‘నాడు-నేడు’ అస్తవ్యస్తం

ABN , First Publish Date - 2020-07-07T08:52:17+05:30 IST

నాడు-నేడు... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకం.

‘నాడు-నేడు’ అస్తవ్యస్తం

తొలివిడత పనుల అంచనా రూ.3 వేల కోట్లు

ఆరు నెలల్లో పూర్తయింది రూ.670 కోట్ల పనులే

ఇసుక రాదు.. మెటీరియల్‌ అందదు.. కూలీలు రారు

మెటీరియల్‌ కొనుగోళ్లలో వైసీపీ నేతల పెత్తనం

మేం చెప్పినట్లే చేయాలంటున్న పేరెంట్స్‌ కమిటీలు

పనులు సాగటం లేదంటూ పైనుంచి హెచ్చరికలు

ఒత్తిడితో తలలు పట్టుకుంటున్న హెడ్‌ మాస్టర్లు

స్కూళ్లకు ఆహ్లాదకర రంగులు

వారానికోసారి నివేదిక ఇవ్వాలి: సీఎం జగన్‌ 

‘నాడు-నేడు’ పనులపై ముఖ్యమంత్రి సమీక్ష


అమరావతి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): నాడు-నేడు... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకం. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి వాటి స్వరూపాన్నే మార్చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గొప్పగా ప్రకటించారు. కానీ సీఎం చేసిన ప్రకటనకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు పొంతనే ఉండడం లేదు! ఈ పథకం అమలు తీరును సీఎం తరచూ సమీక్షిస్తున్నా.. క్షేత్రస్థాయిలో ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్న చందంగా పరిస్థితి ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది నవంబరులో ‘నాడు-నేడు’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాదిజనవరి 14న ప్రారంభించింది. తొలిదశలో భాగంగా 15,715 ప్రభుత్వరంగ పాఠశాలల్లో 9 అంశాలల్లో పనులు చేపట్టనున్నట్లు తెలిపింది.


కార్యక్రమం అమలుకు మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం... అందులోని సాధ్యాసాధ్యాలను మాత్రం విస్మరించడంతో ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. ఒకవైపు కరోనా భయంతో నిర్మాణ కూలీలు పనులకు వచ్చేందుకు సుముఖంగా లేకపోవడం, మరోవైపు లాక్‌డౌన్‌ వల్ల ఇసుక సకాలంలో అందకపోవడంతో పనులు ముందుకు సాగటం లేదు. ప్రభుత్వ పాఠశాలలకు అత్యవసరమైన అదనపు తరగతి గదుల నిర్మాణాలు చేపట్టకుండా.. రెండేళ్లలో కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న భవనాలకు మరమ్మతులు చేపట్టడం, రంగులు వేయడం వంటివి ఎవరి ప్రయోజనం కోసమో అర్థంకావడం లేదన్న విమర్శలున్నాయి.


నిర్దేశిత పాఠశాలల్లో తొలివిడతలో చేపట్టాల్సిన పనులకు దాదాపు రూ.3 వేల కోట్లు అవసరమని అంచనా వేశారు. కానీ ఆయా పనులు ప్రారంభించి 6 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకూ రూ.670 కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇందులో కూడా మెటీరియల్‌ సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు చేరింది రూ.500 కోట్లు మాత్రమే. మిగిలిన రూ.170 కోట్లు నేడో, రేపో వారికి వెళతాయని అంటున్నారు.


ఎందుకు జాప్యం?:

‘నాడు-నేడు’ కార్యక్రమాన్ని అమలు చేసే బాధ్యతను పూర్తిగా ప్రధానోపాధ్యాయుల భుజస్కంధాలపై పెట్టడం, పేరెంట్స్‌ కమిటీకి చెందిన ముగ్గురికి, ఇంజినీరింగ్‌ విభాగం నుంచి ఒకరికి, గ్రామసచివాలయంలోని సంబంధిత వ్యక్తికి చెక్కులపై సంతకం చేసే అధికారం కల్పించడంతో ఆచరణలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెబుతున్నారు. మెటీరియల్‌ కొనుగోళ్లు తాము చెప్పిన ప్రదేశం, షాపులోనే కొనాలని స్థానిక వైసీపీ నేతలు వారిపై ఒత్తిడి చేయడం హెచ్‌ఎంలకు ఇబ్బందికరంగా మారింది.


తాము చెప్పినట్లు చేయకుంటే చెక్కులపై సంతకాలు చేయబోమని పేరెంట్స్‌ కమిటీ సభ్యులు కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఎంఈవో, డిప్యూటీ ఈవోలు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యేలు సైతం పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ తరచూ హెచ్చరికలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రతి జిల్లాలో ఒక జాయింట్‌ కలెక్టర్‌ను ‘నాడు-నేడు’ పనులపై పర్యవేక్షణకు నియమించడంతో.. వాళ్లు నేరుగా ప్రధానోపాధ్యాయులకే నోటీసులు ఇస్తూ సస్పెన్షన్లకు పూనుకుంటున్నారు. పాఠశాలల్లో తమకు అన్ని రకాలుగా వస్తోన్న ఒత్తిళ్లను భరించలేక హెచ్‌ఎంలు తలలు పట్టుకుంటున్నారు. 

Updated Date - 2020-07-07T08:52:17+05:30 IST