ఆట మొదలైంది!

ABN , First Publish Date - 2022-07-29T09:56:25+05:30 IST

భారత్‌ తొలిసారిగా ఆతిథ్యం ఇస్తున్న ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌ ఆరంభ సంబరాలు అంబరాన్నంటాయి.

ఆట మొదలైంది!

వైభవంగా చెస్‌ ఒలింపియాడ్‌ ఆరంభోత్సవం

ప్రారంభించిన మోదీ 

నేటి నుంచి పోటీలు

చెస్‌ ఒలింపియాడ్‌ టార్చ్‌తో ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్‌, విశ్వనాథన్‌ ఆనంద్‌


చెన్నై (ఆంధ్రజ్యోతి): భారత్‌ తొలిసారిగా ఆతిథ్యం ఇస్తున్న ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌ ఆరంభ సంబరాలు అంబరాన్నంటాయి. గురువారం నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టేడియం మొత్తం రంగు రంగుల కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోయింది. అంతకుముందు ఐఎన్‌ఎ్‌స అడయార్‌ నుంచి కారులో స్టేడియానికి వస్తున్న మోదీకి అభిమానులు దారి పొడవునా పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. చెస్‌ గళ్ల బోర్డర్‌ ఉన్న శాలువా, లుంగీ ధరించిన మోదీ ఆహార్యంలోనూ ఎంతో ప్రత్యేకంగా కనిపించారు.


తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌.. ప్రధాని మోదీని వేదికపైకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సమయంలో మహాబలిపుర విశిష్ఠత, చదరంగ క్రీడ, భారతదేశం గురించి శాండ్‌ ఆర్టిస్ట్‌ సర్వం పటేల్‌ అద్భుతమైన రీతిలో ప్రదర్శించాడు. అనంతరం.. దేశవ్యాప్తంగా పర్యటించి ఆరంభ వేదిక వద్దకు చేరుకొన్న చెస్‌ టార్చ్‌ను దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌.. మోదీ, స్టాలిన్‌కు అందజేశాడు. ఈ సందర్భంగా ‘ఆట మొదలైంది’ అని ప్రధాని అన్నారు. వారు దీన్ని యువ గ్రాండ్‌ మాస్టర్‌ ప్రజ్ఞానంద, ఇతర ఆటగాళ్ల చేతికి అందించారు. టోర్నీలో పాల్గొంటున్న దేశాల పతాకాలను స్ర్కీన్లపై ప్రదర్శించారు.


వేదికను కూడా భారీ సైజు చెస్‌ పాన్‌లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ప్రత్యేక నృత్యగీతం ‘వణక్కం చెన్నై.. వణక్కం చెస్‌’ను ప్రదర్శించారు. తమిళనాడు సంస్కృతి, సంప్రదాయాలు, ప్రముఖ కవులు, చోళుల ప్రాభవం గురించిన నృత్య రూపకాలు కనువిందు చేశాయి. టీనేజర్‌ లిడియన్‌ నాదస్వర సంగీత కార్యక్రమం, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. ఫిడే గీతాన్ని వినిపించిన తర్వాత ఆటగాళ్లు ప్రతిజ్ఞ చేశారు. ఆ తర్వాత పోటీలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన మోదీ.. క్రీడాకారులనుద్దేశించి ప్రసంగించారు.


అందరూ విజేతలే..: ప్రధాని మోదీ

 క్రీడలకు ప్రజల్ని ఏకం చేసే శక్తి ఉందని, అందుకే అవి అందంగా ఉంటాయని మోదీ వ్యాఖ్యానించారు. ఆటల్లో పరాజితులు ఉండరు.. కానీ, గెలిచిన వారు, భవిష్యత్‌ విజేతలే ఉంటారని స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు. చెస్‌కు పుట్టినిల్లయిన భారత్‌లో చెస్‌ ఒలింపియాడ్‌ జరగడం ఇదే తొలిసారి అని వివరించారు. తమిళనాడు ఎంతో గొప్ప ఆటగాళ్లను తయారు చేసిందన్నారు. ‘చెస్‌తో తమిళనాడుకు ఎంతో చారిత్రక సంబంధం ఉంది. ఈ ప్రాంతం గొప్ప సంప్రదాయాలకు పుట్టినిల్లు, తమిళ భాష పురాతమైనది’ అని మోదీ కొనియాడారు. ఆతిథ్య ప్రాముఖ్యత గురించి తమిళ కవి తిరువళ్లువర్‌ రాసిన వాటిని ఉదహరించిన ప్రధాని.. దేవుళ్లు కూడా చదరంగం ఆడారని అన్నారు.


తిరువరూర్‌ జిల్లాలోని శివుడి ఆలయంలో దేవుడిని ‘సతురంగ (తమిళంలో చెస్‌) వల్లభనాథర’ అంటారని ఈ సందర్భంలో ప్రస్తావించారు. ఆరంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అనురాగ్‌ ఠాకూర్‌, ఎల్‌ మురుగన్‌, తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి, ప్రముఖ నటుడు రజనీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. చెస్‌ ఒలింపియాడ్‌ వచ్చేనెల 10న ముగియనుంది. శుక్రవారం తొలి రౌండ్‌ జరగనుంది. 

Updated Date - 2022-07-29T09:56:25+05:30 IST