8 నుంచి సిటీ బస్సులు?

ABN , First Publish Date - 2020-06-04T08:39:21+05:30 IST

హైదరాబాద్‌ నగరంలో ఈనెల 8 నుంచి సిటీ బస్సులను నడపాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. రవాణా శాఖ మంత్రి

8 నుంచి సిటీ బస్సులు?

  • అధికారులతో రవాణా మంత్రి చర్చలు
  • సీఎం తుది ఆమోదం కోసం ఎదురుచూపు
  • టికెట్‌ తీసుకోకపోతే ప్రయాణికుడిదే బాధ్యత
  • కండక్టర్లు, డ్రైవర్ల తొలగింపు ఉండదు
  • రెండు, మూడు అవకాశాలిస్తూ హెచ్చరికలు
  • శ్రామిక్‌లు, మెకానిక్‌లకూ ఉద్యోగ భద్రత!

హైదరాబాద్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ నగరంలో ఈనెల 8 నుంచి సిటీ బస్సులను నడపాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఆర్టీసీ ఉన్నతాధికారులతో బుధవారం ఈ అంశంపై చర్చించారు. ప్రస్తుతం జిల్లా సర్వీసులు మినహా సిటీ, అంతర్రాష్ట్ర సర్వీసులు నడవడం లేదు. ఈనెల 8 నుంచి అంతర్రాష్ట్ర ప్రయాణాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించినందున సిటీ, అంతర్రాష్ట్ర బస్సులు నడపడంపై అధికారులతో మంత్రి చర్చించారు. అయితే అంతర్రాష్ట్ర సర్వీసులకు పొరుగు రాష్ట్రాల అనుమతులు అవసరం కాబట్టి ఆ అంశంపై అంత సీరియ్‌సగా చర్చ జరుగలేదు. సిటీ బస్సులు నడిపితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రయాణికుల్లో భరోసా ఎలా నింపాలన్న అంశాలు చర్చకు వచ్చాయి.


8 నుంచి బస్సులను ప్రారంభించే విషయాన్ని తుది ఆమోదం కోసం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని, ఆయన అనుమతిస్తే నడపాలని నిర్ణయించారు. మంత్రి పువ్వాడ అజయ్‌ బుధవారం ఖైరతాబాద్‌లోని తన చాంబర్‌లో అధికారులతో సమీక్షించారు. ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన సుదీర్ఘ సమ్మె సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిబ్బందికి పలు వరాలు కురిపించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా కండక్టర్లకు, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. బస్సులో టికెట్‌ తీసుకోకపోతే ప్రయాణికుడినే బాధ్యుడిని చేస్తామని, కండక్టర్‌కు ఉద్యోగ భద్రత కల్పిస్తామంటూ సమ్మె సందర్భంలో సీఎం భరోసా ఇచ్చారు. దీనిపై ఆర్టీసీ అధికారులు కసరత్తు ప్రారంభించారు. అయితే కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఈ అంశం పెండింగ్‌లో పడిపోయింది. దీనిపై మంత్రి తాజాగా సమీక్ష నిర్వహించి, అధికారులను వివరాలు కోరారు. దాంతో అధికారులు ఉద్యోగ భద్రతపై మంత్రికి పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఇది వరకున్న నిబంధనలు, మార్చబోయే నిబంధనల గురించి మంత్రికి వివరించారు.


బస్సులో డబ్బు తీసుకుని టికెట్‌ ఇవ్వకపోతే ఇదివరకు కండక్టర్‌ను విధుల నుంచి తొలగించేవారు. ఇప్పుడు ఈ నిబంధనను సరళీకరించనున్నారు. కండక్టర్‌ను ఉద్యోగం నుంచి తొలగించకుండా ఒకటోసారి, రెండోసారి, మూడోసారి... అంటూ హెచ్చరికలు జారీ చేస్తారు. కండక్టర్‌ను డిపో స్పేర్‌లో పెట్టడం లేదంటే సస్పెండ్‌ చేయడం వంటి శిక్షలు ఉండవు. టికెట్‌ తీసుకోకపోతే ప్రయాణికుడినే పూర్తి బాధ్యుడిగా చేసి, జరిమానా వేస్తారు. ఇదివరకు బస్సులు ప్రమాదాలకు గురై ప్రాణనష్టం జరిగితే... దానికి డ్రైవర్‌ను బాధ్యుడిని చేసి, సర్వీసు నుంచి తొలగించే వారు. ఇకపై అలా చేయకుండా మరోసారి ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడాలని హెచ్చరిస్తారు. అవసరమనుకుంటే డ్రైవర్‌కు మరింత మెరుగైన శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. సరైన కేఎంపీఎల్‌ (కిలోమీటరు పర్‌ లీటర్‌) రాకపోయినా డ్రైవర్లకు చార్జిషీట్లు ఇచ్చి డిపో స్పేర్‌లో పెట్టేవారు. అలాంటి నిబంధనలు కూడా ఇక ఉండవు. ఇవే కాకుండా శ్రామిక్‌లు, మెకానిక్‌లకూ ఉద్యోగ భద్రత కల్పించే అంశాలపై చర్చించారు.


ఈ కొత్త నిబంధనలపై త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం. సంస్థలో ఖర్చును తగ్గించుకోవడంపైనా చర్చ జరిగింది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఆర్టీసీ చాలా నష్టపోయింది. ఇలాంటి సందర్భంలో దుబారాను తగ్గించుకోవాలని మంత్రి పువ్వాడ అధికారులకు సూచించారు.  ఉదాహరణకు సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న 6 పెట్రోలు బంకుల్లో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని తొలగించాలని నిర్ణయించారు. నగరంలో బస్సుల సంఖ్య తగ్గిపోయి, మిగులు సిబ్బంది ఉన్నందున... వీరిలో కొంత మందిని పెట్రోలు బంకుల్లో పని చేయించాలని నిర్ణయించారు. ఇలా ఒక్కో విభాగం పరిధిలో ఎలాంటి వ్యయాన్ని తగ్గించవచ్చో త్వరలో ఒక నివేదికను రూపొందించాలని మంత్రి ఆదేశించారు. ఏప్రిల్‌ నెల వేతనాల చెల్లింపునకు నిధుల సమీకరణపై చర్చించారు.  సాధారణ రోజుల్లో ఆర్టీసీకి రోజుకు రూ.12-13 కోట్ల రాబడి వచ్చేది. లాక్‌డౌన్‌ కారణంగా ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది.


దీంతో సిబ్బందికి ఏప్రిల్‌ నెల వేతనాలు ఇంకా చెల్లించలేదు. అధికారులు, సిబ్బందికి 50 శాతం వేతనాలే చెల్లిస్తున్నారు. ఇపుడు దీనికి కూడా నిధులు లేవు. వీటిని ఎక్కడి నుంచి సమీకరించాలి, డీజిల్‌ బిల్లులను ఆపుదామా, అద్దె బస్సుల చెల్లింపులను నిలిపివేద్దామా అన్న విషయాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ, ఈడీలు పురుషోత్తం, టీవీ రావు, యాదగిరి, వినోద్‌, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-04T08:39:21+05:30 IST