పౌరుల సమాచారం.. కేంద్రం గుప్పిట

ABN , First Publish Date - 2021-11-30T08:00:58+05:30 IST

ఓ నాలుగేళ్ల క్రితం.. 2017-18లో రాష్ట్రంలో దాదాపు 5 లక్షల రేషన్‌ కార్డులను రద్దుచేశారు. దీని తొలగింపునకు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానమేంటో తెలుసా..

పౌరుల సమాచారం.. కేంద్రం గుప్పిట

  • ఓటరు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, రేషన్‌దారుల వివరాలు సేకరణ
  • అన్ని పథకాలకు ఇక ఈ వివరాలే ప్రామాణికం
  • జనన, మరణ రిజిస్ట్రేషన్‌ చట్టం సవరణ ముసుగు
  • రాష్ట్రాల మరో అధికారానికీ కత్తెర


హైదరాబాద్‌, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): ఓ నాలుగేళ్ల క్రితం.. 2017-18లో రాష్ట్రంలో దాదాపు 5 లక్షల రేషన్‌ కార్డులను రద్దుచేశారు. దీని తొలగింపునకు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానమేంటో తెలుసా..? రేషన్‌కార్డు లబ్ధిదారుల వివరాలను రవాణా శాఖ వద్ద ఉన్న డ్రైవింగ్‌ లైసెన్స్‌ వివరాలతో, రిజిస్ట్రేషన్‌ శాఖ వద్ద ఉన్న ఆస్తుల వివరాలతో అనుసంధానించారు. కార్లు, ఆస్తులు ఉన్నవారి వివరాలు సేకరించాక.. అనర్హులని భావించి వారి రేషన్‌ కార్డులు తొలగించారు. క్షేత్రస్థాయి విచారణ లేకుండా కేవలం డేటా ఆధారంగా కార్డులు తొలగించడంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. దీంతో జీవనోపాధి కోసం రుణాలపై ట్యాక్సీ, క్యాబ్‌లు కొనుక్కున్నవారు, వ్యవసాయ భూములున్న రైతులు రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది రేషన్‌ కార్డులను కోల్పోయారు. వారికి ఇంతవరకు కార్డులు ఇవ్వలేదు. అచ్చం ఇదే తరహాలో వేర్వేరు ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న పౌరుల సమాచారం సేకరించి.. దాని ఆధారంగా లబ్ధిదారుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం రాష్ట్రాల నుంచి పౌరుల సమాచారం సేకరణకు ప్రణాళికను సిద్ధం చేస్తోంది.


జనన, మరణాల చట్టంలో సవరణలు

పౌర సరఫరాలు, రవాణా లాంటి శాఖల నిర్వహణ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. వీటి పరిధిలో రేషన్‌ కార్డులు, డ్రైవింగ్‌ లైసెన్సులను రాష్ట్రమే అందజేస్తుంది. ఓటరు జాబితా వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఈ శాఖలు సేకరించిన పౌరుల వివరాలను భద్రపరిచే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. ఈ సమాచారం తమ వద్ద కూడా ఉండాలన్న ఉద్దేశంతో కేంద్ర హోం శాఖ కొత్త ఆలోచన తెరపైకి తెచ్చింది. జనన, మరణాల రిజిస్ట్రేషన్‌ బాధ్యతను ఇకనుంచి పూర్తిగా తామే నిర్వహిస్తామంటూ జనన, మరణాల రిజిస్ట్రేషన్‌ చట్టం-1969కి సవరణకు సిద్ధమైంది. ఈ చట్టంలో సవరణలు జరగటం ఇదే తొలిసారి కాదు. 2012లో యూపీఏ-2 ప్రభుత్వంలోనూ సవరణలు జరిగినా.. అవి చిన్నచిన్నవే. ఈసారి మొత్తం వ్యవస్థనే కేంద్రం తన ఆధీనంలోకి తీసుకోనుంది. దీని ప్రకారం జనన, మరణ రిజిస్ట్రేషన్‌ వివరాల పర్యవేక్షణ కేంద్ర హోంశాఖ ఆధీనంలోకి వెళ్తుంది. అమలుకు జాతీయ స్థాయిలో రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఉంటారు. ఈయన పర్యవేక్షణలో రాష్ట్రాల్లో రిజిస్ట్రార్లు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. జనన ధ్రువీకరణపత్రం పొందాలంటే చిన్నారి తల్లిదండ్రుల ఆధార్‌ వివరాలనూ సమర్పించాలి. ఇక రాష్ట్రాల వద్ద ఉన్న పౌరుల జనన, మరణ రిజిస్ట్రేషన్‌ వివరాలతో పాటు కొత్తగా సేకరించే సమాచారాన్ని కేంద్రానికీ అందించాలి. జనన, మరణ వివరాలను డ్రైవింగ్‌ లైసెన్స్‌, రేషన్‌ కార్డులు, ఓటరు జాబితా, పాస్‌పోర్టు, ఆధార్‌ వివరాలతో అనుసంధానిస్తామని కేంద్ర హోం శాఖ సవరణల్లో స్పష్టం చేసింది. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వాలు తమ వద్ద ఉన్న పౌరుల సమాచారాన్నీ కేంద్రంతో పంచుకోవాల్సి ఉంటుంది.  


ఈ వివరాలే ప్రామాణికం..  

వివిధ శాఖల్లో సంక్షేమ పథకాల పేరిట కేంద్రం రూ. వేల కోట్లను ఖర్చు చేస్తుంటుంది. తన వాటా కింద రాష్ట్రాలకు నిధులు అందిస్తుంది. కానీ, వివిధ ప్రభుత్వ శాఖల్లోని పౌరుల సమాచారం అంతా అనుసంధానించడం ద్వారా అనర్హులు ఎవరనేది గుర్తించవచ్చన్నది కేంద్రం ఆలోచన. ముందుగా నిధులు ఎక్కువగా అందిస్తున్న శాఖలపై దృష్టిసారించాలని భావిస్తోంది. ఇప్పటికే కేంద్రం నిధులు, రాయితీలు పొందుతున్న లబ్ధిదారుల్లో అనర్హులను డేటా సాయంతో గుర్తించాలన్న ఉద్దేశం కనిపిస్తోంది.  క్షేత్ర స్థాయి విచారణ జరపకుండా కేవలం పౌరుల డేటా ఆధారంగా అనర్హులుగా భావించి తొలగిస్తే.. రాష్ట్రంలో రేషన్‌ కార్డుల తొలగింపులో దొర్లిన తప్పులే మళ్లీ జరుగుతాయని ఫోరం ఆఫ్‌ ఐటీ ప్రొఫెషనల్స్‌ రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్‌ చంద్ర పేర్కొంటున్నారు.


రాష్ట్రాలకూ ఇరకాటమే..

రాష్ట్ర ప్రభుత్వాలకూ ఇది ఇబ్బందికర సమస్యే. తెలుగు రాష్ట్రాల్లోని సాగునీటి ప్రాజెక్టులను తమ ఆధీనంలోకి తీసుకోవాలని కేంద్రం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. అలాగే విద్యుత్తుత్పత్తి సంస్థలపైనా అజమాయిషీ చలాయిస్తోంది. ఇక రాష్ట్రాల చేతుల్లోని సహకార వ్యవస్థనూ కేంద్రం గుప్పిట్లోకి తీసుకుంది. ఇప్పుడు జనన, మరణ నమోదు చట్టం సవరణ అంటే.. మరో అధికారాన్ని గుంజుకోవడమేనని నిపుణులు పేర్కొంటున్నారు. జనన, మరణ నమోదు చట్టం-1969 సవరణలపై కేంద్ర హోంశాఖ ఇప్పటికే ప్రజాభిప్రాయాలు, సలహాలను ఆహ్వానించింది. దీనికి డిసెంబరు 2వ తేదీ ఆఖరు. ఈ గడువు పూర్తవగానే కేంద్రం సవరణల ప్రక్రియను చేపట్టనుంది.

Updated Date - 2021-11-30T08:00:58+05:30 IST