కాకతీయ సప్తాహం వేడుకలు వాయిదా

ABN , First Publish Date - 2022-07-12T06:13:13+05:30 IST

కాకతీయ సప్తాహం వేడుకలు వాయిదా

కాకతీయ సప్తాహం వేడుకలు వాయిదా
మీడియా సమావేశంలో చీఫ్‌విప్‌ వినయ్‌, ఎమ్మెల్యే నరేందర్‌, మేయర్‌ సుధారాణి...

 భారీ వర్షాలతో ఉత్సవాలకు ఆటంకం

 ప్రభుత్వ చీఫ్‌విప్‌ వినయభాస్కర్‌

 బండి సంజయ్‌ తీరు మార్చుకోవాలి: ఎమ్మెల్యే నరేందర్‌

కాళోజీ జంక్షన్‌(హనుమకొండ), జూలై 11: ఈ నెల 13 వరకు కొనసాగాల్సిన కాకతీయ వైభవ సప్తాహం వేడుకలను భారీ వర్షాల కారణంగా తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయభాస్కర్‌ తెలిపారు. హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాకతీయ సప్తాహం వేడుకలను  వైభంగా నిర్వహించడానికి ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఇదివరకే సమాయత్తమయ్యారని తెలిపారు. సప్తాహం వేడుకల మెదటి రోజు కాకతీయ వంశస్థుడైన కమల్‌ చంద్ర భంజ్‌దేవ్‌ను తీసుకువచ్చామని, రెండో రోజు సాహితీ వేత్తలు, కవులతో సమ్మేళనం  నిర్వహించినట్లు తెలిపారు. మూడో రోజు జపాన్‌ ప్రధాని హత్యను నిరసిస్తూ వేడుకలను వాయిదా వేసినట్లు చెప్పారు. ఆ మరుసటి రోజు నుంచి భారీ వర్షాల కారణంగా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ప్రకృతి విపత్తు నుంచి ప్రజలను కాపాడేందుకు తలమునకలై అప్రమత్తంగా ఉండడంతో వేడుకలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు వివరించారు.

సమైక్య రాష్ట్రంలో కాజీపేట రైల్వే జంక్షన్‌ కళకళలాడగా కేంద్ర ప్రభుత్వం పలు రైల్వే విభాగాలను ఇక్కడి నుంచి తరలించడంతో నేడు నిర్వీర్యం అయిపోతుందని వినయభాస్కర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కాజీపేటలో నెలకొల్పాల్సిన కోచ్‌ ఫాక్టరీని ఇతర ప్రాంతాలకు తరలించడంతో పాటు ప్రస్తుతం క్రూ లింక్‌లను కూడా తరలించే యత్నంలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోకపోతే తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. 

బండి సంజయ్‌ తీరు మార్చుకో: ఎమ్మెల్యే నరేందర్‌

వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ దేవుళ్ల పేరు చెప్పి సీఎం సారీ చెప్పాలని అనడం అవివేకమని అన్నారు. సంజయ్‌ తన భాషను మార్చుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.  గత సంవత్సరం నగరంలో వరదలు వచ్చి భారీ నష్టం సంభవించాక మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ నగరాన్ని సందర్శించారని, శివనగర్‌ నుంచి వెళ్లే భారీ నాలా నిర్మాణం కోసం రూ.120 కోట్ల నిధులను మంజూరు చేయగా నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేస్తున్నట్లు వివరించారు. వరంగల్‌ పట్టణంలో చుక్క వరద నీరు నిలవకుండా ప్రణాళికలు రూపొందించి పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో  మేయర్‌ సుధారాణి , కుడా చైర్మన్‌ సుందర్‌రాజ్‌యాదవ్‌, కార్పొరేటర్లు రంజిత్‌రావు, మధు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-07-12T06:13:13+05:30 IST