రైజర్స్‌..అదే ఆట

ABN , First Publish Date - 2021-04-29T09:56:50+05:30 IST

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటతీరు మారలేదు. ఆడిన ఆరింటిలో ఐదో పరాజయం. మరోవైపు తిరుగులేని ఫామ్‌లో ఉన్న చెన్నై ఓపెనర్లు రుతురాజ్‌, డుప్లెసి హైదరాబాద్‌ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు..

రైజర్స్‌..అదే ఆట

చెలరేగిన  రుతురాజ్‌, డుప్లెసి

చెన్నై అలవోక గెలుపు 


సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటతీరు మారలేదు. ఆడిన ఆరింటిలో ఐదో పరాజయం. మరోవైపు తిరుగులేని ఫామ్‌లో ఉన్న చెన్నై ఓపెనర్లు రుతురాజ్‌, డుప్లెసి హైదరాబాద్‌ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు.. భారీషాట్లతో విరుచుకుపడి సన్‌రైజర్స్‌ ఫీల్డర్లను స్టేడియమంతా పరిగెత్తించారు..స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ సత్తాచాటినా అప్పటికే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది..మొత్తంగా ఆల్‌రౌండ్‌ షోతో సీఎ్‌సకే  టేబుల్‌ టాప్‌నకు  దూసుకు పోయింది. 


న్యూఢిల్లీ: బౌలింగ్‌, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌లో అమోఘ ప్రదర్శన చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరో గెలుపును ఖాతాలో వేసుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో  ఏడు వికెట్లతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను చిత్తుచేసింది. మొదట హైదరాబాద్‌ 171/3 స్కోరు చేసింది. మనీశ్‌ పాండే (46 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 61), డేవిడ్‌ వార్నర్‌ (55 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 57) హాఫ్‌ సెంచరీలు సాధించారు. చివర్లో కేన్‌ విలియమ్సన్‌ (10 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 26 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఎన్‌గిడి (2/35) రెండు వికెట్లు తీశా డు. అనంతరం లక్ష్యాన్ని చెన్నై 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 173 పరుగులు చేసి చేరుకుంది. రుతురాజ్‌ (44 బంతుల్లో 12 ఫోర్లతో 75), డుప్లెసి (38 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 56) అర్ధ శతకాలు చేశారు. రషీద్‌ ఖాన్‌ (3/36) మూడు వికెట్లు పడగొట్టాడు. రుతురాజ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. 


డుప్లెసి, గైక్వాడ్‌ దూకుడు 

అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ధాటికి ఛేదనలో చెన్నైకి ఎదురేలేకపోయింది. ఓపెనర్లు చూడముచ్చటైన షాట్లతో అలరించారు. ఖలీల్‌ వేసిన రెండో ఓవర్లో  డుప్లెసి కవర్స్‌ దిశగా చక్కటి ఫోర్‌తో తన షాట్లపరంపరకు తెరలేపాడు. సందీప్‌ శర్మ వేసిన తదుపరి ఓవర్లో కట్‌షాట్‌ ద్వారా బౌండ్రీతో రుతురాజ్‌ కూడా దూకుడు ఆరంభించాడు. ఖలీల్‌ మరో ఓవర్లో డుప్లెసి 4,4 దంచగా, సిద్దార్థ్‌ కౌల్‌ ఓవర్లో గైక్వాడ్‌, డుప్లెసి చెరో బౌండ్రీతో చెలరేగారు. దాంతో పవర్‌ ప్లేలో చెన్నై 50/0తో నిలిచింది. ఇక స్పిన్నర్‌ సుచిత్‌పై సీఎ్‌సకే ఓపెనర్లు మరింతగా విరుచుకుపడ్డారు. 4,4తో అతడికి స్వాగతం పలికిన గైక్వాడ్‌ సుచిత్‌ వేసిన రెండో ఓవర్లో ఫోర్‌, డుప్లెసి 6,4తో అతడికి చుక్కలు చూపారు.


ఈక్రమంలో తొలుత డుప్లెసి, తర్వా త గైక్వాడ్‌ హాఫ్‌ సెంచరీలు పూర్తి చేయడంతోపాటు మొదటి వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం ఏర్పరిచారు. హైదరాబాద్‌ గుండెల్లో గుబులు రేపిన ఈ జోడీని ఎట్టకేలకు రషీద్‌ విడదీశాడు. ఓ గూగ్లీతో రుతురాజ్‌ను బౌల్డ్‌ చేసి జట్టుకు ఊరటనిచ్చాడు. తన చివరి ఓవర్లో మొయిన్‌ అలీ (15), డుప్లెసిని వరుస బంతుల్లో రషీద్‌ పెవిలియన్‌ చేర్చినా..అప్పటికే చెన్నై విజయం అంచులకు చేరింది. ఆపై  రైనా (17), జడేజా (7) లాంఛనాన్ని పూర్తి చేశారు. 


వార్నర్‌, మనీశ్‌ సెంచరీ భాగస్వామ్యం 

టాస్‌ గెలిచి రెండో ఆలోచన లేకుండా బ్యాటింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌ ఆరంభంలో ఆడిన తీరు చూస్తే 140 రన్స్‌ చేయడమే గగనమనిపించింది. వార్నర్‌, పాండే అర్ధ శతకాలు చేసినా, సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పినా..స్కోరుబోర్డు అంత వేగంగా కదలలేదు. ఇక అప్పటిదాకా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను చెన్నై బౌలర్లు నియంత్రించగా..చివరి రెండు ఓవర్లలో విలియమ్సన్‌, కేదార్‌ జాదవ్‌ ఎదురు దాడికి దిగారు. ఫలితంగా శార్దూల్‌ ఏకంగా 20, సామ్‌ కర్రాన్‌ 13 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది.   మొదటి ఓవర్లోనే ధోనీ క్యాచ్‌ వదిలేయడంతో బతికి పోయిన బెయిర్‌స్టో దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 4వ ఓవర్లో తెలివైన బంతితో బెయిర్‌స్టోను కర్రాన్‌ అవుట్‌ చేశాడు.  పవర్‌ ప్లే ముగిసే సరికి హైదరాబాద్‌ 39/1తో నిలిచింది. అటు ఎన్‌గిడి, ఆఫ్‌స్పిన్నర్‌ మొయిన్‌ అలీకూడా వార్నర్‌, పాండే భారీ షాట్లు కొట్టేందుకు అవకాశమివ్వలేదు. 


ఈ తరుణంలో స్కోరుబోర్డులో ఊపుతెచ్చేలా శార్దూల్‌ ఓవ ర్లో మనీశ్‌ ఫోర్‌ దంచగా..ఆ 13 ఓవర్లో రైజర్స్‌ మొత్తం 10 పరుగులు రాబట్టింది. జడేజా ఓవర్లో మరో 4సాధించిన పాండే ఆపై హాఫ్‌ సెంచరీ కూడా పూర్తి చేశాడు. భారీ షాట్లు ఆడేందుకు ఇబ్బందిపడిన కెప్టెన్‌ వార్నర్‌ ఎట్టకేలకు ఎన్‌గిడి బౌలింగ్‌లో సిక్సర్‌ సాధించాడు. అనంతరం జడేజా ఓవర్లో మరో  సిక్సర్‌తో వార్నర్‌ హాఫ్‌ సెంచరీ చేశాడు. అయితే కొద్దిసేపటికే వార్నర్‌ ఇన్నింగ్స్‌కు ఎన్‌గిడి ముగింపు పలికాడు. దాంతో 106 పరుగులు తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. 18వ ఓవర్లోనే మనీశ్‌నూ ఎన్‌గిడి అవుట్‌ చేశాడు. మరో వైపు విలియమ్సన్‌ శార్దూల్‌ వేసిన 19వ ఓవర్లో 4,6,4,4తో దుమ్ము రేపాడు. ఆఖరి ఓవర్లో కేదార్‌ 4,6 కొట్టాడు.


స్కోరు బోర్డు

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: డేవిడ్‌ వార్నర్‌ (సి) జడేజా (బి) ఎన్‌గిడి 57; జానీ బెయిర్‌స్టో (సి) దీపక్‌ చాహర్‌ (బి) కర్రాన్‌ 7; మనీశ్‌ పాండే (సి) డుప్లెసి (బి) ఎన్‌గిడి 61; విలియమ్సన్‌ (నాటౌట్‌) 26; కేదార్‌ జాదవ్‌ (నాటౌట్‌) 12; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 171/3; వికెట్ల పతనం: 1-22, 2-128, 3-134; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 3-0-21-0; సామ్‌ కర్రాన్‌ 4-0-30-1; శార్దూల్‌ ఠాకూర్‌ 4-0-44-0; మొయిన్‌ అలీ 2-0-16-0; ఎన్‌గిడి 4-0-35-2; జడేజా 3-0-23-0. 


చెన్నై సూపర్‌ కింగ్స్‌: రుతురాజ్‌ (బి) రషీద్‌ 75; డుప్లెసి (ఎల్బీ) రషీద్‌ 56; అలీ (సి) జాదవ్‌ (బి) రషీద్‌ 15; జడేజా (నాటౌట్‌) 7; రైనా (నాటౌట్‌) 17; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 18.3 ఓవర్లలో 173/3; వికెట్ల పతనం: 1-129, 2-148, 3-148; బౌలింగ్‌: సందీప్‌ 3.3-0-24-0; ఖలీల్‌ 4-0-36-0; సిద్దార్ధ్‌ 4-0-32-0; సుచిత్‌ 3-0-45-0; రషీద్‌ 4-0-36-3. 

Updated Date - 2021-04-29T09:56:50+05:30 IST