకాళీ బండ్‌ పరిస్థితి కూడా అంతే. ఈ బండ్‌ సుందరీకరణ కూడా ఎప్పుడో పూర్తయింది. అయినా ప్రజాప్రతినిధులు, ‘కుడా’ అధికారులు అడపాదడపా అక్కడికి వెళ్లి పనులు పర్యవేక్షిస్తున్నట్టు ఫొటోలు దిగుతూ వచ్చారు. కేటీఆర్‌ రాకతో ఎట్టకేలకు ప్రారంభోత్సవం జరుగుతోంది. బట్టల బజార్‌లోని ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి కూడా అంతే. ఇది పూర్తయి ఏడాది దాటిపోయింది. వాహనాల రాకపోకలతో అది ఎప్పుడో పాతబడి పోయింది. ఇన్నాళ్లకు ప్రారంభోత్సవానికి మోక్షం లభించింది.





Updated Date - 2021-04-12T05:36:15+05:30 IST