- గిడిగి జలపాతంలో యువకుడి గల్లంతు
చిత్తూరు జిల్లా/వి.కోట : వి.కోట మండలం యాలకల్లు వద్ద ఉన్న గిడిగి జలపాతంలో మునిగి బెంగళూరుకు చెందిన శ్రీనివాసులు కుమారుడు అభిలాష్(23)గల్లంతైన ఘటన చోటుచేసుకుంది. సరదాగా స్నేహితులతో కలసి విహార యాత్రకు వచ్చిన ఆ యువకుడు నీటమునిగి పోవడం వారి కుటుంబంలో తీరని విషాదం నింపింది. బెంగళూరు బొమ్మనహళ్ళి ప్రాంతంలోని హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌కు చెందిన అభిలాష్ బీకాం చదువుతున్నాడు. శుక్రవారం తన ముగ్గురు స్నేహితులతో కలసి సెలవుల్లో సరదాగా గడిపేందుకు గిడిగి జలపాతం వద్దకు రెండు ద్విచక్ర వాహనాల్లో చేరుకున్నారు.
అక్కడ నలుగురూ ఆటలాడుతూ నీళ్ళలోకి దిగారు. అభిలాష్ కాస్త లోతుకు దిగడంతో పైనుంచి దూకుతున్న నీటి ఉధృతికి సుడులు తిరిగి యువకుడిని నీళ్ళలోకి లాగేసుకుంది. ఈతరాని అతడి స్నేహితులు గమనించి కాపాడమని కేకలు వేశారు. విషయం తెలుసుకున్న సీఐ ప్రసాద్‌బాబు, ఎస్‌ఐ రాంభూపాల్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని గజఈతగాళ్ళతో కలసి ఎంతవెతికినా ఫలితం లేకపోయింది. చీకటి పడటంతో పోటీసులు, యువకులు వెనుతిరిగారు. 2017లోనూ ఇదే తరహాలో వి.కోట అంబేడ్కర్ నగర్‌కు చెందిన యువకుడు నీటమునిగి మృతి చెందాడు.
ఇవి కూడా చదవండి